CM Jagan in Delhi: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హస్తిన పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ఈ పర్యటనలో ఢిల్లీలో తొలుత హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ సీఎం జగన్ భేటీ అయ్యారు. పెండింగ్ నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రాష్ట్ర విభజన సహా పరిష్కారం కాకుండా ఉండిపోయిన పలు సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం జగన్ కోరారు. (CM Jagan in Delhi)
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని, సుదీర్ఘకాలంగా ఇది పెండింగ్‌లో ఉందని ప్రధాని దృష్టికి సీఎం జగన్ తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా చేసేందుకు, తొలిదశ నిర్మాణానికి రూ.17,144 కోట్లు అవసరం అవుతాయని, ఇది కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనలో ఉందని సీఎం జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. పోలవరం తొలిదశ నిర్మాణానికి, కేంద్ర ఆర్థికశాఖ ఇప్పటికే రూ.12911.15 కోట్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, అయితే తొలిదశలో భాగంగా మరో 36 గ్రామాల్లోని నిర్వాసితులకు సహాయ పునరావాసం ప్యాకేజీ ఇవ్వాల్సి ఉందని సీఎం తెలిపారు. ఇది ఇస్తేనే తొలిదశ పూర్తి అయినట్లవుతుందని ప్రధానికి సీఎం వివరించారట.
మొత్తంగా పోలవరం తొలిదశ నిర్మాణానికి రూ.17,144 కోట్లు ఇవ్వాలని సీఎం కోరినట్లు సమాచారం. ఈ మేరకు జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో ఖర్చు చేసిన రూ.1,310.15 కోట్లను వెంటనే రీయింబర్స్ చేయాల్సిందిగా జగన్ కోరినట్లు తెలుస్తోంది. 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు తెలంగాణ రాష్ట్రానికి సరఫరాచేసిన విద్యుత్‌కు సంబంధించి బకాయిలు అలాగే పెండింగులో ఉన్నాయని ప్రధానికి సీఎం వివరించారట. రాష్ట్రానికి రావాల్సిన రూ.7,230.14 కోట్ల చెల్లింపులకు సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉందని, ఏపీ జెన్‌కో ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఈ బకాయిలు వచ్చేలా చూడాలని సీఎం కోరినట్లు తెలుస్తోంది.
జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత లోపించిన విషయాన్ని మరోసారి ప్రధానమంత్రి దృష్టికి జగన్ తీసుకెళ్లారని తెలుస్తోంది. ఏపీకన్నా ఆర్థికంగా ముందువరుసలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు జాతీయ ఆహార భద్రతాచట్టం కింద కనీసంగా 10 శాతం అధికంగా కవరేజీ ఉందని, పథకం అమలుకు ఎంచుకున్న ప్రమాణాల్లో హేతుబద్ధత లేదని ప్రధానికి జగన్ వివరించినట్లు సమాచారం. అలాగే నీతిఆయోగ్ కూడా దీన్ని నిర్ధారించిందని సీఎం తెలిపారు.
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు పెండింగులో ఉన్నాయని జగన్ వివరించారు. ప్రత్యేక హోదా సహా… పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మరోసారి జగన్ కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రత్యేక హోదా దోహదపడుతుందని, రాష్ట్రం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతుందని, ఈ మేరకు సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రధానికి సీఎం జగన్ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
అలాగే రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన, 17 మెడికల్ కాలేజీలకు నిధులు, కడప స్టీల్ ప్లాంటుకు నిధులు, ఏపీ పౌరసరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సబ్సిడీ బకాయిలు రూ.1,702.90 కోట్లను మంజూరు చేయాలని సీఎం జగన్ కోరినట్లు తెలుస్తోంది.
