Ponguleti Srinivas Reddy: బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇటీవలే చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిశారనే వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా పొంగులేటి స్పందించారు. తాను ఏపీ సీఎం జగన్‌ను కలవలేదని వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను మాత్రమే కలిశానని, సీఎంను కలవలేదని క్లారిటీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌లో ఉన్నా, కాంగ్రెస్‌లో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా పొంగులేటి జగన్ మనిషి అనే ప్రచారం ఉన్న నేపథ్యంలో పొంగులేటి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. (Ponguleti Srinivas Reddy)
ప్రస్తుతం తెలంగాణలో నేతల చేరికలతో కాంగ్రెస్ పార్టీలో (Telangana Congress) కొత్త జోష్ వచ్చింది. ఇటీవల పొంగులేటితోపాటు పలువురు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారాన్ని సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకోవడంపై ఫోకస్ పెట్టింది అధిష్టానం. ఇటీవల పార్టీలో చేరే వారి లిస్టు కూడా మీడియాకు బహిర్గతమైన సంగతి తెలిసిందే.
ఖమ్మం జిల్లాలో కనీసం ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగిన సత్తా పొంగులేటికి ఉందనేది అంగీకరించాల్సిన అంశమే. అధికార పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన పొంగులేటి.. వచ్చే ఎన్నికల్లో ఖమ్మంజిల్లా నుంచి ఒక్క సీటు కూడా బీఆర్‌ఎస్ గెలుచుకోకుండా అడ్డుకుంటానంటూ అప్పుడే శపథాలు కూడా చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో (CM KCR) సఖ్యత పొసగక.. కొన్నాళ్ల నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చిన పొంగులేటి.. ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
Read Also : YS Sharmila : తెలంగాణలో కొత్త పొత్తులు..! కాంగ్రెస్‌కి షర్మిల పార్టీ దగ్గరవుతోందా?
ఇవాళ భట్టి విక్రమార్కను (Bhatti Vikramarka) కలిసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ఇంటికి పంపాలని ప్రజలంతా నిర్ణయం తీసుకున్నారని పొంగులేటి పేర్కొన్నారు. కేసీఆర్ సర్కార్ బంగాళాఖాతంలో కలిపసిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగానే ఏపీ సీఎం జగన్‌ను కలిసిన విషయంపై ఆయన స్పష్టత ఇచ్చారు.
షర్మిల చేరికపై ఏమన్నారంటే..
ఏపీలో సీఎంవో (AP CMO) అధికారులను కలిశానన్న పొంగులేటి.. వైఎస్ జగన్ (CM YS Jagan) సోదరి షర్మిల (YS Sharmila) కాంగ్రెస్‌లో చేరికపైనా హాట్ కామెంట్స్ చేశారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరికపై ఏపీ సీఎంవో అధికారులతో చర్చలేవీ జరగలేదన్నారు. ఆమె టాపిక్ తీసుకురాలేదన్నారు. సీఎం జగన్ తెలంగాణలో తన పార్టీనే వద్దనుకున్నారని పొంగులేటి వ్యాఖ్యానించారు. అలాంటిది చెల్లెలి కోసం ప్రయత్నిస్తారనుకోవడం లేదన్నారు. మొత్తంగా షర్మిల కాంగ్రెస్‌లో చేరిక అనే అంశం పార్టీ పెద్దలు, అధిష్టానం చూసుకుంటుందని పొంగులేటి స్పష్టీకరించారు.