Everest: ప్రపంచంలో అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం ఎవరెస్ట్. ఎంతోమంది సాహసికులు ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాలని కలలుగంటారు. నేపాల్ దేశంలో ఉన్న ఈ శిఖరం ఎత్తు 8,848 మీటర్లు. భారతీయులతో సహా ప్రపంచంలో చాలా మంది ఈ పర్వతాన్ని ఇప్పటికే అధిరోహించారు. అయితే, ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తు కలిగిన శ్మశానవాటికగా కూడా చెబుతున్నారు నిపుణులు.
ప్రతి సంవత్సరం సుమారు 800 మంది అధిరోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతారు. కానీ ఎక్కే వాళ్లందరిలో అందరూ సజీవంగా తిరిగి రావడం లేదన్నది చరిత్ర చెబుతోంది. 1953లో సర్ ఎడ్మండ్ హిల్లరీ, టెన్జిన్ షెర్పా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి చరిత్ర లిఖించారు. మరెందరో పర్వతారోహణ చేయాలనుకున్న వారికి ఆదర్శంగా నిలిచారు.
అక్కడి నుంచే అనుమతి
ఎవరెస్ట్ శిఖరానికి వెళ్లే మార్గం నేపాల్ దేశం నుంచి వెళుతుంది. ఎవరెస్ట్ శిఖరం నేపాల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతోంది. స్థానికులకు కూడా ఈ ఎవరెస్ట్ పర్వతం కారణంగా ఉపాధి దొరుకుతోంది. నేపాల్ ప్రభుత్వం భారతీయ పౌరులకు 1,500 నేపాలీ రూపాయలకే ప్రవేశించడానికి అనుమతి ఇస్తోంది. అయితే దాన్ని ఎక్కడానికి రూ.లక్షల వ్యయం అవుతుంది.
ఎందుకు చనిపోతారు?
ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలోనే అత్యంత ఎత్తు కలిగిన శ్మశానవాటిక అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే అక్కడ మరణించిన వారి మృతదేహాలను తిరిగి తీసుకురావడం సాధ్యం కాదు. ఈ మృతదేహాలను మంచులోనే పాతిపెట్టేస్తుంటారు. లేదా మంచులోనే పూడిపోతాయి. దీనికి ముఖ్య కారణం ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనుకునేవారి శారీరక మానసిక ధృడత్వాన్ని సరిగ్గా పరిశీలించకుండా అనుమతి ఇవ్వడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అది కూడా తక్కువ ధరకే అనుమతి ఇస్తుండడం మైనస్ అని చెబుతున్నారు. సరైన ఫిట్‌నెస్ పరీక్షలు లేకపోవడం గమనార్హం. ఎటువంటి అనుభవం లేకుండానే ఎక్స్‌డిషన్ కంపెనీలకు డబ్బు చెల్లించి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి సాహసికులు వెళ్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యక్తుల కారణంగా.. ఎవరెస్ట్‌కు వెళ్లే మార్గంలో ఎక్కువ రద్దీ ఏర్పడుతోంది. ఒక్కోసారి జామ్ కూడా అవుతోందట.
మన శరీరం తట్టుకోలేకపోతోందట..
మన శరీర నిర్మాణం అధిక ఎత్తును భరించలేదు. మనుషులు 8 వేల అడుగుల ఎత్తుకు వెళ్లగానే తలనొప్పి, వాంతులు, వికారం, తల తిరగడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఎత్తుకి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ స్థాయిలు క్షీణిస్తాయి. దీంతో ఎత్తులో ఆక్సిజన్ సిలిండర్ తప్పక ఉండాలి. సిలిండర్‌లో ఉన్న ఆక్సిజన్‌లోని ప్రతి నిమిషం విలువైనదే. సెరిబ్రల్ ఎడెమా మెదడులో వాపునకు కారణం అవుతుంది.
దీంతో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్లి.. ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. ఎంద మందిని అక్కడే మంచులో పూడ్చేస్తారో కచ్చితంగా లెక్కించడం సాధ్యం కాదంటున్నారు నిపుణులు. అందుకే ఎవరెస్ట్ పర్వతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శ్మశానవాటికగా నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: Everest: ఎవరెస్ట్ పర్వతారోహకులకు వింత అనుభవాలు.. మల వ్యర్థాలతో కంపు కొడుతున్న మంచుకొండలు!
Snow color: మంచుకెందుకు తెలుపు రంగు? నీటికెందుకు లేదు వర్ణం!
Tourist places: వసంత కాలంలో ఈ ప్రదేశాలకు వెళ్లడం మిస్ అవకండి!
