Chandrababu on Volunteers: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వాలంటీర్లపై రోజుకోమాట పూటకో మాట చెబుతోంది. ప్రజల మనసు గెలుచుకున్న వాలంటీర్లను గతంలో నానా రకాలుగా ద్వేషించి మాటలు అన్న వారే ఇప్పుడు ఆ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని ఒకసారి, కొనసాగిస్తామని మరోసారి చెబుతున్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఇంతకీ ఆయన వాలంటీర్లపై గతంలో ఏమన్నారు.. ఇప్పుడేమంటున్నారో ఓ లుక్కేద్దాం రండి.
వాలంటీర్లపై చంద్రబాబు తొలి నుంచి అక్కసు వెళ్లగక్కతున్నారు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన మొదట్లోనే.. వాలంటీర్లు పగటిపూట ఇంగ్లో మగవాళ్లు లేనప్పుడు తలుపు కొడుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. అలాగే ఏ ఇంట్లో ఎవరు అక్రమ సంబంధాలు పెట్టుకున్నారో వాకబు చేస్తున్నారంటూ కామెంట్స్ చేసిన చరిత్ర చంద్రబాబుది. గోనె సంచులు మోసే ఉద్యోగమంటూ గేలి చేశారు. వాలంటీర్లను ఉద్దేశించి అమ్మాయిలను ట్రాఫికింగ్ చేస్తున్నారంటూ ఆయన పార్ట్‌నర్ పవన్ కల్యాణ్ సైతం కామెంట్స్ చేశారు.
వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని చంద్రబాబు గతంలో అన్నారు. ఇంటింటికీ మంచి చేస్తున్నవాలంటీర్ వ్యవస్థపై ఇంతగా అక్కసు వెళ్లగక్కిన ఈ ఇద్దరు నేతలు.. ప్రజల్లో వ్యతిరేకత వచ్చే సరికి యూటర్న్ తీసుకున్నారు.
ఎన్నికల నేపథ్యంలో తాజాగా తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయించిన చరిత్ర చంద్రబాబుది. వాలంటీర్ల వ్యవస్థను దూరం పెట్టాలని ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం ఆ మేరకు ఆదేశాలు జారీ చేయడంతో ఇక రాష్ట్రంలో వృద్ధులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. దాదాపు 30 మందికిపైగా అవ్వాతాతలు రాష్ట్రంలో ఎండల దాటికి తట్టుకోలేక మృత్యువాతపడిన పరిస్థితులు కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి.
56 నెలలుగా ప్రతి నెలా ఒకటో తారీఖునే ఠంచనుగా అది ఆదివారమైనా, సెలవుదినమైనా, పండుగ రోజైనా చిక్కటి చిరునవ్వుతో సూర్యోదయానికంటే ముందే ఇంటికి వచ్చి తలుపుతట్టి పెన్షన్ చేతిలో పెడుతున్న పరిస్థితులు లబ్ధిదారులంతా చూశారు. లబ్ధి పొందిన అభాగ్యులకు మాత్రమే ఈ సేవల విలువ తెలుస్తుంది. రాజకీయ నాయకులు, జగన్‌పై అక్కసుతో రగిలిపోయే వారికి ఈ విషయం ఎన్ని జన్మలెత్తినా తెలియదు. ఇది వాస్తవం.
మరి ఇంత కాలం ఒకటో తేదీనే పెన్షన్లు ఇచ్చిన వ్యవస్థ ఇప్పుడు ఆగిపోయి.. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మాదిరిగా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి ఎండల్లో, క్యూలైన్లలో నిలబడి చనిపోయే పరిస్థితి దాపురించిందంటే కారణం తెలియదా? పేదలకు, అవ్వాతాతలకు మంచి జరుగుతుంటే ఓర్వలేని చంద్రబాబు, అండ్ కో.. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థపై దొంగ రాజకీయం చేస్తోంది.
చంద్రబాబు 14 సంవత్సరాల పాలనలో, మూడు సార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ ఏనాడైనా ఇలా వృద్దులు, దివ్యాంగులు, వితంతువుల పెన్షన్లు ఇంటికే ఇప్పించాలని, వారికి కష్టం రాకుండా చూసుకోవాలని ఆలోచన చేయలేదు. పైగా.. 2014లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాల 10 నెలల పాటు రూ.1000 పెన్షన్ ఇచ్చారు. అదీ కేవలం 39 లక్షల మందికి మాత్రమే. ఎన్నికలు ఇక రెండునెలల్లో వస్తున్నాయనగా వైయస్ జగన్ జన ప్రభంజనంలో కొట్టుకుపోతామనే భయంతో పెన్షన్ రూ.2 వేలు చేశారు. చంద్రబాబు హయాంలో నెలకు పెన్షన్ల వ్యయం కేవలం రూ.400 కోట్లు మాత్రమే.
తన హయాంలో జన్మభూమి కమిటీలు విచ్చలవిడిగా వ్యవహరించిన ఫలితంగా 2019లో చంద్రబాబు చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఘోర ఓటమిని చవిచూశారు. జన్మభూమి కమిటీలు గ్రామాల్లో లంచాలు దండుకున్నాయి. పెన్షన్ కావాలంటే ఎవరైనా చనిపోతే తప్ప కొత్త పెన్షన్ ఇవ్వని దుస్థితి. రేషన్ కార్డు, సర్టిఫికెట్లు కావాలన్నా లంచాలే. అడుగడుగునా మీరు ఏ పార్టీ, మాకు ఓటు వేశారా లేదా అని అడిగేవారు. అందుకే వీరిపై జనం ఏవగింపు చేసుకున్నారు.
వైయస్ జగన్ అధికారంలోకి రాగానే వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి వృద్దులు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక రోగులకు ఇంటి వద్దకే పెన్షన్ 1వ తారీఖునే అందించడం మొదలు పెట్టారు. దీంతో ఈ వ్యవస్థపై, ముఖ్యమంత్రి జగన్‌పై లబ్ధిదారులు చాలా సంతోషంగా ఉన్నారు. పెన్షన్లకు ప్రతి నెలా రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అర్హత ఉంటే చాలు.. ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందిస్తూ ఏకంగా 66.34 లక్షల మంది ఇప్పుడు అందిస్తున్నారు. పెన్షన్ క్రమంగా రూ.3 వేల వరకు పెంచుకుంటూ పోయారు. ఇప్పటి వరకు ఒక్క పెన్షన్లకే రూ.90 వేల కోట్లు వెచ్చించారు. అయితే, ప్రతి అంశంలోనూ కేవలం రాజకీయ లబ్ధి మాత్రమే చూస్తూ, జగన్‌ను గుడ్డిగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబు, ఆయనకు వంతపాడే వివిధ పార్టీలు, వ్యక్తులు, చంద్రబాబు స్లీపర్ సెల్స్, గోబెల్స్ ప్రచారం చేసే ఆయనకు మద్దతు పలికే మీడియా కలిసి.. జనానికి మంచి జరుగుతున్నా విమర్శిస్తూ వచ్చారు.
ప్రజల్లో వ్యతిరేకత వచ్చే సరికి పూటకోమాట, రోజుకో అబద్ధం చెబుతూ ప్రచారానికి తెరతీస్తున్నారు. మంచి జరుగుతున్నా అభినందించలేని దుస్థితికి చంద్రబాబు చేరుకున్నారు. కనీసం వాలంటీర్ వ్యవస్థను మెచ్చుకోలేని దుర్భర స్థితికి చేరుకున్నారు. తాను చేయలేకపోగా.. చేస్తున్న జగన్‌పై దుష్ప్రచారంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.
ఇప్పుడు ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా వాలంటీర్లకు రూ.5 వేలు కాదు.. రూ.10 వేలు ఇస్తామంటున్నారు చంద్రబాబు. కానీ వాలంటీర్లను రాజకీయ లబ్ధికి వైసీపీ వాడుకుంటోందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. వాలంటీర్లను కొనసాగిస్తామంటున్నారు. ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వచ్చినా ఇప్పుడున్న వాలంటీర్ల స్థానంలో టీడీపీ సానుభూతిపరులు వచ్చేయడం ఖాయం. అప్పుడు అది వాలంటీర్ వ్యవస్థ ఎందుకు అవుతుంది? జన్మభూమి కమిటీ అవుతుంది. ఇది సామాన్యులకైనా తెలిసిపోయే విషయమే. వారు లంచాలు దండుకోకుండా వాలంటీర్ల మాదిరి ఉత్తగానే ఎందుకు సేవలు చేస్తారు? ఇదీ సగటు లబ్ధిదారుడి మనసులో మెదులుతున్న ఆలోచన.
చంద్రబాబు ఎన్ని యూటర్నులు తీసుకున్నారో తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. రాజకీయంగా ఎన్ని నాటకాలు వేసినా సరే.. అది ఆయన వ్యక్తిగతం. కానీ ప్రజలకు మేలు చేసే విషయంలో కూడా రాజకీయాలు చేస్తూ వికృత క్రీడకు పాల్పడటం మంచిది కాదు. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయి మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఇప్పటికే వైయస్ జగన్ మళ్లీ అధికారం చేపట్టిన తర్వాత తన మొట్ట మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపైనే చేస్తానని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు పెట్టుకున్న జన్మభూమి కమిటీలు ఏ మాదిరిగా పని చేశాయి? ఈరోజు వాలంటీర్ వ్యవస్థ, జగన్‌ను అభిమానించే ఈ సైన్యం ఎలా పని చేస్తోంది? అన్నది ఆలోచన చేయాలని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించే కార్యక్రమం జరుగుతోంది సీఎం జగన్ చెబుతున్నారు.
ఇవీ చదవండి: YS Jagan with Pensioners: చంద్రబాబు 40 ఏళ్ల అనుభవంలో ఏనాడైనా ఇంటికే పెన్షన్ ఇచ్చాడా?: సీఎం జగన్ సూటి ప్రశ్న
YS Jagan Ugadi wishes: తెలుగు వారికి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
YS Jagan in Konakanametla: చంద్రబాబే పెద్ద శాడిస్ట్.. పెన్షన్లు ఆపి ప్రాణాలు పోవడానికి కారణమయ్యారన్న జగన్
