Ajit Agarkar: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) చీఫ్ సెలెక్టర్‌గా టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ అవకాశం దక్కింది. ఇంతకుముందున్న చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త చీఫ్ సెలెక్టర్ కోసం బీసీసీఐ అధిష్టానం సుదీర్ఘంగా సమాలోచనలు జరిపింది. ఆఖరికి అజిత్ అగార్కర్‌వైపే మొగ్గు చూపింది. టీమిండియా మాజీల్లో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. విధ్వంసకర బ్యాటర్‌గా పేరు గాంచిన వీరేందర్ సెహ్వాగ్ పేరు ప్రముఖంగా వినిపించింది. అనూహ్యంగా అగార్కర్ రేసులోకి వచ్చాడు. (Ajit Agarkar)
రానున్న ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ టోర్నీల నేపథ్యంలో అజిత్ అగార్కర్‌కు కీలక పదవి దక్కడం ఆసక్తికరంగా మారింది. టీమిండియా వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో జట్టు ఎంపిక అగార్కర్ నేతృత్వంలోనే జరగనుంది. దీంతో గత సంప్రదాయాలను అనుసరిస్తారా? లేక కొత్త సంప్రదాయాలను తీసుకొచ్చి ట్యాలెంట్ కలిగిన ఆటగాళ్లకు అవకాశాలిస్తారా? అనేది వేచి చూడాల్సి ఉంది. గత చీఫ్ సెలెక్టర్ చేతన్‌శర్మపై అనేక ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. క్రీడాకారుల ఎంపిక విషయంలో, తుది జట్టు కూర్పులో చేతన్‌శర్మ వ్యవహరించిన తీరుపై పలువురు అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేయక తప్పలేదు.
ఈసారి చీఫ్ సెలెక్టర్ పదవి కోసం బీసీసీఐ పెద్దలు కాస్త కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. చీఫ్ సెలెక్టర్ అయిన వ్యక్తి యువ ఆటగాళ్లను ప్రోత్సహించేలా ఉండాలి. సరైన జట్టు కూర్పు చేసేలా ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుంది. ఈ కోణంలో ఆలోచించి టీ20లు ఆడిన అనుభవం కలిగిన వ్యక్తి అయితే సరైన న్యాయం చేయగలుగుతారని, అందుకే అజిత్ అగార్కర్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే అగార్కర్ పేరును ఆమోదించడం, బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ఎంపిక చేయడం చకచకా జరిగిపోయాయి. రాబోయే కాలంలో వన్డే ప్రపంచ కప్‌తోపాటు టీ20 వరల్డ్ కప్ జట్లను ఎంపిక చేయాల్సి ఉన్నందున అగార్కర్ సేవలు కీలకంగా మారే అవకాశం ఉంది.
క్రికెట్ ఆడిన అనుభవమే కాకుండా దేశవాళీ జట్టుకుగానీ, ఐపీఎల్ జట్టుకుగానీ కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంటే బెటరని భావించిన బీసీసీఐ.. ఆ దిశగా అగార్కర్ పేరును పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ టోర్నీలో గతంలో ముంబై ఇండియన్స్ జట్టుకు అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉంది. అలాగే ఢిల్లీ జట్టు సహాయక కోచ్‌గానూ అగార్కర్ పని చేశాడు. ఈ అనుభవంతో రానున్న రోజుల్లో టీ20, వన్డేల్లో జట్టును ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించేందుకు సులభంగా ఉంటుందని భావిస్తున్నారు.
బౌలింగ్ విభాగంలో పూర్తి స్థాయిలో పట్టున్న అగార్కర్.. క్రికెట్ విశ్లేషకుడిగా విశేష అనుభవం ఉంది. ఆట తీరును నిశితంగా పరిశీలించే పరిజ్ఞానం ఉంది. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలోనూ కలిపి 349 వికెట్లు, 1,800కిపైగా పరుగులు చేశాడు అగార్కర్. అన్ని విభాగాల్లోనూ పట్టు సాధించి బలాబలాలను బేరీజు వేయగల శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. దీంతో అతడిని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా నియమించారు. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికైన వ్యక్తికి ఇప్పుడు రూ.కోటి జీతం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, క్రికెట్ విశ్లేషకుడిగా, కామెంటేటర్‌గా అంతకంటే ఎక్కువే అగార్కర్ ఆర్జిస్తున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వేతన ప్యాకేజీ రూ.3 కోట్లకు పెంచేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. మరోవైపు బీసీసీఐ సెలెక్టర్ పదవి కోసం అగార్కర్ ఒక్కడే దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Read Also : Girls in Andhra Pradesh: ఏపీలో ప్రతి 1,000 మంది అబ్బాయిలకు 1,046 మంది అమ్మాయిలు!