MS Dhoni: టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్, భారత్‌కు ప్రపంచకప్‌లు తెచ్చిన ఝార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) గురించి క్రికెట్ (Cricket) ప్రపంచానికి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇండియన్ క్రికెట్‌ను (Indian Cricket) కొత్త పుంతలు తొక్కించడంలో, కామ్‌గా తన పని తాను చేసుకుంటూ పోవడంలో ధోనికి మరెవరూ సాటి లేరు. టీమిండియాకు టీ20, వన్డే వరల్డ్ కప్‌లు అందించిన ఘనత మహేంద్రుడిదే. హెలికాప్టర్ షాట్‌లతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ధోని..(MS Dhoni) స్వదేశంలో కొందరి చేత నేటికీ విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు.
తాజాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో (WTC Final) టీమిండియా ఘోరంగా ఓటమిపాలైంది. దీంతో ధోనిని చూసి నేర్చుకోవాలంటూ అభిమానులు పెద్ద సంఖ్యలో సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్టులు పెడుతున్నారు. అయితే, ధోని అంటే ఎంత అభిమానం ఉన్నప్పటికీ టీమ్‌ను టీమ్‌గా చూడాలని, వ్యక్తి భజన చేయడం సరికాదని సీనియర్ క్రికెటర్లు హితవు పలకడం ఇప్పుడు క్రికెట్ సర్కిళ్లలో హాట్ టాపిక్ అయ్యింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఇండియా ఓడిపోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మపై (Rohit Sharma) తీవ్రంగా ఒత్తిడి పడుతోంది. కెప్టెన్‌గా పనికిరాడని, రిటైర్ అవ్వాలని.. ఇలా రకరకాలుగా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఇలాంటి పోస్టులకే మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్ (Harbhajan Singh), గౌతమ్ గంభీర్ (Goutam Gambhir) స్పందించారు. 2007, 2011 ప్రపంచకప్‌లలో సమష్టిగా రాణించడం వల్ల మాత్రమే టీమిండియా విజేతగా నిలిచిందని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. ఇందులో కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని హీరోను చేశారంటూ గౌతీ కామెంట్ చేశాడు. గంభీర్ ఆ జట్టులో సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రచార బృందం గట్టిగా పని చేసిందని, అందుకే ధోనికి మంచి పేరు వచ్చిందని వ్యాఖ్యానించాడు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో ఇండియా ఓటమి తర్వాత ఐసీసీ టోర్నీ నెగ్గడం అంటే ధోనికే సాధ్యం అన్నట్లు అతడిని పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు రావడంపై గంభీర్ రియాక్షన్ అలా ఉంది. ఐసీసీ టోర్నీల్లో ఇండియా వరుస వైఫల్యాలకు కారణం వ్యక్తిగత ప్రదర్శనలకు ఇచ్చిన ప్రాధాన్యం జట్టుకు ఇవ్వకపోవడమేనని వ్యాఖ్యానించాడు. వేరే జట్లు మాత్రం సమష్టిగా ప్రదర్శన చేసేందుకు పెద్దపీట వేస్తాయని చెప్పాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్‌లో ఇండియా గెలిచేందుకు కారణం ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ (YuvRaj Singh) ప్రధాన కారణమని గౌతీ చెప్పాడు. ఈ రెండు టోర్నీల్లోనూ యువీనే జట్టును ఫైనల్‌కు చేర్చాడని, కానీ ధోనిని హీరోని చేసేశారంటూ మహేంద్రుడిపై తన అక్కసంతా వెళ్లగక్కాడు గౌతమ్ గంభీర్.
ఇదే అంశంపై మరో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సైతం స్పందించాడు. 2007, 2011 వరల్డ్‌కప్ టోర్నీల్లో ఇండియా గెలిచింది వ్యక్తివల్ల కాదని, జట్టు ప్రదర్శన వల్లేనని వ్యాఖ్యానించాడు భజ్జీ. కోచ్ లేడు, మార్గనిర్దేశకుడు లేడు.. అంతా కుర్రాళ్లు.. సీనియర్లు దూరమయ్యారు.. అంతకు ముందు ఒక్క మ్యాచ్‌కు కూడా కెప్టెన్సీ చేయని ఓ యువకుడు సెమీస్‌లో భీకర ఆస్ట్రేలియాను (Cricket Australia) ఓడించి ఆపై జట్టుకు కప్ అందించాడు… అంటూ ఓ అభిమాని పెట్టిన పోస్టుకు భజ్జీ సీరియస్ అయ్యాడు.
అవును.. ఈ మ్యాచ్‌లు ఆడినప్పుడు మరో పది మందితో కాకుండా ఆ కుర్రాడు ఒక్కడే మనదేశం నుంచి ఒంటరిగా ఆడాడు.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అతడొక్కడే ప్రపంచకప్‌లు గెలిపించాడు.. ఆస్ట్రేలియా లేదా ఇతర జట్లు కప్ గెలిస్తే ఆస్ట్రేలియా విజేత అంటారు. అదే భారత్ గెలిస్తే మాత్రం కెప్టెన్ గెలిపించాడంటారు.. క్రికెట్‌లో కలిసి ఓడతాం. కలిసి గెలుస్తాం.. అంటూ భజ్జీ రిప్లయ్ ఇచ్చాడు.
వీరి ఉద్దేశాలపై ఇప్పుడు ఫ్యాన్ వార్ నడుస్తోంది. ధోని అంటే పీకల్లోతు కోపం, అసూయ, ద్వేషం మనసులో పెట్టుకున్న అప్పటి క్రికెటర్లు.. ఇప్పుడు వరుసగా బయటకు వచ్చి కామెంట్లు చేస్తున్నారంటూ మహేంద్రుడి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Read Also : IPL Final 2023: తిరుగులేని మహేంద్రుడు.. ఐదో టైటిల్ విశేషాలు ఇవే..