Tirumala que: కలియుగ వైకుంఠ నాథుని దర్శనానికి భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. నిత్యకళ్యాణ గోవిందుడి దర్శనానికి ఎక్కడెక్కడి నుంచో జనం తండోపతండాలుగా చేరుకుంటున్నారు. హరిగోవిందుడి దర్శనం కోసం గంటల తరబడి క్యూల్లో వేచి ఉంటున్నారు. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల కొండ జనంతో కక్కిరిసిపోయింది. నడకదారిలోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. (Tirumala que)
కంపార్టుమెంట్లు నిండి క్యూలైన్లు వెలుపలకు వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.83 కోట్లు వచ్చింది. నిన్న శ్రీవారిని 67,300 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,802 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. సర్వదర్శనానికి చాలా సమయం పడుతుండడంతో పిల్లలను తీసుకొచ్చిన తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. నడక దారిలో వచ్చినా దాదాపు అదే సమయం పడుతోందంటున్నారు.
మరోవైపు ఈనెల 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తిరుమలలో ఈనెల 16న వీఐపీ సిఫారసు లేఖలు అనుమతించబోమని టీటీడీ తెలిపింది. 17వ తేదీన శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోజు ప్రముఖుల బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీడీపీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం వేడుకగా జరగనుంది. సాధారణంగా ఏటా సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు వచ్చిందని పురోహితులు చెబుతున్నారు.
Read Also : Om Namo Venkatesaya: శ్రీ వేంకటేశ్వర స్వామికి శిలా రూపం ఎలా వచ్చిందంటే..
పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుంచి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవని పెద్దలు చెబుతున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్ నెలలకు మార్చిన సంగతి తెలిసిందే.
ఆణివార ఆస్థానం ఉత్సవం రోజు ఉదయం బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు గావిస్తారు.
ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనందనిలయంలోని మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదన చేస్తారు. పెద్ద జీయ్యర్ స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపుగా వస్తారు. వీటిలో నాలుగింటిని మూలమూర్తికి అలంకరణ గావిస్తారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనుడికి అలంకరణ చేస్తారు.
Read Also : Sri Venkateswara: కలియుగ వైకుంఠ నాథునికి ఎన్ని కోట్ల ఆస్తులంటే..