CM Jagan letter to PM Modi: కృష్ణా జలాల అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళనలను అర్థం చేసుకోవాలని, ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి జగన్ కోరారు. ఈ మేరకు జగన్.. ప్రధానికి లేఖ రాశారు. 1956 నాటి అంతర్ రాష్ట్ర నదీజలాల వివాద చట్టం (ISRWD)లోని సెక్షణ్ 4 ప్రకారం కృష్ణా జలవివాద ట్రిబ్యునల్ -1 (బచావత్, KWDT -1)ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. లేఖలో ఇంకా ఏమన్నారంటే.. (CM Jagan letter to PM Modi)
“KWDT -I ఇచ్చిన తుది నివేదిక ఆధారంగా 1976, మే 31న దీన్ని గెజిట్ చేయడం జరిగింది. కృష్ణానదిలో 2130 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని KWDT -I ట్రైబ్యునల్ లెక్కకట్టింది. 75శాతం ప్రవాహాలు ఉంటాయన్న అంచనాతో ఈ లెక్క వేసింది. దీని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి KWDT-I 811 టీఎంసీల నీటిని కేటాయించింది. 2130 టీఎంసీల కన్నా అధికంగా ఉన్న నీటిని, మిగులు ప్రవాహాలను ఉపయోగించుకునేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వేఛ్చను ఇచ్చింది. ISRWD చట్టం, 1956లోని సెక్షన్ 6(1) ప్రకారం, KWDT-I చేసిన అవార్డును సుప్రీం కోర్ట్ డిక్రీ ద్వారా అమల్లోకి వచ్చింది.
తదనంతరం, ISRWD చట్టం, 1956లోని సెక్షన్ 4 (1) ప్రకారం 02.04.2004న KWDT-II (బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్)ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ 30.12.2010న తన ‘నివేదిక’ని సమర్పించింది. KWDT-II (బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్) 29.11.2013న సెక్షన్ 5(3) ప్రకారం KWDT-I ద్వారా ఇప్పటికే 75% డిపెండబిలిటీతో చేసిన 2,130 TMCల కేటాయింపులను నిర్ధారిస్తూ తన ‘తదుపరి నివేదిక’ను సమర్పించింది.
దీంతోపాటు బేసిన్ రాష్ట్రాలకు సగటు ప్రవాహాలతో సహా 65% ఆధారపడదగిన అదనపు నీటిని కూడా కేటాయించింది, దీని కింద, పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 194 TMC కేటాయించబడింది. ఈ విధంగా, పూర్వపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చేసిన మొత్తం కేటాయింపు 1005 TMC (811 TMC +194 TMC) వరకు చేరుతుంది. దీంతోపాటు 2578 TMC కంటే ఎక్కువుగా ఉండే అదనపు ప్రవాహాలను ఉపయోగించుకోవడానికి పూర్వపు ఆంధ్రప్రదేశ్‌కు స్వేఛ్చను ఇచ్చింది.
KWDT-II యొక్క నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టులో 5 SLPలను కృష్ణానదీజలాలపై ఆధారపడ్డ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో దాఖలు చేశాయి. సెక్షన్ 5(2) ప్రకారం KWDT-II నివేదికను పక్కన పెట్టాలంటూ పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. సుప్రీం కోర్ట్ తన ఉత్తర్వుల ద్వారా 16.09.2011న KWDT-IIపై స్టే ఇచ్చింది. అన్ని SLPలు సుప్రీంకోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయి.
దీనికి సంబంధించి, నేను ఈ సమస్యను కేంద్ర జలశక్తిశాఖ మంత్రి దృష్టికి 17.08.2021న, తర్వాత 25-06-2022న తీసుకురావడం జరిగింది. ట్రిబ్యునల్ ద్వారా జరిగిన కేటాయింపులకు ఎలాంటి భంగంరాకుండా చట్టపంగా న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని కోరడం జరిగింది. ఇది ఇలా ఉండగా, ISRWD చట్టం, 1956 సెక్షన్ 5(1) ప్రకారం KWDT-IIకి విధివిధానాలు (ToR) జారీకి 4.10.2023న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.
14.07.2014న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థన, ఫిర్యాదు ప్రకారం… ఈ విధివిధానాలు కేవలం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకే పరిమితం చేయబడ్డాయి. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కృష్ణానది ప్రవాహాలపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాలకు (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ) మాత్రమే వీటిని పరిమితం చేయడం, కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఇతర రెండు రాష్ట్రాలను (మహారాష్ట్ర మరియు కర్ణాటక) పూర్తిగా మినహాయించాలని ఏకపక్షంగా సూచించడం అశాస్త్రీయమని దృఢంగా విశ్వసిస్తున్నాను. ఇది జాతీయ ఆస్తి అయిన నీటి వనరులను న్యాయంగా వినియోగించుకోవడానికి వ్యతిరేకమైంది కూడా.
పైన పేర్కొన్న వాస్తవాలను పరిగణలోకి తీసుకుని, ఇందులో ఉన్న న్యాయపరమైన చిక్కులను పరిశీలించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, తదుపరి చర్యలు తీసుకోకుండా సంబంధిత వ్యక్తులను ఆదేశించవలసిందిగా కోరుతున్నాను.” అని సీఎం జగన్ లేఖలో ప్రధానిని కోరారు.
ఇదీ చదవండి: CM Jagan with Amit Shah: అమిత్ షాతో సీఎం జగన్ భేటీ.. కృష్ణా జలాలు, పోలవరంపై చర్చలు