Tirumala Samacharam 28-07-2023: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కాస్త పెరిగింది. ఇటీవల మూడు రోజులపాటు కాస్త తగ్గిన భక్తుల తాకిడి.. కాస్త ఊపందుకుంది. తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ కొనసాగుతోంది. 23 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.13 కోట్లు చేకూరింది. 63,932 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 25,862 మంది భక్తులు శ్రీవారి తలనీలాలు సమర్పించారు. (Tirumala Samacharam 28-07-2023)
Read Also : AP High Court CJ: నేడు హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం
తిరుమలలో మొబైల్ కంటైనర్లు..
తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ అధికంగా ఉన్న సందర్భాల్లో తాత్కాలికంగా బస ఏర్పాటుకు అనుగుణంగా రెండు మొబైల్ కంటైనర్లను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. విశాఖపట్నానికి చెందిన ఓ భక్తుడు వీటిని విరాళంగా అందించారు. వీటిని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రారంభించారు. తిరుమలలో భక్తుల తాకిడి అధికంగా ఉన్న సందర్భాల్లో గదుల కేటాయింపు కష్టతరంగా మారుతున్న సంగతి తెలిసిందే. పర్యావరణాన్ని దెబ్బతీసే నిర్మాణాలకు స్వస్తి పలకాలని టీటీడీ నిర్ణయించిందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
ఓ దాత రూ.23 లక్షల విలువైన 2 మొబైల్ కంటైనర్లను టీటీడీకి విరాళంగా అందించారని తెలిపారు. వీటిలో భక్తులు బస చేసేందుకు పడకలు, స్నానపు గది, మరుగుదొడ్లు ఉన్నాయని వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చిన సందర్భాల్లో వీటిని వినియోగిస్తామని తెలిపారు. రెండు కంటైనర్లలో ఒకటి జీఎన్సీ సమీపంలోని టీటీడీ ట్రాన్స్‌పోర్టు డిపోలో ఏర్పాటు చేశారు. మరో కంటైనర్‌ను ఆలయానికి సమీపాన రాంభగీచ-3 వద్ద ఉంచారు.