CM Jagan on Industries: విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సులో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోకస్ పెంచారు. ఎంఓయూల ప్రకారం కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకున్నారు సీఎం జగన్. ఇవాళ ఓ సంస్థను ప్రారంభించడంతో పాటు మరో మూడు కంపెనీల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం.. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. (CM Jagan on Industries)
క్రిబ్‌కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్ పుడ్ అండ్ బెవరేజెస్ పరిశ్రమలకు వర్చువల్‌గా శిలాఫలకం ఆవిష్కరించి, శంకుస్థాపన చేయడంతో పాటు గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో బయో ఇథనాల్ తయారీని క్రిబ్‌కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చేపడుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్.. క్రిబ్‌కో నిర్మాణ పనులకు శంకుస్థాపన గావించారు. ఈ ప్రాజెక్టుతో రూ.610 కోట్ల పెట్టుబడి, 1000 మందికి ఉద్యోగాలు సాకారమవుతాయి. రోజుకు 500 కిలోలీటర్ల బయో ఇథనాల్ తయారీ అవుతుంది. ఉప ఉత్పత్తిగా ఏడాదికి 64 వేల టన్నుల కార్బన్ డయాక్సైడ్, 4వేల టన్నుల డ్రైడ్ డిస్టిలరీ గ్రెయిన్స్ తయారవుతాయి.
దీంతోపాటు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ఇథనాల్ తయారీ కర్మాగారాన్ని విశ్వసముద్ర బయో ఎనర్జీ లిమిటెడ్ పెడుతోంది. ఇథనాల్ తయారీ కర్మాగార నిర్మాణ పనులకు ఈ సందర్భంగా సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. దీంతో రూ.315 కోట్ల పెట్టుబడులు, 500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. రోజుకు 200 కిలోలీటర్ల బయోఇథనాల్ తయారీ అవుతుంది. విరిగిన బియ్యం, రంగు మారిన బియ్యం, పాడైపోయిన బియ్యం నుంచి బయో ఇథనాల్ తయారుచేస్తారు. వరిని సాగుచేస్తున్న రైతులకు అత్యంత ఉపయోగకరంగా మారనుంది. అలాగే మొక్కజొన్నను వినియోగించుకుని రోజుకు మరో 160 కిలోలీటర్ల డిస్టలరీ తయారు కానుంది.
మరోవైపు తిరుపతి జిల్లా వరదాయిపాలెం కువ్వకొల్లి వద్ద కాంటినెంటిల్ కాఫీ లిమిటెడ్ పుడ్, బెవెరేజెస్ కంపెనీ స్థాపించనున్నారు. ఇందుకు సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.400 కోట్ల పెట్టుబడి, 400 మందికి ఉద్యోగాలు సాకారం కానున్నాయి. సంవత్సరానికి 16వేల టన్నుల సొల్యుబుల్ ఇన్‌స్టెంట్ కాఫీ తయారీ ప్లాంట్ రూపుదిద్దుకోనుంది.
ఇర ఏలూరు జిల్లా చింతలపూడిలో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ కంపెనీ సిద్ధం కానుంది. ఇందులో రూ.100 కోట్ల పెట్టుబడి, 500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. రోజూ 400 టన్నుల ఎడిబుల్ ఆయిల్ తయారవుతుంది. దీంతోపాటు రోజుకు 200 టన్నుల సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షన్ యూనిట్ వస్తోంది. దీన్ని సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “ఈ రోజు వండర్‌పుల్ మూమెంట్. దాదాపుగా రూ. 1425 కోట్ల పెట్టుబడితో 3 జిల్లాల్లో మంచి కార్యక్రమం జరుగుతుంది. దీనివల్ల దాదాపుగా 2500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ జిల్లాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మూడు ప్లాంట్లకు శంకుస్ధాపన చేయడంతో పాటు ఒక ప్లాంట్‌ను ప్రారంభిస్తున్నాను.
శంకుస్ధాపన చేసిన ప్లాంట్లన్నీ కూడా త్వరలో నిర్మాణం అవుతున్నాయి.” అన్నారు.
2,500 మందికి ఉద్యోగాలు…
“దాదాపుగా 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు, రూ.1425 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్ల ఏర్పాటు ద్వారా… గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో మనం చేసుకున్న ఎంఓయూలు కార్యరూపం దాల్చుతున్న మంచి ఘడియలు ఇవి. చాలా సంతోషకరమైన సందర్భమిది.” అని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. వర్చువల్ సమావేశం సందర్భంగా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కంపెనీల సహకారం ఇలాగే కొనసాగాలని, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
Read Also : YS Jagan Review: అటువైపు యుద్ధం మొదలైపోయింది… “వై ఏపీ నీడ్స్ జగన్”పై శ్రేణులను సన్నద్ధం చేస్తున్న సీఎం!