Diabetes Curd: డయాబెటీస్ అనేది చాలా ఇబ్బందికర సమస్య. ఈ జబ్బుతో బాధపడేవారి కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయి. ముఖ్యంగా ఆహారం తీసుకొనే విషయంలో అనేక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సి వస్తుంది. నేటి కాలంలో మధుమేహం జబ్బు చాలా మందిని వేధిస్తోంది. ముఖ్యంగా డయాబెటిక్ సోకితే తీపి పదార్థాలు తీసుకోవడం పూర్తిగా మానేయాల్సి వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే నోరు కట్టేసుకోవాల్సిందే. అయితే, డయాబెటిస్ ఉన్న వారు పెరుగు (Diabetes Curd) తినొచ్చా అనే సందేహం చాలా మందిని వెంటాడుతుంటుంది.
డయాబెటిక్ ను అదుపులో ఉంచడానికి ప్రస్తుతం చాలా చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. మధుమేహం కంట్రోల్ లో ఉంచడానికి చాలా మంది సప్లిమెంట్స్ ను వాడుతున్నారు. ముఖ్యంగా డయాబెటిక్ రోగులు తీసుకొనే ఆహారం పూర్తిగా ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. తీపి పదార్థాలకు దూరంగా ఉండటం, వైద్యులు సూచించిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా డయాబెటిక్ ను కంట్రోల్ లో ఉంచడం సాధ్యమవుతుంది.
మధుమేహం లక్షణాలు చాలా ఉన్నాయి. తరచూ మూత్ర విసర్జన, గొంతు పొడిబారడం, దాహం వేయడం, చూపు తగ్గిపోవడం, హఠాత్తుగా బరువు పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఉన్నట్టుండి బలహీనంగా అయిపోవడం, నీరసించడం, ఆకలి అధికంగా వేస్తుండటం కూడా మధుమేహం లక్షణాలుగా చెబుతారు. వయసుతో పని లేకుండా చాలా మంది మధుమేహం బారిన పడుతుంటారు.
మధుమేహం ఉన్న రోగులు పెరుగు (Diabetes Curd) లక్షణంగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పెరుగు తీసుకోవడం ద్వారా వ్యాధిని నియంత్రణలో ఉంచవచ్చని సూచిస్తున్నారు. దీంతో పాటు ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు నారింజ కూడా రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే డయాబెటిస్ ను అదుపులో ఉంచవచ్చు. పండ్లు, సలాడ్స్ తీసుకుంటూ ఉండాలి. ఎలక్ట్రోలైట్స్, ఫైబర్ ను తీసుకోవడం ద్వారా డయాబెటిక్ లెవల్స్ ను అదుపులో ఉంచడం సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
పెరుగుతో ఆరోగ్య ప్రయోజనాలివే..
వేడిచేసిన పాలను బ్యాక్టీరియాతో పులియబెట్టడం చేత పెరుగు అనే పదార్థం తయారవుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. పాలను పెరుగుగా మార్చడంలో ఉపయోగపడే ఈ బ్యాక్టీరియా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఎన్నో రకాల అనారోగ్యాలను దరిచేరనీయకుండా చేస్తుంది. ఒక్క గ్రాము పెరుగులో సాధారణంగా 100 మిలియన్ల సంఖ్యలో లైవ్ బ్యాక్టీరియా ఉంటుందని నిపుణులు చెబుతారు. పైగా ఇది సహజ సిద్ధంగా తయారయ్యే ప్రోబయోటిక్ ఫుడ్ కూడా. దీంతో మీలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో పెరుగు కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. పెరుగులో ఉండే బ్యాక్టీరియా ఆహారం జీర్ణం అవడంలో సహాయపడి పేగులు ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడుతుంది.
ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం.. పెరుగులో ప్రోటీన్ 3.5 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 4.7 గ్రాములు, చక్కెర 4.7 గ్రాములు ఉంటాయి. ఇవేకాకుండా పెరుగు ద్వారా ఒంటికి విటమిన్ బి 12, కాల్షియం, ఫాస్పరస్, రైబోఫ్లేవిన్ కూడా ఎక్కువ మోతాదులో దొరుకుతాయి. ప్రస్తుతం ప్యాకెట్ల రూపంలో పెరుగు మార్కెట్లో అందుబాటులో ఉంటోంది. అయితే, ఇలా ప్యాకెట్ల రూపంలో ఉండే పెరుగును తినడం కంటే ఇంట్లో పాలు మరిగించి తోడు పెట్టుకున్న పెరుగులోనే ఎక్కవగా పోషకాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఇలా చేయాలని చెబుతున్నారు.
Read also : Coriander Water Benefits: ధనియాల నీళ్లు తాగితే దండిగా ఉపయోగాలు!