IPL Final 2023: తిరుగులేని మహేంద్రుడు.. ఐదో టైటిల్‌ విశేషాలు ఇవే..

IPL Final 2023: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 16వ సీజన్‌లో (IPL Final 2023) చెన్నై సూపర్‌ కింగ్స్‌ మెరిసింది. ఆ జట్టు సారధి మహేంద్ర సింగ్‌ ధోని (Mahendra Singh Dhoni) ఐదోసారి టైటిల్‌ను ముద్దాడాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో (Gujarat Titans) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) ఫైనల్‌ పోరులో తిరుగులేని విజయాన్ని అందుకున్న సీఎస్కే.. (CSKvsGT) అభిమానులను ఆనందడోలికల్లో ముంచెత్తింది. వర్షం కారణంగా మొదటి రోజు మ్యాచ్‌ వాయిదా పడగా.. రిజర్వ్‌ డే రోజున ఫైనల్‌ పోరు జరిగింది. అయితే, రెండో రోజు కూడా మొదటి ఇన్నింగ్స్‌ అయ్యాక వర్షం మొదలైంది. దీంతో 15 ఓవర్లకు మ్యాచ్‌ కుదించారు. అయితేనేం.. సీఎస్కే బ్యాటర్లు చెలరేగి ఆడటంతో చారిత్రక విజయాన్ని నమోదు చేసింది.

Image

మొదట టాస్‌ గెలిచిన సీఎస్కే సారథి ధోని.. ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. తన లెక్క తప్పదనే సంకేతాలు అప్పుడే వెలువడ్డాయి. అయితే, గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటింగ్‌కు దిగి బేస్‌మెంట్‌ బలంగా వేసింది. ఓపెనర్లు శుభమన్‌ గిల్‌, వృద్ధిమాన్‌ సాహా పటిష్టంగా ఆడారు. గత మ్యాచ్‌లో చెలరేగి ఆడి అజేయ సెంచరీ సాధించిన గిల్‌.. ఈ మ్యాచ్‌లోనూ తొలుత అదే తరహా ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. వరుస ఫోర్లతో సీఎస్కే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 20 బంతులు ఎదుర్కొన్న గిల్‌.. ఏడు ఫోర్లు బాదాడు. 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. జడేజా బౌలింగ్‌ వేస్తున్నాడు. IPL (Final 2023)

ధోని సూపర్‌ స్టంపింగ్‌..

డ్రైవ్‌ షాట్‌కు ప్రయత్నించిన గిల్‌.. బంతిని మిస్‌ చేశాడు. ఇంకేముందీ.. వికెట్‌ కీపర్‌ ధోని చేతిలోకి చేరుకుంది బంతి. మెరుపు వేగంతో ధోని స్టంపింగ్‌ పూర్తి కావడం.. రివ్యూలో ఔట్‌ అని తేలడం చకచకా జరిగిపోయాయి. తొలి వికెట్‌ పడటంతో సీఎస్కే బృందంలో కాస్త జోష్‌ వచ్చింది. అయితే, అది ఎంతో సమయం నిలువలేదు. మరో ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా అర్ధ శతకంతో రాణించాడు. 39 బంతులాడిన సాహా.. 54 పరుగులు చేశాడు. ఓ సిక్సర్‌, ఐదు ఫోర్లు బాదాడు. అనంతరం దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ధోని చేతికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. అప్పటికి జీటీ స్కోర్ 13 ఓవర్లలో 131/2.

సుదర్శన చక్రంలా ఆడిన సాయి..

అనంతరం యువ బ్యాటర్ సాయి సుదర్శన్‌ క్రీజులో కుదురుకుంటున్నాడు. ఇక ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. వరుసగా సిక్సర్లు, ఫోర్లతో బక్కపలుచటి సుదర్శన్.. సీఎస్కే బౌలర్లకు చుక్కలు చూపించాడు. మెరుపు వేగంతో హాఫ్‌ సెంచరీ, ఆ తర్వాత సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. కేవలం 47 బంతుల్లోనే 6 సిక్సర్లు 8 ఫోర్లతో 96 పరుగులు చేసిన సాయి సుదర్శన్‌.. పతిరానా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. తృటిలో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. అయితేనేం.. టీమ్‌ స్కోరును 200 దాటించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇక హార్దిక్‌ పాండ్య సైతం ఆకరి ఓవర్లలో రెండు సిక్సర్లు బాది 12 బంతుల్లో 21 పరుగులు చేశాడు. మొత్తానికి గుజరాత్‌ టైటాన్స్‌ స్కోరు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు. భారీ టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగిన సీఎస్కే.. తొలి మూడు బంతులు ఎదుర్కొన్న ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్.. ఓ ఫోర్‌ కొట్టాడు. అంతే వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. చూస్తుండగానే కుండపోత వర్షం కురవసాగింది. దీంతో మ్యాచ్‌ ఇక గుజరాత్‌ వశం అయిపోతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. చివరకు అర్ధరాత్రి 12 గంటల సమయంలో డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి ప్రకారం 15 ఓవర్లకు సీఎస్కే టార్గెట్‌ 171గా నిర్దేశించారు.

వరుణుడి రీ ఎంట్రీ..

ఇక టార్గెట్‌ను అందరూ షేర్‌ చేసుకున్నట్లుగా సీఎస్కే బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్ 16 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు, మరో ఓపెనర్‌ డ్వేన్‌ కాన్వే 25 బంతుల్లోనే 2 సిక్సర్లు, 4 ఫోర్లతో 47 పరుగులు చేశారు. అనంతరం శివమ్‌ దూబె 2 సిక్సర్లతో 21 బంతుల్లో 32 పరుగులు, అజింక్యా రహానె 13 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో 27 పరుగులు, అంబటి రాయుడు 8 బంతుల్లో 2 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 19 పరుగులు చేశారు. కెప్టెన్‌ కూల్‌మహేంద్ర సింగ్‌ ధోని మాత్రం ఫైనల్లో అభిమానులను నిరాశపరిచాడు. గోల్డెన్‌ డకౌట్‌ అయ్యి వెనుదిరిగాడు. దీంతో సీఎస్కే శిబిరంలో నిరాశ అలముకుంది.

Image

జడ్డూ విశ్వరూపం..

ఇక ఆఖర్లో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) విశ్వరూపం చూపించాడు. ఆఖరి రెండు బంతులకు 10 పరుగులు చేయాల్సి ఉండగా.. సిక్సర్‌, ఫోర్‌ బాది ఒంటి చేత్తో గెలిపించాడు. మొత్తంగా 15 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి బంతికి చెన్నై సూపర్‌ కింగ్స్ చేధించింది. మ్యాచ్‌ అనంతరం ధోని తన రిటైర్‌మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు.

తన రిటైర్‌మెంట్‌కు ఇది మంచి సమయమని, కాకపోతే అభిమానులు ఇంతటి ఆప్యాయతలను చూసిన తర్వాత తనకు ఇంకా ఆడాలని ఉందని వ్యాఖ్యానించాడు. అయితే, అందుకు తొమ్మిది నెలలు కష్టపడాలని, వీలైనంత వరకు మరో సీజన్‌ ఆడేందుకు ప్రయత్నిస్తానన్నాడు.

Image

మహీ భాయ్‌ ఎమోషనల్‌..

ఎప్పుడూ కూల్‌గా ఉండే మహేంద్ర సింగ్‌ ధోని.. ఈసారి కాస్త ఎమోషనల్‌ అయినట్లు కళ్లలో స్పష్టంగా కనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏ క్రికెటర్‌కూ లేనంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, అభిమాన గణాన్ని ధోని సొంతం చేసుకున్నాడనడంలో సందేహం లేదు. అందుకే మాహి మాహి.. ధోని ధోని.. అంటూ దేశంలో ఏ స్టేడియంలోకి వెళ్లినా నినాదాలు, ధోని జెర్సీలు కనిపిస్తాయి. మొత్తంగా ధోని ఐదో ఐపీఎల్‌ టోర్నీని కైవసం చేసుకున్నాడు. సీఎస్కే అభిమానులు కడుపునిండా భోజనం తిన్నంత సంతృప్తితో తమ స్వస్థలాలకు చేరుకున్నారు.

Image

అంబటి రాయుడుకు ఘనంగా ఫేర్‌వెల్‌..

మరోవైపు సీఎస్కే ఆటగాడు అంబటి రాయుడు ఈ మ్యాచ్‌తో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెక్‌కు వీడ్కోలు చెప్పిన రాయుడు.. తాజాగా ఐపీఎల్‌కూ రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తన కెరీర్‌లో ఆరు ఐపీఎల్‌ టైటిళ్లు గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. కెరీర్‌ ఆఖరి మ్యాచ్‌లో ఫైనల్‌ నెగ్గడంతో అంబటి రాయుడు భావోద్వేగమయ్యాడు. మైదానంలో ప్లేయర్లందరినీ హగ్‌ చేసుకొని ఏడ్చేశాడు. ధోని సైతం అంబటి రాయుడును ఓదార్చాడు.

Read Also : MS Dhoni: గవాస్కర్ చొక్కాపై ధోని సంతకం..చెపాక్ క్రౌడ్‌కు మహేంద్రుడి ట్రీట్

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles