MS Dhoni Jersey: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బీసీసీఐ అరుదైన గౌరవం ఇచ్చింది. 2019 వన్డే వరల్డ్ కప్ అనంతరం మహీ.. 2020 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తన తొలి మ్యాచ్‌లో రనౌట్ అయిన ధోని.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆఖరి మ్యాచ్‌లోనూ రనౌట్‌గానే వెనుదిరగాల్సి వచ్చింది. తాజాగా ధోనికి బీసీసీఐ గౌరవం ఇస్తూ ఆయన అంతర్జాతీయ క్రికెట్‌లో మైదానంలో వాడిన నంబర్ 7 జెర్సీకి కూడా వీడ్కోలు పలికింది. (MS Dhoni Jersey)
ఇండియన్ క్రికెట్‌కు చేసిన అద్భుత సేవలకు మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)కి బీసీసీఐ ఈ గౌరవాన్ని ఇచ్చింది. అంటే ఇకపై ఏ భారత క్రికెటర్ కూడా నంబర్ 7 జెర్సీ వేసుకోవడానికి ఉండదు. జట్టు సారథిగా దేశానికి టీ20 వరల్డ్ కప్ (2007), వన్డే వరల్డ్ కప్ (2011) అందించిన ఘనత మహీకి దక్కుతుంది. ధోనికి గౌరవ సూచకంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో సెమీసే ధోనీకి భారత్ తరపున చివరి అంతర్జాతీయ మ్యాచ్.
2020 ఆగస్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్‌కు మహీ గుడ్ బై చెప్పాడు. ’మహేంద్రసింగ్ ధోని దిగ్గజ ఆటగాడు. భారత్‌తో పాటు ప్రపంచ క్రికెట్‌కు అతను అందించిన సహకారం అపారమైంది. అతని సేవలకు గుర్తింపుగా ఏడో నంబర్ జెర్సీకి రిటైర్మెంట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది’ అని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు ధోని వీడ్కోలు చెప్పిన తర్వాత అతని జెర్సీ నంబర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని మొట్టమొదటిగా టీమిండియా క్రికెటర్ కమ్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అప్పట్లోనే డిమాండ్ చేశాడు.
ఇంతకు ముందు దిగ్గజ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వాడిన జెర్సీ నంబర్ 10కి కూడా బీసీసీఐ ఇలాగే రిటైర్‌మెంట్ ప్రకటించింది. సచిన్ జెర్సీ నంబర్ 10ని కూడా ఎవరూ ధరించడానికి వీల్లేదు. అయితే, 2017లో తన వన్డే అరంగేట్ర మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ పదో నంబర్ జెర్సీ వేసుకున్నాడు. ఈ ఘటనతో అతనిపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిణామంతో బీసీసీఐ అలర్ట్ అయ్యింది. ఆ తర్వాత పదో నంబర్ జెర్సీకి బీసీసీఐ శాశ్వతంగా వీడ్కోలు పలికింది.
Read Also : Relationship goal: రిలేషన్ షిప్‌లో క్లోజ్‌గా ఉండాలంటే అలాంటి పొరపాట్లు చేయకుండి!
