Daily Puja: ప్రతి రోజూ భగవంతుడిని పూజించడం (Daily Puja) చాలా మంది ఇళ్లలో చేస్తుంటారు. ప్రత్యేకించి ఉదయం సమయంలో భగవదారాధన, సంధ్యా సమయంలో దేవుడిని స్మరిస్తూ శ్లోకాలు చదువుకోవడం ఉత్తమ జీవనాన్ని ప్రసాదిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే, పూజ చేసే సమయంలో కొందరు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల భగవంతుని అనుగ్రహానికి దూరం అవుతుంటారు. సరైన విధానంలో పూజలు చేయడం వల్ల దైవానుగ్రహం మెండుగా ఉంటుందని పెద్దలు సూచిస్తున్నారు.
చాలా మందికి ఉదయం, సాయంత్రం పూజ చేయడం అలవాటు. ప్రత్యేకించి తెల్లవారుజామున పూజ చేయడం శ్రేయస్కరమని పెద్దలు చెబుతున్నారు.ఈ సమయంలో చేసే ఏదైనా పవిత్ర కార్యం మరింత ఫలవంతంగా ఉంటుందట. ఆరాధన ప్రశాంతమైన మనస్సును కోరుతుంది. వేదాల ప్రకారం, భగవంతుడు ఉదయాన్నే ప్రార్థనలను ఎక్కువగా స్వీకరిస్తాడని చెబుతున్నారు. ధ్యాన స్థితిలో ఉండటానికి మనల్ని ప్రేరేపిస్తుందని స్పష్టం చేస్తున్నారు.
రోజూ దేవుడిని ఆరాధించేందుకు, పూజించేందుకు స్వచ్ఛమైన మనసు, సంకల్పం అవసరం. ఒక్కోసారి పూజ సందర్భంగా తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. రోజూ దేవుడిని పూజించే విధానం ఎలాగో తెలుసుకోవాలి. పూజ అంటే సంస్కృతంలో పూజించడం, లేదా ఆరాధించడం అని అర్థం. భగవంతుడి పూజ లేదా నిత్య పూజగా పిలుస్తారు. మానవునికి మంచి జీవితం ప్రసాదించినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతూ పూజ చేస్తుంటారు.
పూజ చేయడానికి ముందుగా ప్రశాంతమైన ప్రదేశం ఉండేలా చూసుకోవాలి. కాబట్టి అంతరాయం లేని స్థలాన్ని ఎంచుకుంటే మంచిది. ఉత్తరం లేదా తూర్పు దిశలో చెక్క పలక లేదా చాప మీద కూర్చొని పూజ చేయాలి. కొంచెం నీరు లేదా గంగాజలం కలిపిన నీటిని చేతిలోకి తీసుకుని పూజా స్థలంలో చల్లి పూజా స్థలాన్ని శుద్ధి చేసుకోవాలి. దేవుని విగ్రహం లేదా ఫోటో శుభ్రం చేయడానికి ప్రత్యేక క్లాత్ వాడాలి. ఉదయాన్నే స్నానం చేశాక ఇవన్నీ చేయాలి. దీపాన్ని వెలిగించేటప్పుడు మీరు బొట్టు పెట్టుకొని దీపాలకూ కుంకుమ, పసుపు పెట్టాలి. అగరబత్తీలతో పాటు కర్పూర హారతి రోజూ ఇవ్వడం వల్ల ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది.
కొబ్బరికాయను లక్ష్మీ నివాసంగా భావిస్తారు. టెంకాయ ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెబుతారు. దీని కోసం కొబ్బరికాయను తీసుకొని ఎర్రటి గుడ్డలో చుట్టుకోవాలి. తర్వాత ఈ కొబ్బరికాయను లక్ష్మీదేవి వద్ద ఉంచి పూజ చేయాలి. అనంతరం సురక్షితమైన ప్రాంతంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోయి ఇంట్లో సుఖ శాంతులు చేకూరుతాయని పండితులు సూచిస్తున్నారు. అలాగే 11 శుక్రవారాలు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి పసుపు కలిపిన బియ్యంతో పూజ చేయడం వల్ల సంపద లభిస్తుందని పేర్కొంటున్నారు.
నేటి కాలంలో ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది సతమతం అవుతుంటారు. అప్పులు తీర్చలేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఆర్థిక సమస్యల కారణంగా కొందరికీ జీవితాలు తలకిందులైపోతుంటాయి. ఇలాంటి తరుణంలో లక్ష్మీదేవి కరుణ, కటాక్షాలు తమపై ఉండాలని కోరుకుంటారు. అందుకే పూజ సమయంలో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా ఆరాధించడం వల్ల ఆర్థికపరమైన కష్టాలు తొలగిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also : Goddess Durga: సూర్యభగవానుని, దుర్గమ్మను ఎలా పూజించాలి?