కర్ణాటక (Karnataka) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ.. అంతకు మించి అన్నట్లు సంచలనాలు నమోదు చేసింది. మరోవైపు బీజేపీ (BJP Karnataka) చాలా చోట్ల ఓటమి పాలు కాక తప్పలేదు. 136 స్థానాల్లో కాంగ్రెస్ (Congress) పార్టీ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. మరోవైపు జేడీఎస్ (JCS) దారుణంగా దెబ్బతింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 37 స్థానాలు గెలుపొందిన జేడీఎస్.. ప్రస్తుతం 21 స్థానాలకే పరిమితమైంది. దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని బీజేపీ (BJP) కోల్పోయింది. కర్ణాటకలో కేవలం 64 సీట్లకే పరిమితమైంది.
కర్ణాటక (Karnataka) ఎన్నికల ఫలితాలపై స్పందించిన మాజీ సీఎం కుమార స్వామి.. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్నారు. కొత్త ప్రభుత్వానికి తన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ ను కోరారు. తమకు మద్దతు తెలిపి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇక రామనగరలో కుమారస్వామి కొడుకు నిఖిల్ ఓటమి పాలయ్యారు. అయితే, చెన్నపట్నలో కుమార స్వామి విజయం సాధించారు.
మరోవైపు అథనిలో లక్ష్మణ సవది కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ మంత్రి సోమన్న ఓటమి పాలయ్యారు. బ్రహ్మానందం ప్రచారం చేసిన బీజేపీ అభ్యర్థి సుధాకర్ ఓటమి పాలయ్యారు. సాయంత్రం బెంగళూరులో సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు.సీఎల్పీ నేతను ఈ సమావేశంలో నేతలు ఎన్నుకోనున్నారు.సీఎల్పీ సమావేశం తర్వాత గవర్నర్‌ను కలిసే అవకాశం ఉంది.మరోవైపు గెలిచిన ఎమ్మెల్యేలు బెంగళూరుకు రావాలని కాంగ్రెస్ పెద్దలు పిలుపునిచ్చారు.
బస్వరాజ్ బొమ్మై రాజీనామా చేసిన వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ చర్యలు తీసుకోనుంది. ఈ విజయం సోనియా, రాహుల్‌కు అంకితమని డీకే శివకుమార్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తల కష్టానికి ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇక సీఎం రేసుపై డీకే శివకుమార్ స్పందించారు. మద్దతుదారులంతామీరే సీఎం కావాలంటూ కోరుకుంటున్నారన్న వ్యాఖ్యలపై ఆయన స్పందింస్తూ.. తనకంటూ మద్దతుదారులెవరూ లేరని చెప్పారు. మొత్తం కాంగ్రెస్ తనకు సపోర్ట్ గా ఉందని వెల్లడించారు. ఈ విజయం పార్టీ కార్యకర్తలు, నాయకులు.. అందరిదీనని వ్యాఖ్యానించారు.
మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు పని చేసిందని మాజీ సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. కర్ణాటక ప్రజలు మార్పును కోరుకున్నారని తెలిపారు. రాహుల్ పాదయాత్ర కలిసొచ్చిందన్న సిద్ధు.. ఇది మతరాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అని స్పష్టం చేశారు. ఇక కర్ణాటక ఫలితాలపై సోనియా, రాహుల్ గాంధీలకు తమిళనాడు సీఎం స్టాలిన్ ఫోన్ చేశారు. కర్ణాటకలో (Karnataka) కాంగ్రెస్ గెలుపుపై శుభాకాంక్షలు తెలిపారు. ఖర్గే, సిద్ధరామయ్య, డీకేలకు ఫోన్ చేసి స్టాలిన్ అభినందించారు.
కర్ణాటక ఫలితాలు బీజేపీకి అనుకూలంగా లేవని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. అయినప్పటికీ గతంలో మాదిరిగానే 36 శాతం ఓట్లు సాధించామన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 28 స్థానాలు గెలుస్తామని దీమా వ్యక్తం చేశారు. ఒక రాష్ట్రంలో ఎన్నికల ఫలితం ప్రభావం మరో రాష్ట్రంపై పడదని వ్యాఖ్యానించారు.
Read Also : Cardamom: ఆరోగ్యానికి యాలకులు చేసే మేలు అంతా ఇంతా కాదు..!