Food: మనిషి బతికేది జానెడు పొట్ట నింపుకోవడానికే అని పెద్దలు చెబుతుంటారు. అందుకే సమయానికి కాస్త తిండి (Food) తింటూ బతికినంత కాలం ఆనందంగా, రోగాల బారిన పడకుండా జాగ్రత్త పడాలని పెద్దలు చెబుతారు. మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేయాలి. జీర్ణ వ్యవస్థ పటిష్టత కోసం పలు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా ఆహారం తీసుకొనే విషయంలో కొన్ని నియమాలు పాటించడం ద్వారా జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
ఆహారం తినేటప్పుడు కూడా హడావుడిగా కాకుండా.. కాస్త నెమ్మదిగా తినాలని సూచిస్తున్నారు. నిలబడి కాకుండా కూర్చొని తినడం శ్రేయస్కరం. టీవీలు, సెల్‌ఫోన్లు చూస్తూనో, ఇతరులతో మాట్లాడుతూనో ఆహారం తినరాదని పెద్దలు చెబుతున్నారు. ఇలా తినడం వల్ల తిన్న ఆహారం ఒంటికి పట్టదట. తినే ఆహారంలోనూ సరైన పరిమాణం ఉండేలా చూసుకోవాలి. రుచిగా ఉందని పరిమితికి మించి లాగించేయరాదు.
జీర్ణ వ్యవస్థ మెరుగు కోసం ఆయుర్వేదంలో కొన్ని ఆహార పదార్థాలను పెద్దలు సూచిస్తున్నారు. మనకు బాగా ఆకలేసినప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. ఆకలి లేకపోయినా ఏదో ఒకటి నోట్లో వేసుకుంటూ నోటికి పని చెప్పరాదని స్పష్టం చేస్తున్నారు. ఆకలేసినప్పుడే తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై భారం పడకుండా ఉంటుందని చెబుతున్నారు. అలా కాకుండా ఖాళీ సమయం దొరికిందని ఏదో ఒకటి లాగించేయడం వల్ల జీర్ణ వ్యవస్థకు ఇబ్బందులు ఏర్పడతాయని చెబుతున్నారు.
వీలైనంత వరకు వేడిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. మూడు పూటలకు సరిపడా వండుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినే అలవాటు మానుకోవాలి. ఇలా నిల్వ ఉంచిన పదార్థాలు తింటే జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. తీసుకొనే ఆహారంలో తగినంత పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఇవి జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. అలాగే పోషక శోషణను మెరుగుపరుస్తాయి. కాబట్టి పొడిగా ఉండే ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
జీర్ణ వ్యవస్థ గురించి…
జీర్ణ వ్యవస్థ అంటే ఆహారాన్ని జీర్ణం చేసే శరీర భాగం. ఇది ఫుడ్‌ను సాధారణ రసాయన పదార్థాలుగా విచ్ఛిన్నం చేయగలుగుతుంది. తద్వారా రసాయన పదార్థాల్లోని కొన్ని పోషకాలు రక్త ప్రవాహంలో కలిసిపోవడానికి వీలు కలుగుతుంది. రక్త ప్రవాహం నుంచి పోషకాలు మొదట కాలేయానికి చేరుతాయి. కాలేయం పోషకాలను అన్ని విధాలుగా సర్దుబాటు చేసుకుంటుంది. దీని ద్వారా శరీరానికి అవసరమైన బలం చేకూరుతుంది. కాలేయం విడుదల చేసే కొన్ని రసాయనాలు మనం తీసుకున్న ఫుడ్ జీర్ణక్రియకు కారణం అవుతాయి.
ఇక మానవుడి జీర్ణ వ్యవస్థలో నోరు, ఆస్యకుహరం, గ్రసని, అన్నవాహిక, జీర్ణాశయం, చిన్నపేగు, పెద్దపేగు, పురీష నాళం, పాయువు ముఖ్యమైన భాగాలుగా మనం సైన్స్‌లో చదువుకొని ఉంటాం. మనిషి జీర్ణ వ్యవస్థలో జీర్ణాశయాంతర పేగులతో పాటు జీర్ణక్రియ అనుబంధ అవయవాలు ఉంటాయి. అవే నాలుక, లాలాజల గ్రంథులు, క్లోమం, కాలేయం, పిత్తాశయం. ఇవి జీర్ణక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
ఇక మన జీర్ణవ్యవస్థ వ్యర్థ పదార్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణ వ్యవస్థ నోటి నుంచి మొదలై పాయువుతో కంప్లీట్ అవుతుంది. పురుగులు, క్షీరదాలు, పక్షులు, చేపలు, మానవులు వంటి జంతువులు/కీటకాలు… ఇలా సమర్త జీవరాశికి జీర్ణ వ్యవస్థ అనేది కచ్చితంగా ఉంటుంది. దీని ద్వారానే మనుగడ సాగించడం సులవుగా ఉంటుంది. ఇక జీర్ణాశయాంతర వ్యవస్థను ప్రభావితం చేసే అనేక రకాల వ్యాధులు కూడా ఉంటాయి. జీర్ణాశయ వ్యవస్థపై అధ్యయనం చేసే డాక్టర్లను గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు అని పిలుస్తాం.
Read Also : Eating Food: ఆహారం రోజుకు ఎన్నిసార్లు తినాలి?