Amaravati: రాజధాని అమరావతి (Amaravati) ప్రాంతం దద్దరిల్లింది. పేదల మొహాల్లో చిరునవ్వులే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) సీఆర్డీఏ ప్రాంతం పరిధిలో (Amaravati) 50,793 మంది పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతేనా.. సీఆర్డీయే ప్రాంతంలో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందించారు ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో జనసందోహం రావడంతో వెంకటపాలెం ప్రాంతమంతా కోలాహలంగా మారిపోయింది. ముఖ్యమంత్రి హోదాలో అమరావతి ప్రాంతంలో తొలిసారి జగన్ భారీ బహిరంగ సభ నిర్వహించడం, విజయవంతం కావడంతో అధికార పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది.
బహిరంగసభలో ప్రజలనుద్దేశించి మాట్లాడిన సీఎం జగన్.. రోహిణి కార్తెలో మండే ఎండలను సైతం లెక్కచేయకుండా మనసు నిండా మమకారంతో, చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు, ఆత్మీయతలు పంచిపెడుతున్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వాతాతకు, ప్రతి సోదరుడు, స్నేహితుడుకి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ తన ప్రసంగం ప్రారంభించారు. ఆయనేంమాట్లాడారంటే..
”ఈ రోజు ఈ సభకు, ఈ సందర్భానికి ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర చరిత్రలోనే కాకుండా, దేశ చరిత్రలోనే ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్ధలాలు ఇవ్వాలని, ఇళ్లు ఇవ్వాలని జరిగిన వందలు, వేల పోరాటాలను మనం చూశాం. 75 ఏళ్ల స్వతంత్య్ర భారత చరిత్రలో ఇటువంటి పోరాటాలు మనం చాలా చూశాం. కానీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్ధలాలు ఇస్తామని సుదీర్ఘ న్యాయపోరాటం చేసి, సుప్రీంకోర్టు దాకా వెళ్లిమరీ 50వేల కుటుంబాలకు ఇళ్లపట్టాలిస్తున్న ఈ పండుగ, ఈ చారిత్రాక ఘట్టాన్ని ఈ రోజు అమరావతిలో చూస్తున్నాం.
ఇళ్లపట్టాలివ్వాలని ప్రభుత్వం తాపత్రయపడుతుంటే.. దాన్ని అడ్డుకునేందుకు మారీచులు, రాక్షసులు ఏకంగా సుప్రీం కోర్టు దాకా తీసుకెళ్లి ఇవ్వకూడదని ఆరాటపడుతున్న పరిస్థితులు ఒకవైపు, కాదు కచ్చితంగా పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలని ఆరాటపడుతున్న ప్రభుత్వ తాపత్రయం ఇటువైపు. బహుశా ఇటువంటి ఘటన ఎక్కడా జరిగి ఉండదు. ఈ రోజు 50,793 మంది అక్కచెల్లెమ్మలకు వాళ్ల పేరుమీద ఇళ్ల స్ధలాలు రిజిష్ట్రేషన్ చేసి ఇస్తున్న గొప్ప సందర్భం. నా అక్కచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు చూసే ఇంత మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి రుణపడి ఉంటాను.
ఇక్కడికి వచ్చినప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణ, మంత్రి సురేష్‌ను.. ఈ ప్రాంతంలో గజం రేటు ఉజ్జాయింపుగా ఎంత ఉంటుందని అడిగాను. ఈ మధ్య కాలంలో వేలం జరిగింది. అందులో గజం రేటు రూ.17వేలకు అమ్ముడుపోయింది. కనీసం రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్యలో గజం ధర ఉంటుంది. అంటే రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు విలువ చేసే ఇంటి స్థలం నా పేద అక్కచెల్లెమ్మల పేర్లమీద రిజిస్ట్రేషన్ జరగబోతుంది. పేద అక్కచెల్లెమ్మలకు ఇస్తున్న ఇళ్ల స్థలాల పత్రాలు వారికిస్తున్న హక్కులు కావు. వారికిస్తున్న సామాజిక న్యాయపత్రాలు కూడా.
ఇదే అమరావతి ఇక మీదట ఒక సామాజిక అమరావతి అవుతుంది. ఇకపై మనందరి అమరావతి అవుతుంది. మనదైన మంగళిగిరి, తాడికొండ నియోజకవర్గాల పరిధిలో 1400 ఎకరాల్లో 50,793 మంది నా పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లస్ధలాలు అందజేసే కార్యక్రమం 25 లేఅవుట్లలో జరుగుతుంది.
మరో వారం రోజుల పాటు ఈ పండగ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి లేఅవుట్‌దగ్గరకి వెళ్లి, ప్రతి అక్కచెల్లెమ్మను అక్కడకు తీసుకెళ్లి, ఇళ్లపత్రాలు ఇచ్చి, ఆ ఇంటి స్ధలంలో ఫోటో తీసుకుని, జియో ట్యాగింగ్ కూడా పూర్తి చేసిన తర్వాత ఇళ్లు కట్టించే కార్యక్రమానికి కూడా బీజం పడుతుంది.
ఈ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించడంతో పాటు… జూలై 8వ తేదీన అంటే నాన్నగారి జయంతి రోజున ఇళ్లు కూడా మంజూరు చేసి కట్టించే కార్యక్రమం మొదలుపెడతాం. ఇప్పటికే ల్యాండ్ లెవలింగ్ పూర్తి చేసి, ప్లాట్లలో సరిహద్దు రాళ్లు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 232 కిలోమీటర్ల మేర అంతర్గత గ్రావెల్ రోడ్ల నిర్మాణం కూడా దాదాపు పూర్తయింది. నా అక్కచెల్లెమ్మల పేరుమీద ఈ ఇళ్లపట్టాలన్నీ ఇస్తాం. వారం రోజుల్లో ఇది పూర్తవుతుంది.
అక్కచెల్లెమ్మలకు ఇళ్ల నిర్మాణంపై మూడు ఆప్షన్లు ఇస్తాం. మొదటి ఆప్షన్ సొంతంగా తామే కట్టుకుంటామంటే.. ఆ పనుల పురోగతి మేరకు అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోకి రూ.1.8 లక్షలు బ్యాంకుల ఖాతాల్లో వేస్తాం. రెండో ఆప్షన్‌గా వారి ఇంటి నిర్మాణ పనుల కోసం వారికి కావాల్సిన సిమెంటు, ఇసుక, స్టీల్ లాంటి నిర్మాణ సామగ్రి అందిస్తాం.
నిర్మాణకూలి మొత్తాన్ని పనుల పురోగతిమేరకు వారి ఖాతాల్లోకి నేరుగా జమచేస్తాం. ఇవన్నీ మేం చేసుకోలేం అన్నవాళ్లకి మూడో ఆప్షన్ కూడా ఇస్తున్నాం. ఆప్షన్ –3గా ప్రభుత్వమే కట్టించాలని అడిగితే.. చిరునవ్వుతో స్వీకరించి.. ఆ ఇళ్లను ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది.
సెంటు భూమి కూడా ఇవ్వని చంద్రబాబు..
చంద్రబాబు తన పాలనలో ఏ ఒక్కపేదవాడికి కూడా కనీసం ఒక్క సెంటు భూమి, కనీసం ఒక ఇళ్ల పట్టా ఇచ్చిన పాపానపోలేదు. ఇదే చంద్రబాబు 2014 ఎన్నికల్లో 600 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి, రైతులను, అక్కచెల్లెమ్మలను, నిరుద్యోగులతో సహా అందర్నీ మోసం చేశాడు. ఇలాంటి చంద్రబాబు గురించి ఎందుకు చెప్తున్నానంటే.. ఎన్నికలకు దగ్గరపడే కొద్దీ.. మళ్లీ ఒక మేనిఫెస్టో అంటాడు. నా ఎస్సీ, ఎస్టీ, ఎస్సీలు, బీసీలు మైనార్టీలంటూ మోసపూరిత ప్రేమ చూపిస్తాడు.
సామాజిక వర్గాల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో అని అంటాడు. నరకాసురుడినైనా నమ్మండి – నారా బాబుని మాత్రం నమ్మకండి. 2014 –2019 వరకూ ఒక ఇళ్లపట్టా, సెంటు భూమి కూడా చంద్రబాబు హయాంలో ఇవ్వలేదు. రాబోయే రోజుల్లో మరింత మంచి చేసే అవకాశం కల్పించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా..” అని ముఖ్యమంత్రి జగన్ తన స్పీచ్‌ను ముగించారు.
Read Also : AP Jobs: గ్రూప్-1, 2 ఉద్యోగార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్!