ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఏడు ఎమ్మెల్సీలు (MLC Elections) కూడా తామే గెలుస్తామని భావించిన వైసీపీ.. ఒక్క సీటును కోల్పోయింది. వైసీపీ నుంచి గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటంతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో గెలుపొందారు. దీంతో వైసీపీకి ఆరు ఎమ్మెల్సీ సీట్లు వచ్చాయి. టీడీపీకి కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ చంద్రబాబు వ్యూహంతో ఒక ఎమ్మెల్సీని (MLC Elections) గెలిపించుకున్నారని టీడీపీ సంబరాలు చేసుకుంటోంది.
అధికార పార్టీకి 156 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. సొంతంగా గెలిచిన 151 ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ నుంచి కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్‌తో పాటు వాసుపల్లి గణేష్.. ఈ నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు తెలిపారు. అయితే, అధికారికంగా వైసీపీలో చేరనప్పటికీ సీఎం జగన్‌ను కలిసి పార్టీకి మద్దతు తెలిపారు. ఇక టీడీపీ నుంచి గెలిచిన 23 మందిలో ఇప్పుడు 19 మంది మాత్రమే ఆ పార్టీలో ఉన్నారు. అయితే, ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి గత కొంత కాలంగా వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీదేవి తిరుగుబాటు..
వీరికి తోడు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఫలితంగా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపు నల్లేరు మీద నడక అయ్యింది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నా సొంత పార్టీ ఎమ్మెల్యేల కదలికల్ని వైసీపీ అధిష్టానం గుర్తించలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి కాకుండా టీడీపీకి శ్రీదేవి, చంద్రశేఖర్‌రెడ్డి కూడా టీడీపీకే ఓటేశారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వచ్చింది. క్రాస్ ఓటింగ్ కారణంగా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు.
తమకు 19 మంది ఎమ్మెల్యేల మద్దతే ఉన్నప్పటికీ అభ్యర్థిని నిలబెట్టడానికి ముందే వైసీపీ ఎమ్మెల్యేలతో టీడీపీ అధిష్టానం టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అవకాశం లేకపోయినా చంద్రబాబు అభ్యర్థిని నిలపడంపై అప్పుడే అందరికీ అనుమానం కలిగింది. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల కదలికలను పసిగట్టాలి. అయితే, టీడీపీ కదలికలపై, ఎత్తుగడలపై అధికార పార్టీ మేల్కోలేకపోయిందని స్పష్టమైంది. క్రాస్ ఓటింగ్ దెబ్బకు గతంలో టీడీపీ, కాంగ్రెస్ కూడా ఇలాగే దెబ్బ తిన్నాయి. ఇప్పుడు వైసీపీకి ఈ దెబ్బ తగిలింది. గతంలో రాయపాటి సాంబశివరావు ఇలాగే గెలిచారు. ఆయన ఎలా గెలిచారన్నది ఇప్పటికీ రహస్యమే.
సంక్షేమ సారథికి రెబెల్స్ బెడద!
అధికార పార్టీకి నిజానికి 156 మంది మద్దతు ఉంది. 2 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమచేసిన జగన్.. 35 లక్షల మంది పేదలకు ఇల్లు కూడా నిర్మించి ఇస్తున్నారు. పదుల సంఖ్యలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వానికి ఇప్పుడు రెబల్స్ రూపంలో కొంత వ్యతిరేకత ఎదురవుతోంది. సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడుస్తారని అధికార పార్టీ ఊహించలేకపోయింది. అందరూ పక్కకు పోకుండా ఓట్లు వేయించే ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీకి చుక్కెదురైంది.
రెబెల్స్ వ్యవహారం ఇప్పుడు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. అయితే, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థికి ఓటేసిన వారికి టీడీపీ నుంచి ఎలాంటి హామీలు వచ్చాయి? అనేది తెలియాల్సి ఉంది. నిజంగా వైసీపీపై అసంతృప్తితోనే ఇలా జరిగిందనేది బహిరంగ రహస్యమే. ఉండవల్లి శ్రీదేవి హైదరాబాద్‌లో డాక్టర్‌గా పని చేస్తుండేవారు. ఆమెను తాడికొండ నియోజకవర్గానికి తీసుకొచ్చి జగన్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.
శ్రీదేవి డాక్టర్‌గా హైదరాబాద్‌లో సేవలందించేవారు. 2019లో టికెట్ ఇచ్చి పోటీలో నిలబెట్టగా ఆమె గెలుపొందింది. ఈ క్రమంలో ఆది నుంచి ఆమె పలు వివాదాల్లో చిక్కుకున్నారు. కార్యకర్తలను ఉసిగొల్పడం, వివాదాల్లో చిక్కుకోవడం ఆమెకు పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే వివాదాన్ని పరిష్కరించేందుకు తాడికొండలో వైసీపీ అధిష్టానం ఇన్‌చార్జ్‌గా డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను నియమించింది. దాదాపు ఆరు నెలలు ఆయన అక్కడ ఇన్‌చార్జ్‌గా పని చేశారు. ఆ తర్వాత ఇన్‌చార్జ్‌గా క్రిస్టినాను వైసీపీ నియమించింది.
వివాదాలకు కేరాఫ్ శ్రీదేవి
ఎమ్మెల్యేను కాదని వేరే వారిని ఇన్‌చార్జ్‌గా నియమించడంపై శ్రీదేవి, ఆమె అనుచరులు భగ్గుమన్నారు. పలుమార్లు కార్యకర్తలు ధర్నాలు, నిరసనలు కూడా తెలిపారు. శ్రీదేవి కూడా ప్రెస్‌మీట్లలో అధిష్టానంపై గుస్సా అయ్యారు. ఈ పరిణామాల మధ్య తనకు ఎలాగూ వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని భావించిన ఉండవల్లి శ్రీదేవి.. టీడీపీ వైపు మొగ్గు చూపారు. కోలా గురువులు, జయమంగళకు కేటాయించిన 44 మంది ఎమ్మెల్యేల్లో ఈ ఇద్దరు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు.
అసంతృప్త ఎమ్మెల్యేలతో చర్చలు జరపాల్సిన అధిష్టానం.. పట్టించుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కీడెంచి మేలెంచాలని అంటారు. సీటు రాని వారిని బుజ్జగించాల్సింది పోయి.. పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. తమకు సీటు రానప్పుడు మా మార్గం మేము చూసుకోవాలని భావించిన రెబల్ ఎమ్మెల్యేలు.. టీడీపీ వైపు మొగ్గు చూపారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో వ్యూహం లేకుండా అధికార పార్టీ ముందుకెళ్లినట్లు స్పష్టం అవుతోంది.
టీడీపీ గెలిచిన నియోజకవర్గాలపై ఇప్పటికే ఫోకస్ పెట్టిన సీఎం జగన్.. ఆ మేరకు అక్కడ పార్టీని బలోపేతం చేయాలని ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. అయితే, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై దృష్టి పెట్టిన టీడీపీ.. చాప కింద నీరులా టీడీపీ బలపడుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనంగా మారాయని చెబుతున్నారు.
Also Read : Blood Purifying: రక్త శుద్ధి చక చకా జరిగేందుకు ఏ ఆహారాలు తీసుకోవాలి?