ఆదివారం, 27 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh, National

YS Jagan Election Commission: ఎన్నికల కమిషన్‌పై ప్రజల్లో విశ్వాసం పెంచాలి.. నియామక చట్టాన్ని సవరించాలి: YS జగన్

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శనివారం, 26 సెప్టెంబర్ 2026

YS Jagan Election Commission: భారత ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికల కమిషన్‌పై ప్రజల్లో సంపూర్ణ విశ్వాసం ఉండాల్సిన అవసరం ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ పనితీరుపై జాతీయ మీడియాలో వెలువడిన కథనాల నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియను పునఃసమీక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి (CJI), లోక్‌సభ ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండే ముగ్గురు సభ్యుల కమిటీ ద్వారా ఎన్నికల కమిషనర్ల నియామకం జరిగేలా 2023 చట్టాన్ని సవరించాలని ప్రతిపాదించారు. ఈ మేరకు వైయస్ జగన్ ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్టు చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయడం, ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించడం రాజ్యాంగ వ్యవస్థల ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు.

ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలపై స్పష్టత ఇవ్వాలి

ఎన్నికల కమిషన్‌లోని ఇద్దరు కమిషనర్లు పలు కీలక నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియాలో వెలువడిన కథనాలను వైయస్ జగన్ ప్రస్తావించారు. సెప్టెంబర్ 23న ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన పరిశోధనాత్మక కథనం ప్రకారం, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత పది నెలల్లో కనీసం 14 సందర్భాల్లో పలు నిర్ణయాలపై అధికారికంగా అభ్యంతరాలు నమోదు చేశారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు, తిరిగి చేర్పించడం, ఎన్నికల కమిషన్ డిజిటల్ వ్యవస్థల నిర్వహణ వంటి అంశాలు ఈ అభ్యంతరాల్లో ఉన్నట్లు పత్రిక వెల్లడించింది. ఈ పరిణామాల నేపథ్యంలో పరస్పర రాజకీయ ఆరోపణల కంటే ప్రజలకు వాస్తవాలు తెలియజేయడమే ముఖ్యమని జగన్ అభిప్రాయపడ్డారు. ఏయే అంశాలపై అభ్యంతరాలు నమోదయ్యాయి? వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఓటర్ల జాబితాలో పేర్ల చేర్పులు, తొలగింపులు, పునరుద్ధరణ ప్రక్రియ ఎంత పారదర్శకంగా జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కోరారు.

ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని సవరించాలి

ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 చట్టాన్ని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పునఃసమీక్షించాలని వైయస్ జగన్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. గతంలో తమ పార్టీ మద్దతు ఇచ్చిన Chief Election Commissioner and Other Election Commissioners (Appointment, Conditions of Service and Term of Office) Act, 2023 చట్టాన్ని ఇప్పుడు తిరిగి పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం ప్రధానమంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి నామినేట్ చేసే కేంద్ర కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉన్న కమిటీ సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను నియమిస్తారు.

ఈ విధానాన్ని సవరించి ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ ప్రతిపక్ష నేతతో కూడిన ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీని తిరిగి ఏర్పాటు చేయాలని జగన్ ప్రతిపాదించారు. 2023లో సుప్రీంకోర్టు మధ్యంతరంగా సూచించిన నియామక విధానంలోనూ ఈ ముగ్గురు సభ్యులే ఉన్నారు. పార్లమెంటు చట్టం చేసే వరకు ఆ విధానాన్ని అమలు చేయాలని అప్పట్లో సుప్రీంకోర్టు ఆదేశించింది.

పరీక్ష రాసే విద్యార్థే పరీక్షాధికారిని నియమిస్తే ఎలా?

ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో నిష్పాక్షికత ప్రాధాన్యాన్ని వివరిస్తూ వైయస్ జగన్ ఆసక్తికరమైన ఉదాహరణ ఇచ్చారు. పరీక్ష రాసే విద్యార్థే తన పరీక్షాధికారిని నియమించే పరిస్థితి ఉంటే, ఆ పరీక్షాధికారి ఎంత నిజాయతీపరుడైనా ఆరోపణలు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాంటి సందేహాలకు తావులేకుండా తటస్థమైన నియామక ప్రక్రియను ఏర్పాటు చేయడం అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రధాన న్యాయమూర్తిని ఎంపిక కమిటీలో తిరిగి చేర్చడం ద్వారా ఎన్నికల కమిషన్‌పై ప్రజల్లో గౌరవం, విశ్వాసం పెంపొందించవచ్చని జగన్ పేర్కొన్నారు.

ఏపీలో SIR ప్రక్రియపైనా జగన్ అభ్యంతరాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ సందర్భంగా అధికారంలో ఉన్న పార్టీ తన అధికారాన్ని దుర్వినియోగం చేసిందని వైయస్ జగన్ ఆరోపించారు. ఈ ప్రక్రియలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చేసిన విజ్ఞప్తులను పట్టించుకోలేదని పేర్కొన్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో డివిజన్ల పునర్విభజన తీరుపై ప్రతిపక్ష పార్టీగా తాము వ్యక్తం చేసిన అభ్యంతరాలను కూడా పక్కనపెట్టారని విమర్శించారు. ఇలాంటి పరిణామాలు ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని బలహీనపరుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాలి

ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉండాలని వైయస్ జగన్ స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత ఉండటమే కాకుండా, ఆ పారదర్శకత ప్రజలకు స్పష్టంగా కనిపించాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికల వ్యవస్థపై నెలకొన్న సందేహాలను తొలగించేందుకు కేంద్రంలోని అధికార పార్టీ ముందుకు రావాలని కోరారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని బలోపేతం చేయడం, ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించడం, రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను కాపాడటం అత్యంత ముఖ్యమని జగన్ తన పోస్టులో పేర్కొన్నారు. పారదర్శకత, జవాబుదారీతనమే ప్రజాస్వామ్యంలో ఏ సంస్థ పనితీరుకైనా నిజమైన కొలమానాలని, వాటిని పరిరక్షించడం ఆ సంస్థల ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు.

Read also: YS Jagan with Governor: డీఎస్సీ అక్ర‌మాల‌పై గవర్నర్‌కు వైఎస్ జగన్ ఫిర్యాదు.. కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మాజీ సీఎం
YS Jagan with Vizag Leaders: పోలీసు దౌర్జ‌న్యాల‌తో ప్ర‌జ‌ల‌ తీర్పును శాశ్వ‌తంగా అడ్డుకోలేరు: వైఎస్ జ‌గ‌న్
YS Jagan tweet on DSC: ఒక టీచర్‌ పోస్టు.. డీఎస్సీలో ఆరు మలుపులు! సీఎం చంద్రబాబును నిలదీసిన YS జగన్‌

ట్యాగ్స్: , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading