Indian Railways: వందే భారత్ సహా పలు సర్వీసుల్లో చార్జీలు సవరిస్తూ భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లు ఎక్కువ సంఖ్యలో అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని రూట్లలో ఆదరణ బాగానే ఉన్నప్పటికీ.. మరికొన్ని రూట్లలో మాత్రం టికెట్ ధరలు అధికంగా ఉంటున్నాయని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. ఈ కారణంగా ఆక్యుపెన్సీ తక్కువగా ఉంటోందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు ఎండలు తగ్గి వర్షాలు కూడా పడుతుండడంతో ఏసీ బోగీల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. (Indian Railways)
ముఖ్యంగా ఛైర్‌కార్లలో ప్రయాణానికి ఆశించిన మేర ప్రయాణికుల నుంచి స్పందన రావడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఓ కొత్త స్కీమ్‌ను ప్రకటించింది. ఫీలింగ్, విస్టాడోమ్ కోచ్‌లు కలిగిన రైళ్లతో పాటు ఏసీ ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ తరగతులు ఉన్న రైళ్లన్నింటిలో ఈ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రైల్వే బోర్డు వెల్లడించింది.

టికెట్ ధరలపై 25 శాతం వరకు రాయితీ..
ఏసీ ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధరలపై రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆయా తరగతులు కలిగిన అన్ని రైళ్లలో టికెట్ ధరపై 25 శాతం దాకా డిస్కౌంట్ (Discount on AC fares) ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. వందేభారత్ (Vande Bharath) సర్వీసులతో పాటు ఎక్స్‌పీరియన్స్, విస్టాడోమ్ కోచ్‌లు ఉన్న రైలు సర్వీసులకు ఇది వర్తించేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆక్యుపెన్సీ ఆధారంగా టికెట్ ధరలపై ఈ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఆక్యుపెన్సీ పెంచే టార్గెట్‌తో రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్ అధికారులు చెబుతున్నారు. టికెట్ ధరలను నిర్ణయించే అధికారం ఆయా రైల్వే జోన్లలో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌కు అప్పగిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది.
Read Also : Train: రైలు బోగీల్లో ఈ తేడాలు గమనించారా? ఇనుప కడ్డీలు అడ్డంగా ఎందుకుంటాయంటే..
ఇప్పుడు ఇస్తున్న డిస్కౌంట్ అనేది బేసిక్ ఫేర్‌లో గరిష్ట స్థాయిలో 25 శాతం దాకా ఇచ్చేందుకు రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది. రిజర్వేషన్, సూపర్ ఫాస్ట్ సర్‌ఛార్జి, జీఎస్టీ వంటి ఇతర ఛార్జీలు మాత్రం అదనంగా వర్తిస్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు. గడిచిన నెల రోజుల్లో 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ కలిగిన రైళ్లను పరిగణనలోకి తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. డిస్కౌంట్ నిర్ణయించే ముందు ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలను కూడా కన్సిడర్ చేయాలని నిర్ణయించారు.
మరోవైపు ఆక్యుపెన్సీని బట్టి రైలు ప్రయాణించే మొత్తం దూరానికి, లేదా ఎంపిక చేసిన స్టేషన్ల మధ్య కూడా ప్రయాణానికి ఈ రాయితీ వర్తించేలా చేయవచ్చని రైల్వే శాఖ వెల్లడించింది. డిస్కౌంట్ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇప్పటికే బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రం ఇది వర్తించదని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. హాలిడే, ఫెస్టివల్ స్పెషల్ రైళ్లకు ఈ కొత్త పథకం వర్తించదని రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది.
Read Also : ChatGPT: ఛాట్ జీపీటీతో గూగుల్‌కు ముప్పు తప్పదా? ఛాట్ జీపీటీ అంటే ఏంటి?
