ST Commission: గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధి, వారి హక్కుల పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ సేవలు అందిస్తోందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్. డి.వి.జి. శంకరరావు తెలిపారు. గిరిజనులకు ఎల్లవేళలా ఎస్టీ కమిషన్ అండగా నిలుస్తుందన్నారు. ఎస్టీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వ పథకాలు.. సంక్షేమ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మాతృభాష అధ్యాపకులకు వేతనాల నిమిత్తం రూ.4.64 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఎప్పటికప్పుడు జిల్లాల్లో పర్యటనలు.. సమస్యల పరిష్కారానికి సత్వర కృషి చేస్తున్నామన్నారు. ఎస్టీ కమిషన్ రూపొందించిన ప్రత్యేక యాప్ ద్వారా గిరిజనుల అర్జీల స్వీకరణ జరుగుతోందన్నారు. (ST Commission)
విజయవాడలో నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో రాజ్యాంగబద్ధంగా ఏపీ ఎస్టీ కమిషన్ ఏర్పాటైందన్నారు. ఎస్టీ వర్గాల అభ్యున్నతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక ప్రభుత్వ పథకాలు, సంక్షేమ చర్యలు చేపట్టిందని గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా ఎస్టీ కమిషన్ సేవలు అందిస్తోందని స్పష్టం చేశారు. గ్రీవెన్స్ సెల్ ద్వారా 2022లో 2751, 2023లో 2712 ఫిర్యాదులు అందాయని చెప్పారు. వీటిలో కేవలం 432 ఫిర్యాదులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని, అవి కూడా సంబంధిత శాఖలలో పరిష్కారానికి చివరిదశలో ఉన్నట్లు తెలిపారు.
రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి చిత్తశుద్ధితో ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. విజయనగరం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం తదితర జిల్లాలలో పర్యటించి గిరిజనులు, ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యకలాపాలను సమీక్షించామని తెలిపారు.
పలుచోట్ల గిరిజనుల సమస్యలపై వినతులను స్వీకరించి తగిన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ప్రధానంగా ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసులు, భూ సమస్యలు, ఉపాధి సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ నేతృత్వంలో ప్రత్యేక యాప్ ద్వారా అర్జీలు స్వీకరించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతి గిరిజనుడికి రాష్ట్ర ఎస్టీ కమిషన్ గురించి తెలియాలని, ఆవిధంగా ప్రతిఒక్కరికీ ఎస్టీ కమిషన్ ను చేరువ చేసేలా మీడియా తమ వంతు సహకరించాలని డాక్టర్. డి.వి.జి. శంకరరావు ఆకాంక్షించారు.
