Sirimanothsavam: ఉత్తరాంధ్రలో అత్యత వైభవంగా ఏటా సాగే శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఈసారి కూడా అత్యంత ఘనంగా జరిగింది. ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ఇలవేలుపుగా శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం పేరు గాంచింది. ఆలయ సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఉత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. (Sirimanothsavam)
ఎప్పటిలాగే పాలధార, అంజలి రథం, తెల్ల ఏనుగు, బెస్తవారి వల ముందు నడవగా, శ్రీ పైడితల్లి అమ్మవారు మూడుసార్లు విజయనగరం పురవీధుల్లో సిరిమాను రూపంలో ఊరేగి, భక్తులకు దర్శనమిచ్చారు. తన పుట్టినిల్లు విజయనగరం కోటవద్దకు వెళ్లి, రాజ కుటుంబాన్ని ఆశీర్వదించారు. ఈ అపూర్వ ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించిన భక్తులు పరవశించిపోయారు. మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో, కలిసికట్టుగా కృషి చేసి, ఉత్సవాలను విజయవంతం చేశారు.
ఉత్సవానికి అమ్మవారి సిరిమానును, ఇతర రథాలను ముందుగానే ఆలయం వద్దకు తీసుకురావడంతో, సాయంత్రం 4.37 నిమిషాలకు సిరిమాను రథోత్సవం ప్రారంభమైంది. తోపులాటలు జరగకుండా, ఉత్సవానికి అంతరాయం కలుగకుండా పటిష్టమైన బారికేడ్లను ఆర్అండ్‌బి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా, పలు చోట్ల తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. త్రాగునీటి సదుపాయం కల్పించారు.
వివిధ స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా త్రాగునీరు, ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు , జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి రథాన్ని సిద్ధం చేసి సిరిమానోత్సవం త్వరగా ప్రారంభించేందుకు కృషి చేయడమే కాకుండా ముందుండి సిరిమాను నడిపించారు. ఉత్సవం పూర్తి అయ్యేవరకు పర్యవేక్షించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ఉత్సవాన్ని ప్రశాంతంగా పూర్తిచేయడంలో పోలీసులు కీలక పాత్ర వహించారు. అత్యంత ఘనంగా జరిగిన అమ్మవారి సిరిమానోత్సవం సాయంత్రం 6 గంటలకు ముగిసింది.
Read Also : Hindu Dharmam: హిందూ మతానికి, హిందూ ధర్మానికి తేడా ఏంటి? హిందూ సనాతన ధర్మం ఏం చెబుతుంది?