HomeAndhra PradeshNABARD: చేతివృత్తులకు, హస్తకళలకు నాబార్డు చేయూత

NABARD: చేతివృత్తులకు, హస్తకళలకు నాబార్డు చేయూత

NABARD: చేతివృత్తులకు, హస్తకళలకు చేయూతను అందించేందుకు నాబార్డు కృషిచేస్తోందని.. చేతివృత్తిదారులు, హస్త కళాకారుల కు సుస్థిర జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రోత్సాహం అందిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చేనేత, జౌళి శాఖ) కె.సునీత అన్నారు. నాబార్డు ఏపీ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో పటమట, మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన హస్తకళలు, చేనేత, మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయ మేళాను కె.సునీత.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ డైరెక్టర్ ఏవో బషీర్, ఏపీ నాబార్డ్ సీజీఎం ఎం.ఆర్.గోపాల్ తదితరులతో కలిసి ప్రారంభించారు. (NABARD)

స్టాళ్లను పరిశీలించి ఉత్పత్తులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కె.సునీత మాట్లాడుతూ సంప్రదాయ హస్తకళలు, చేనేతను ప్రోత్సహించేందుకు నాబార్డ్ కృషి చేస్తుండటం అభినందనీయమని.. ఇలాంటి క్రాఫ్ట్ మేళాలతో చేనేత, హస్తకళాకారుల జీవనోపాధి అవకాశాలు విస్తృతం అవుతాయని తెలిపారు. వారసత్వ సంపదను మన ముందు తరాలకు అందించేందుకు, అవగాహన కల్పించేందుకు దోహదం చేస్తాయని తెలిపారు.

అదేవిధంగా స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక సాధికారత దిశగా అడుగులు వేసేందుకు ఉపయోగపడతాయన్నారు. తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర 13 రాష్ట్రాలకు చెందిన హస్తకళాకారులు, చేతి వృత్తిదారులు తమ ఉత్పత్తులతో స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూడా కళాకారులు, నేతన్నలు ఇక్కడ స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మొత్తం 69 స్టాళ్లతో పాటు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పై అవగాహన కల్పించేందుకు.. ఆర్థిక సాక్షరత పొందించేందుకు బ్యాంకులతో మరో రెండు స్టాళ్ళు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ స్టాళ్ల ద్వారా హస్తకళాకారులు, చేతి వృత్తిదారులకు డిజిటల్ లావాదేవీల పై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ మేళాను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని.. క్రాఫ్ట్ మేళాను సందర్శించి హస్త, చేనేత కళాకారులను ప్రోత్సహించాలని సునీత కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చేనేత, హస్త కళాకారుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు తోడ్పాటు అందిస్తోందని.. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వివిధ రకాల కార్యక్రమాలు, పథకాల అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. *.

నాబార్డు ఏపీ చీఫ్ జనరల్ మేనేజర్ ఎంఆర్ గోపాల్ మాట్లాడుతూ 6వ నాబార్డ్ క్రాఫ్ట్ మేళా జనవరి 3 నుంచి 12వ తేదీ వరకు జరుగుతుందని.. వెంకటగిరి, మంగళగిరి, పోచంపల్లి తదితర ప్రాంతాలకు చెందిన చేనేత ఉత్పత్తులతో పాటు కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, పర్యావరణహిత ఉత్పత్తులు, తోలుబొమ్మలు, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులు తదితర స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చేనేత, హస్తకళాకారులు వినియోదారుల అవసరాలను, అభిరుచులను గుర్తించి వాటికనుగుణంగా తమ ఉత్పత్తులకు మెరుగులు దిద్దాలని.. విలువ జోడింపు చేయాలని సూచించారు.

ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలన్నారు. అదేవిధంగా విశాఖపట్నంలోని సీఎంఆర్ సెంట్రల్ మాల్ లో నాబార్డు సహకారంతో నిర్వహిస్తున్న స్టాల్ ఇన్ మాల్ కార్యక్రమంపైనా ఎం.ఆర్.గోపాల్ అవగాహన కల్పించారు. భవిష్యత్తులోనూ ఇదేవిధంగా చేనేత, హస్తకళలకు నాబార్డ్ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.

ఇదీ చదవండి: ST Commission: గిరిజనులకు వారి గ్రామంలోనే ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా మెరుగైన వైద్యం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు