Temple Visit Rules: నిత్యం గుడికి వెళ్లి దైవాన్ని దర్శించుకొనే వారు చాలా మంది ఉంటారు. తమ కష్టాలు తొలగిపోవాలని, జీవితంలో అభివృద్ధి సాధించాలని మొక్కుకుంటూ ఉంటారు. మరోవైపు ప్రశాంతత కోసం కూడా చాలా మంది ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే, గుడికి వెళ్లిన సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో చాలా మందికి తెలియదు. (Temple Visit Rules)
దేవుడు సత్య స్వరూపుడు కాబట్టి గుడిలో అబద్ధాలు చెప్పరాదని సూచిస్తున్నారు. మరోవైపు ఎప్పుడూ దేవాలయంలో దేవుడికి వీపు భాగం చూపిస్తూ కూర్చోకూరాదని చెబుతున్నారు. శివాలయంలో శివునికి నందికి మధ్యలో నడవకూడదని హెచ్చరిస్తున్నారు. ఆలయానికి వెళ్లినప్పుడు వస్త్రంతో లేదా షాలువాతో శరీరాన్ని పూర్తిగా కప్పుకోవాలని సూచిస్తున్నారు.
ముఖ్యంగా ఆలయానికి వెళ్లినప్పుడు ప్రదక్షిణాలు చేయడానికంటే ముందు దేవుడికి మొక్కుకొని తర్వాత ప్రదక్షిణలు చేయాలి. అనంతరం గుడి లోపలికి వెళ్లాలి. అలాగే ప్రదక్షిణ చేసే సమయంలో తప్ప ఇంకెప్పుడూ దేవాలయం ధ్వజస్తంభం నీడను, ప్రాకారం నీడను దాటకూడదని పండితులు చెబుతున్నారు. చంచల మనసుతో స్వామిని దర్శించకూడదట. ఆలయంలో దేవుని ఎదుట అబద్ధాలు చెప్పకూడదని పండితులు సూచిస్తున్నారు.
ఆలయంలోకి వెళ్లినప్పుడు స్వార్థంతో కూడిన మాటలు, ప్రవర్తన ఉండరాదని చెబుతున్నారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ దైవంగా భావించి ప్రవర్తించాలని సూచిస్తున్నారు. ఆలయం వెలుపల ఉండే యాచకులకు తోచిన సహాయం చేయాలని చెబుతున్నారు. ఇంటి నుంచి తయారు చేసుకుని తీసుకెళ్లిన ప్రసాదాన్ని పంచి పెట్టాలని, ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని చెబుతున్నారు. గుడికి వెళ్లేటప్పుడు సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించాలి. మహిళలు తప్పక కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. జుట్టు విరబోసుకొని పోరాదని చెబుతున్నారు. ఉతికిన బట్టలు ధరించాలి. ఆలయంలో దేవతామూర్తికి ఎదురుగా మొక్కరాదు. ఓ పక్కకు నిల్చొని మొక్కాలని చెబుతున్నారు.
దేవాలయ గర్భ గృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన పంచలోహా యంత్రాన్ని నిక్షిప్తం చేసి ఉంచుతారని పండితులు, పెద్దలు స్పష్టం చేస్తున్నారు. పంచలోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంటుందని చెబుతున్నారు. ఆవిధంగా లోహం గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుందని సూచిస్తున్నారు. రోజూ గుడికి వెళ్లి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయని చెబుతున్నారు. దాని వలన శరీరంలోనికి పాజిటివ్ తరంగాలు ప్రవేశించి ఆరోగ్యంగా ఉంచుతాయని పెద్దలు చెబుతారు.
గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా గొప్ప పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఆలయాల్లో గంటలు మోగిస్తుంటారనే విషయం తెలిసిందే. వేద మంత్రాలు పండితులు పఠిస్తారు. భక్తి గీతాలు పాడతారు. ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూర్చేందుకు దోహదం చేస్తాయి. మనస్సును చైతన్య పరిచేలా చేస్తాయి. గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే పరిమళాలు శరీరంతో రసాయణ చర్య జరిగి శక్తిమంతం అవుతుంది.
Read Also : Daily Puja: పూజ సమయంలో ఇలాంటి పద్ధతులు పాటిస్తే సకల శుభాలు..