Anti Naxal Meeting: అభివృద్ధిమంత్రంతో వామపక్ష తీవ్రవాదం తగ్గుదల.. జాతీయ సమావేశంలో సీఎం జగన్

Anti Naxal Meeting: అభివృద్ధి ఫలాలు గిరిజనులకు, అట్టడుగు వర్గాలకు చేరవేయడం ద్వారా వామపక్ష తీవ్రవాదం గణనీయంగా తగ్గిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలిపారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌ హాజరయ్యారు. రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదం తగ్గడానికి గల కారణాలను సీఎం జగన్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. (Anti Naxal Meeting)

“ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గడిచిన నాలుగు దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాద సమస్యపై పోరాడుతోంది. ఈ ప్రాంతాల్లో జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళిక ప్రకారం.. తీసుకున్న చర్యలు, అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, స్ధానిక ప్రజల హక్కుల పరిరక్షణ వంటి బహుముఖ విధానం– సానుకూల ఫలితాలను అందించింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ మద్దతుతో, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద సమస్యను సమర్థంగా ఎదుర్కోవడానికి అన్ని చర్యలనూ తీసుకుంటోంది. (Anti Naxal Meeting)

మా ప్రభుత్వం అనుసరించిన వ్యూహాల వల్ల రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద హింసాత్మక సంఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. మొదట్లో ఆంధ్రప్రదేశ్‌లోని 5 జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టు కార్యకలాపాలు ఇప్పుడు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి. మావోయిస్టు తీవ్రవాదబలం 2019 నుంచి 2023 నాటికి 150 నుంచి 50కి తగ్గింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తన సరిహద్దులను ఒడిశా, తెలంగాణా మరియు చత్తీస్‌ఘడ్‌లతో పంచుకుంటుంది. పొరుగు రాష్ట్రాలతో పటిష్టమైన సమన్వయం ఉంది. నాలుగు రాష్ట్రాల అధికారులతో కూడిన జాయింట్‌ టాస్క్‌ఫోర్స్‌లు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడానికి మాకున్న సమాచారాలను ఈ ఉమ్మడి టాస్కఫోర్స్‌ ద్వారా పరస్పరం పంచుకుంటూ… సమిష్టిగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాం.

స్ధిరమైన అభివృద్ధి మరియు సామాజిక, ఆర్ధిక పురోగతి మాత్రమే తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కీలక పరిష్కారాలు అని నేను ధృఢంగా విశ్వసిస్తున్నాను. పేదరికం, అవిద్య, అందుబాటులో లేని వైద్యం మరియు సమాజాన్ని పీడిస్తున్న పరిమితమైన ఉపాధి అవకాశాలే తీవ్రవాదానికి అత్యంత అనుకూల అంశాలు. సమర్ధవంతమైన విధానాలను రూపొందించి, వాటిని అమలు చేయడం ద్వారా మాత్రమే దీన్ని రూపుమాపగలం.

ఆపరేషన్‌ పరివర్తనలో భాగంగా 2020–21 నుంచి ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు 9,371 ఎకరాల్లో గంజాయి సాగను ధ్వంసం చేశారు. 224 కేసులు నమోదు చేసి, 141 మంది నిందితులను అరెస్టు చేశారు. దాదాపు 3.24 లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని తగులబెట్టారు. నిరంతరాయంగా చేస్తున్న ఈ ఆపరేషన్‌ వల్ల …. 2022లో గంజాయి సాగు 1500 ఎకరాలకు తగ్గిందని, ప్రస్తుత సంవత్సరం అంటే 2023లో అది కేవలం 45 ఎకరాలకు మాత్రమే పరిమితమైందని చెప్పడానికి సంతోషిస్తున్నాను.

గంజాయి సాగు చేసే గిరిజనుల ఆలోచనా విధానంలో మార్పు తీసుకునిరావడానికి జిల్లా యంత్రాంగం, పోలీసులు గంజాయి సాగు చేపడుతున్న గిరిజనులతో సంప్రదించి.. వారికి ప్రత్యామ్నాయ పంటలైన కాఫీ, నిమ్మ, జీడి మామిడి, నారింజ, కొబ్బరి, చింతపండు, సిల్వర్‌ ఓక్‌తో పాటు రాజ్మా, కందిపప్పు, వేసుశెనగ వంటి పంటలసాగును ప్రోత్సహిస్తూ వారికి జీవనోపాధి కల్పిస్తోంది. తద్వారా వారిని గంజాయి సాగు నుంచి మరల్చే ప్రయత్నం చేస్తోంది.

ఆర్‌ఓఎఫ్‌ఆర్‌… అటవీ ప్రాంతంలో అర్హులైన 1.54 లక్షల మంది గిరిజన రైతులకు 3.22 లక్షల ఎకరాల మేరకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు జారీచేశాం. వారి భూములను సాగు చేసుకునేందుకు మద్ధతుగా, పెట్టుబడి ఖర్చు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతు భరోసాగా రూ.13,500 ఆర్ధిక సహాయం అందజేస్తోంది. మావో ప్రభావిత ప్రాంతాల్లో రహదారులతో అనుసంధానం అన్నది అత్యంత కీలకమైన అంశం. ఈ నేపధ్యంలో మేము వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో లెఫ్ట్‌ వింగ్‌ ఎక్స్‌ట్రీమిజమ్‌ ఎఫెక్టెడ్‌ ఏరియాస్‌ స్కీం కింద ఇప్పటికే 1087 కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసాం.

ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్ధవంతంగా, పారదర్శకంగా, త్వరితగతిన అందజేయడం కోసం మేము 897 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశాం. ఒక్కో సచివాలయంలో 10 మంది ఉద్యోగులతో పాటు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ కూడా ఉన్నారు. కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. ఇందులో భాగంగా మొబైల్‌ కనెక్టివిటీ పెంచడం కోసం 944 కమ్యూనికేషన్‌ టవర్‌లను ఏర్పాటు చేశాం.

వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో విద్య ప్రధానమైనది. భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆంధ్రప్రదేశ్‌లో 28 ఏకలవ్య పాఠశాలలను మంజూరు చేసింది. వాటిలో 24 పాఠశాలలు వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లోనే ఉన్నాయి. వీటి ద్వారా మా గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్య అందుతోంది. దీనితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం 1953 ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలు మరియు 81 గురుకుల పాఠశాలలు, 378 ఆశ్రమ పాఠశాలలతో పాటు 179 ప్రీ మరియు పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లను నిర్వహిస్తోంది.

వీటిని మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు–నేడు కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాల కల్పిస్తూ… డిజిటలైజేషన్‌ పరంగా తరగతిగదులన్నింటినీ అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. మరోవైపు పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించేందుకు, వారికి ఆర్ధిక సహాయం అందించేందుకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా సంవత్సరానికి రూ.15,000 అందిస్తున్నాం.

మరోవైపు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సంవలను బలోపేతం చేయడానికి, మా ప్రభుత్వం కొత్తగా 879 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ను ఏర్పాటు చేసింది. దీంతో పాటు అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలను అందించేందుకు గిరిజన ప్రాంతాల్లో 75 –108 అంబులెన్స్‌లు పనిచేస్తున్నాయి. 89 మొబైల్‌ మెడికల్‌ యూనిట్ల(104) ద్వారా గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్‌ సేవలను కూడా ప్రవేశపెట్టాం.

సికిల్‌ సెల్‌ అనీమియా, తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న గిరిజనులకు ఆరోగ్య పించను కింద నెలకు రూ.10వేలు అందజేస్తున్నాం. వృద్ధ్యాప్య ఫించను కింద గిరిజన ప్రాంతాల్లో 50 ఏళ్లనుంచే నెలకు రూ.2750 ఇస్తున్నాం. మేము ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ.. గిరిజన ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాలను పెంచాల్సిన ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. దీనికోసం ఈ మావో ప్రభావిత జిల్లాల్లో కనీసం 15 కొత్త బ్యాంకు శాఖలు మంజూరు కావాల్సి ఉంది.

గతంలో సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో సిఫార్సు మేరకు వైజాగ్‌లో గ్రేహౌండ్స్‌ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమిని సైతం కేటాయించి దీనికి సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిందన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. దీనిని వీలైనంత త్వరగా మంజూరు చేయగలరు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధి, శాంతిని సాధించడం, వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలు విస్తరించకుండా నిరోధించడం కోసం కేంద్ర, రాష్ట్రాల నడుమ నిరంతరం పరస్పర సహాయ సహకారాలు అవసరం.

ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అయినప్పటికీ… వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలకు.. అక్కడ పోలీసు బలగాల ఆధునీకరణ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్ధిక మరియు వ్యూహాత్మక మద్ధతును కేంద్రం అందించడం అన్నది చాలా కీలకం. హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ధృడమైన మార్గదర్శకత్వం, మద్దతుతో మేము మా రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద సమస్యను విజయవంతంగా రూపుమాపుతామని, మా ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తామని నేను విశ్వసిస్తున్నాను.” అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: CM Jagan letter to PM Modi: ఏపీ ప్రజల ఆందోళనలను అర్థం చేసుకోండి.. కృష్ణా జలాల అంశంపై జోక్యం చేసుకోవాలని ప్రధానికి సీఎం జగన్‌ లేఖ

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles