Tripura Governor: తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిని పదవి వరించింది. త్రిపుర రాష్ట్ర నూతన గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డిని నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. (Tripura Governor)
మరోవైపు ఒడిశా గవర్నర్‌గా రఘుబర్ దాస్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది. రఘుబర్ దాస్ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధ్యక్షుడిగా నల్లు ఇంద్రసేనారెడ్డి పని చేశారు. ఆయన స్వస్థలం సూర్యాపేట జిల్లా. మలక్‌పేట నుంచి గతంలో మూడు సార్లు బీజేపీ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన సేవలను గుర్తించిన బీజేపీ జాతీయ పెద్దలు ఉమ్మడి ఏపీ అధ్యక్షుడిగానూ అవకాశం కల్పించారు. 2022లో బీజేపీ చేరికలు, సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా ఇంద్రాసేనారెడ్డి పని చేశారు.
ఇంద్రసేనారెడ్డి సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామంలో నల్లు రాంరెడ్డి, హనుమాయమ్మ దంపతులకు సంతానం. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1972లో ఎం.ఎస్.సి పూర్తి చేశారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుంచి 1975లో ఎంఫిల్ కంప్లీట్ చేశారు.
విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే రాజకీయాలపై ఇంద్రసేనారెడ్డికి ఆసక్తి. 1980లో భారతీయ జనతా పార్టీలో చేరారు. 1983, 1985, 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మలక్‌పేట్ నుంచి బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996, 2004లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ లోకసభ నియోజకవర్గం నుంచి, 2009లో మల్కాజ్‌గిరి లోకసభ నుంచి, 2014లో భువనగిరి లోకసభ స్థానానికి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన బీజేపీలో జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా.. ఇలా వివిధ హోదాల్లో బీజేపీలో పని చేశారు.
మరోవైపు ఒడిశా గవర్నర్‌గా తాజాగా నియమితులైన రఘుబర్‌దాస్ 2014 నుంచి 2019 వరకు ఝార్ఖండ్ సీఎంగా తన సేవలను అందించారు. జాతీయ స్థాయిలో పార్టీకి ఉపాధ్యక్షుడిగా కూడా ఆయన పని చేసి బీజేపీలో పేరు ప్రఖ్యాతలు గడించారు.
ఇదీ చదవండి: Priyanka Gandhi: తెలంగాణలో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది : ప్రియాంక గాంధీ