YS Jagan Review: అటువైపు యుద్ధం మొదలైపోయింది… “వై ఏపీ నీడ్స్‌ జగన్‌”పై శ్రేణులను సన్నద్ధం చేస్తున్న సీఎం!

YS Jagan Review: ప్రభుత్వంపై పనిగట్టుకొని చేస్తున్న దుష్ర్పచారాన్ని తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. అటువైపు యుద్ధం మొదలైపోయిందని, దుష్టచతుష్టయాన్ని సమర్థంగా ఎదుర్కొని దీటుగా బుద్ధి చెప్పాలని ఉద్బోధించారు జగన్‌. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గడపగడపకూ మన ప్రభుత్వం, జగనన్న సురక్ష కార్యక్రమాలపై వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్‌ మంత్రులు, రిజనల్‌ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా, ముఖ్య నేతలంతా హాజరయ్యారు. (YS Jagan Review)

ఈనెల 23వ తేదీన ప్రారంభించనున్న జగనన్న సురక్ష కార్యక్రమం, గడపగడపకూ మన ప్రభుత్వం, వై ఏపీ నీడ్స్‌ జగన్.. అనే కార్యక్రమాలపై ఓరియెంటేషన్‌ (YS Jagan Review) నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.

రాక్షసులతో, మారీచులతో యుద్ధం..

” నాలుగు సంవత్సరాల పరిపాలనలో మన ప్రభుత్వం గొప్పగా, దేశానికే ఆదర్శంగా నిలబడగలిగిన పనులు ఏం చేశాం అన్న విషయాలతో పాటు వాటికి సంబంధించిన ఆధారాలతో సహా అవగాహన కలిగించేలా ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ అనే కార్యక్రమం ద్వారా చేపట్టబోతున్నాం. మనం రాక్షసులతోనూ, మారీచులతోనూ యుద్దం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు అయితేనే మనపై జరుగుతున్న దుష్ప్రచారంపై కూడా తగినవిధంగా తిప్పికొట్టగలిగే పరిస్థితి ఉంటుంది. మనం చేస్తున్న మంచి ఏమిటన్నది ప్రతి మనిషి దగ్గరికి, ప్రతి కుటుంబం దగ్గరికి పదే, పదే తీసుకునిపోవాలి. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టగలిగే పరిస్థితిలోకి ప్రతి లబ్ధిదారుడు తయారు కావాలి. ఇది చాలాముఖ్యమైన అంశం.

175కు 175 గెలవాలి.. ఆ దిశగా అడుగులు వేయాలి..

వచ్చే ఎన్నికల్లో మనం 175 కు 175 నియోజకవర్గాలు గెలవాలి. ఆ దిశగా అడుగులు పడాలి. అదేం కష్టమైన పనికాదు. ఎందుకంటే రాష్ట్రంలో సగటున 87 శాతం గృహాలకు మంచి జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 92 శాతం గృహాలకు మంచి జరగ్గా… పట్టణ ప్రాంతాల్లో 84 శాతం మేలు జరిగింది. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి, ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి. అన్నిచోట్లా ఇదే పరిస్థితి ఉన్నప్పుడు, దేవుడి దయతో మన ప్రభుత్వం మంచి చేయగలిగింది అని ప్రతి ఇంటికి వెళ్లి మనం చెప్పగలిగినప్పుడు.. ఆ ఇంట్లో ప్రతి అక్కకూ, చెల్లెమ్మకు వాళ్ల మనసులో ఇది నిజమేకదా అన్న భావనను తీసుకురావాలి. ఆ భావనే వాళ్ల ఆశీస్సులుగా మారి ఆ ప్రతి ఇళ్లు మనకు ఓటు వేస్తుంది. అది జరిగితే ప్రతి గ్రామం మనకు ఓటు వేస్తుంది. ప్రతి నియోజకవర్గం ఆటోమేటిక్‌గా ఓటు వేసే పరిస్థితి వస్తుంది. ప్రతి ఊరులోనూ ఇంత మంచి జరిగినప్పుడు, ప్రతి ఇంటికి ఈ మంచి జరుగుతున్నప్పుడు మనం కొంచెం కష్టపడి ప్రతి ఇంట్లో ఉన్న అక్కనూ, చెల్లెమ్మనూ కలిసి వాళ్ల ఆశీర్వాదం తీసుకోవాలి.

జగనన్న సురక్ష కార్యక్రమంలో మొత్తం సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, గృహసారథుల వ్యవస్థ ప్రతి ఇంటికీ వెళ్తుంది. ప్రతి ఇంటికీ వెళ్లి.. జల్లెడ పడుతోంది. పథకాల అమల్లో ఇంకా మిగిలిపోయిన వారు ఎవరైనా, ఎక్కడైనా కూడా ఉండకూడదన్న లక్ష్యంతో జల్లెడ పట్టే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఎక్కడైనా మిగిలిపోయిన వారు ఎవరైనా ఉంటే, అది కుటుంబంలో విభజన చేసి వారికి రేషన్‌ కార్డు అందించడంలాంటి వాటి నుంచి వివిధ రకాల సర్టిఫికెట్లు కూడా అక్కడికక్కడే ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఇంటికి వెళ్లి కాసేపు గడిపి, సర్టిఫికెట్స్‌ పరంగా, పథకాలు పరంగా సమస్య ఉంటే దాన్ని జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తాం.

జగనన్న సురక్షా కార్యక్రమంలో ప్రతి గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్న దాన్ని పరిష్కారించడానికి ఏకంగా 1.50 లక్షల మంది సచివాలయ సిబ్బంది, 2.60 లక్షల మంది వాలంటీర్‌ల వ్యవస్ధ, 3వేల మంది మండలస్దాయి సిబ్బంది, 26 మంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు, 7.5 లక్షల మంది గృహసారధులు, సచివాలయ కన్వీనర్లు, ప్రతి గ్రామంలోనూ ఒక రోజు కేటాయిస్తూ.. 15వేల క్యాంపులు, 30 రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇంత పెద్ద స్ధాయిలో ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ, ప్రతి సమస్యను పరిష్కరించాలన్న ధృక్పధంతో అడుగులు వేసిన పరిస్ధితి దేశ చరిత్రలో ఎక్కడా ఉండదు. ఈ రాష్ట్రంలో జరుగుతుంది.

జూలై 1 నుంచి క్యాంపులు..

జగనన్న సురక్షా కార్యక్రమం క్యాంపుల్లో దాదాపు11 రకాల సర్టిఫికెట్లు ఇస్తారు. కులం, ఆదాయం, జనన ధృవీకరణ, వివాహం, ఫ్యామిలీ మెంబర్, డెత్, బియ్యం కార్డులు, కుటుంబాల విభజన, సీసీఆర్సీ, మ్యుటేషన్లు, ఫోన్‌ నంబర్లకు ఆధార్‌ లింకేజి సర్టిఫికెట్లు ఇవన్నీ అందించే కార్యక్రమం జరుగుతుంది. మండలంలో ప్రతిరోజూ రెండు క్యాంపులు జరుగుతాయి. నియోజవర్గంలో ఎన్ని మండలాలుంటే అన్నింటా రెండేసి క్యాంపులు చొప్పున జరుగుతాయి. ప్రతి క్యాంపు దగ్గర ఎమ్మెల్యేలు కనిపించాలి. జగనన్న సురక్ష కార్యక్రమంపై ఈ నెల 23 నుంచి శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. జులై 1 నుంచి క్యాంపులు ప్రారంభం అవుతాయి.

గడపగడపకూ కార్యక్రమం అత్యంత కీలకం. ఇది చాలా ఉపయోగపడే కార్యక్రమం. ప్రజల్లో పనితీరు బాగుంటే.. ఎమ్మెల్యేలను కొనసాగిస్తాం. గ్రాఫ్‌ బాగోలేకపోతే ఎమ్మెల్యేలను కొనసాగించడం కుదరదు. ప్రతి ఒక్కరూ ఇది గుర్తుంచుకొండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే కొన్నికోట్ల మంది మనపై ఆధారపడి ఉన్నారు. కోట్ల మంది పేదవాళ్లకు మంచి జరుగుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలు పనితీరు బాగోలేకపోతే.. వాళ్లను అక్కడే కొనసాగించడం వల్ల వాళ్లకీ నష్టం, పార్టీకీ నష్టం.. కోట్లమంది పేదలకు నష్టం జరుగుతుంది.

మనం సర్వే చేసినప్పుడు మీమీ గ్రాఫ్‌లు బలంగా ఉండాలి. దీనికోసం గడపగడపకూ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ప్రజలకు చేరువుగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల మీ గ్రాఫ్‌ పెరుగుతుంది. పార్టీకీ మేలు జరుగుతుంది. అలా జరగకపోతే.. మార్చక తప్పని పరిస్థితి వస్తుంది. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ మనం గెలవాలి. 175 స్ధానాలకి 175 స్ధానాలు రావాలి. ఇంతకుముందుకన్నా.. బ్రహ్మాండమైన మెజార్టీలు మనకు రావాలి. అది మన లక్ష్యం. అందుకే గడపగడపకూ కార్యక్రమాన్ని మనం సీరియస్‌గా తీసుకోవాలి. గడప గడపకూ కార్యక్రమంలో పనులు కూడా మంజూరు చేస్తున్నాం… వాటిని పూర్తి చేయాలి.

9 నెలలు చాలా కీలకం..

ఈ రోజు నుంచి రాబోయే 9 నెలల్లో వేసే ప్రతి అడుగు చాలా కీలకం. గడపగడపకూ కార్యక్రమాన్ని అంతే సీరియస్‌గా తీసుకోవాలి. కచ్చితంగా గెలవాలి.. 175 కి 175 సీట్లు రావాలి. నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో గతంలో జరగని విధంగా మార్పులను తీసుకు వచ్చాం. దీన్ని వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ తెలియజేస్తాం.

తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి…

నెగెటివ్‌ మీడియాను అడ్డంగా పెట్టుకుని మారీచులు మాదిరిగా యుద్ధంచేస్తున్నారు. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారితో యుద్ధం చేస్తున్నాం. దానికి సరైన కౌంటర్‌ తయారు చేసి ప్రతి గడపకూ చేర్చాలి. గతంలో చంద్రబాబు ప్రభుత్వ పాలన, ఇవాళ మన ప్రభుత్వం జరిగిన కార్యక్రమాలుతో నాడు – నేడుతో కంటెంట్‌ తయారు చేసి ప్రజల దగ్గరకు చేర్చాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 ద్వారా వచ్చే నెగెటివ్‌ స్టోరీలపై నిజాలేంటో ప్రజలకు చెప్పాలి.

సోషల్‌ మీడియా చాలా ముఖ్యం…

ప్రభుత్వం చేస్తున్న మంచిని సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలి. సోషల్‌ మీడియాను విసృతంగా వాడుకోవాలి. అబద్ధాలు, విషప్రచారాలను పూర్తిస్థాయిలో తిప్పికొట్టాలి. రాబోయే రోజుల్లో మీమీద దుష్ప్రచారం అన్నది కొనసాగిస్తారు. సోషల్‌ మీడియాలో ఇంకా అబద్దాలు ఎక్కువగా సర్క్యులేట్‌ చేసే కార్యక్రమం చేస్తారు. ఇంత దారుణమైన ఎమ్మెల్యే ఎవ్వరూ లేరని వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు.
ప్రతి ఒక్కరిపైన వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. వీటిని కౌంటర్‌ చేస్తూ ముందుకు పోవాలి. గ్రామం స్ధాయి నుంచి మన సోషల్‌ మీడియా టీమ్‌లు తయారు చేసుకోవాలి. ఈ కౌంటర్‌ చేసే మెకానిజం కచ్చితంగా ఉండాలి. దీనికి సిద్దంగా ఉండాలి.” అని ముఖ్యమంత్రి చెప్పారు.

Read Also : Jagananna Animutyalu: బ్రైట్ మైండ్స్, షైనింగ్ స్టార్స్.. ఆణిముత్యాలకు సీఎం జగన్‌ సత్కారం

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles