Andhra Pradesh Elections: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ త్వరలో ప్రకటించనున్న నేపథ్యంలో అన్ని రకాల బృందాల శిక్షణా కార్యక్రమాలను ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి ఎన్నికల సంసిద్దతకు, ఓటర్ల జాబితా నవీకరణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. Andhra Pradesh Elections
ఆయన మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే అమల్లోకి వచ్చే ఎన్నికల నియమావళి ప్రకారం ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సెర్వెలెన్స్ టీములు, వీడియో వ్యూయింగ్ టీములు, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ టీములు మరియు ఇతర బృందాల కార్య కలాపాలు ప్రారంభం అవుతాయన్నారు. ఈ నేపథ్యంలో ఆయా బృందాలు నిర్వహించాల్సిన విధులపై సమగ్ర అవగాహన కలిగి ఉండాల్సిన ఆవసరం ఎంతో వుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో వుంచుకొని అన్ని రకాల బృందాల శిక్షణా కార్యక్రమాలను ఈ నెలాఖరులోపు పూర్తిచేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఆయన సూచించారు. ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ లో పాల్గొనే అధికారులు, సిబ్బంది కి అవసరమైన శిక్షణా కార్యక్రమాలను మార్చి మాసంలో నిర్వహించుకోవచ్చన్నారు.
పలువురు అధికారులను ఆర్.ఓ.లుగా, ఏ.ఆర్.ఓ.లుగా, ఇ.ఆర్.ఓ.లుగా, ఏ.ఇ.ఆర్.ఓ.లుగా అన్ని జిల్లాలో నియమించడం జరిగిందని, అయితే ఇంకా ఎవరైనా వారి విధులో ఇప్పటి వరకూ చేరకుంటే, అటు వంటి వారి వివరాలను తమ వెంటనే తెలియజేస్తే ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటర్ల కు సౌకర్యాలు కల్పించే కేంద్రాలు, హోమ్ ఓటింగ్ బృందాలకు తగినంత మంది సిబ్బందిని సమకూర్చుకోవాలని సూచించారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దులకు హోమ్ ఓటింగ్ కు అవకాశం ఉన్న నేపథ్యంలో రెవిన్యూ అధికారులు, సిబ్బందితో హోమ్ ఓటింగ్ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ సిబ్బంది డాటాను సంబందిత పోర్టల్ లో వెంటనే ఫీడ్ చేయాలన్నారు.
ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ను పటిష్టంగా అమలు పర్చేందుకై సంబందిత రెగ్యులేటరీ అథారిటీలతో సమన్వయంతో వ్యవహరిస్తూ ఉండాలని, ప్రతి అథారిటీ నుండి తప్పని సరిగా ఒక నోడల్ అధికారి వుండేలా చూసుకోవాలన్నారు. ఇ.వి.ఎం.లను తరలించే వాహనాలతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సెర్వెలెన్స్ టీములు, వీడియో వ్యూయింగ్ టీములు మరియు ఇతర బృందాల వాహనాలకు తప్పని సరిగా జి.పి.ఎస్. సౌకర్యం ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: CEO Andhra: దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా ఎన్నికలు.. కీలక అప్‌డేట్స్ వెల్లడించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
Andhra Pradesh Election 2024: వైయస్సార్‌సీపీకి 2019 ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా వచ్చిన మెజారిటీ ఇదే..
