CM Revanth on Auto drivers: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం కారణంగా ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ అంశంపై ఫోకస్ పెట్టిన తెలంగాణ సర్కార్.. వారిని ఆదుకొనేందుకు చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఇవాళ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్ల సమస్యలను తెలుసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వారు లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటుమన్నారు. (CM Revanth on Auto drivers)
క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్ల కోసం రూ.5 లక్షల ‘యాక్సిడెంటల్ పాలసీ’ తీసుకురావడంతోపాటు ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 4 నెలల క్రితం స్విగ్గీ డెలివరీ బాయ్ కుక్క తరిమితే భవనంపై నుంచి పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుడి కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయనిధి నుంచి ఆ కుటుంబానికి రూ.2 లక్షలు అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా క్యాబ్ డ్రైవర్ల కోసం ఓలా మాదిరిగా టీ హబ్ ద్వారా ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
సామాజిక రక్షణ కల్పించడంలో తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని సీఎం అన్నారు. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఆ క్రమంలో విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకోసం రాజస్థాన్లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో చట్టాన్ని ప్రవేశపెడతామన్నారు.
“సంస్థలు కూడా కేవలం లాభాపేక్ష మాత్రమే చూడకుండా.. కార్మికులు, ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టాలన్నారు. గివ్ అండ్ టేక్ పాలసీని పాటించని ఎంత పెద్ద సంస్థలపైనైనా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమన్నారు. 4 నెలల క్రితం స్విగ్గీ బాయ్ కుక్క తరిమితే భవనం పై నుంచి పడి మృతి చెందాడని, అప్పటి ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా సాయం అందిస్తారని ఆనాడు చూశానన్నారు. కానీ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనలు జరిగిన సమయంలో మానవత్వంతో వ్యవహరించాలన్నారు. అందుకే ఆ కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయనిధి నుంచి రూ. 2 లక్షలు అందించాలని ఆదేశించామన్నారు.
ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన గ్రామసభలు నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. అక్కడ దరఖాస్తుల్లో వివరాలు అందించాలని క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్లకు సీఎం సూచించారు. డిజిటల్, మాన్యువల్ ఏ రూపంలోనైనా దరఖాస్తులు ఇవ్వొచ్చు అన్నారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. ప్రజా వాణిలో వచ్చిన దరఖాస్తులను అన్నింటినీ పరిష్కరిస్తామని వివరించారు.
ఇదీ చదవండి: Maha Lakshmi Scheme Telangana: మహాలక్ష్మి పథకానికి అర్హులు ఎవరు? కావాల్సిన ధృవపత్రాలివే..
