Om Namo Venkatesaya: కలియుగ ప్రత్యక్ష దైవం, శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం ప్రతి రోజూ లక్షలాది మంది వెళ్తుంటారు. ఆపసోపాలకోర్చి ఆపద మొక్కుల వాడిని దర్శించుకొనేందుకు పిల్లపాపలతో, ముసలిముతకలతో, యువత, మహిళలు.. ఒక్కరేమిటి.. అందరి తాపత్రయం ఒక్కటే.. కలియుగ వైకుంఠనాథుడిని దర్శించుకోవాలి. కడగండ్లు, ఇక్కట్లు ఆయనతో చెప్పుకొని ప్రణమిల్లాలి. కలి ప్రభావంతో ఆర్థిక కష్టాలు, సంసార ఈతి బాధలతో సతమతం అయ్యే ఎందరో శ్రీనివాసుడి కృపతో ఆనందమయ జీవితం గడపాలని పరితపిస్తుంటారు. ఎంత దూరమైనా ప్రయాణం చేసి, ఎంత సమయమైనా వేచి ఉండి శ్రీవారిని దర్శించుకొని మనసునిండా సంతోషంతో తిరుగు ప్రయాణం అవుతుంటారు భక్తులు. (Om Namo Venkatesaya)
పురాణ కథల ప్రకారం ఇప్పుడు స్వామి వారి గురించి ఓ విషయం తెలుసుకుందాం. శ్రీవేంకటేశ్వర స్వామి వారికి శిలా రూపం ఎలా వచ్చిందని చాలా మందికి సందేహం కలుగుతుంటుంది. దీనికి ఓ చిన్న కథ ఉంది..
”ఒకానొక సమయాన స్వామివారు స్వయంగా మాట్లాడుతుండేవారట. అవును, శ్రీవేంకటేశ్వరస్వామి మాట్లాడేవారట. శ్రీవారు శిలారూపంగా మారిన తర్వాత కూడా మహాభక్తులైన వారితో సంభాషించేవారట. అన్నమయ్య, హథీరామ్ లాంటి భక్తులతో ఏకంగా వచ్చి ప్రత్యక్ష పాచికలాడేవారని కూడా పురాణాలు చెబుతున్నాయి. వాళ్లు ఆయనతో అనునిత్యం మాట్లాడేవారట. ఒకానొకప్పుడు ‘తొండమాను_చక్రవర్తి’ చేసిన పనికి ఆగ్రహించిన శ్రీవారు మాట్లాడటం మానేశారని చెబుతున్నారు.
పూర్వం “కూర్ముడు” అనే బ్రాహ్మణుడు కాశీకి పోతూ, తాను తిరిగి వచ్చే వరకూ తన భార్యాపిల్లలను కాపాడమని తొండమాను రాజుకు అప్పచెప్పాడట. ఆ రాజు వారికి ఒక భవనంలో సకల సౌకర్యాలు కలుగచేసి, భద్రత కోసం తాళం వేసి ఉంచాడట. తర్వాత ఆ విషయం మరిచిపోయాడట. ఆ భవనంలోనివారు కొన్ని రోజుల తర్వాత ఆహారం చాలక లోపలే మృత్యు ఒడికి చేరారు. ఒక సంవత్సరం తర్వాత బ్రాహ్మణుడు కాశీ నుంచి తిరిగి వచ్చాడు. ఆ విషయమే మరచిన తొండమానుడు.. భవనంలో చనిపోయిన వారిని చూసి భయపడ్డాడు. వేంకటాచలానికి పరుగెత్తి వెళ్లి శ్రీనివాసుని పాదాలపై పడి శరణు కోరాడు.
ఆ సమయంలో శ్రీవేంకటేశ్వరుడు “నీకు బ్రహ్మహత్యాపాపం చుట్టుకుంది. కానీ నీకు అభయం ఇచ్చినందువల్ల నిన్ను రక్షిస్తాను. అందుకు ప్రతిఫలంగా ఇకముందు ఎవరికి ప్రత్యక్షంగా కనిపించను. ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను” అంటూ శపథం చేసి, ఆ బ్రాహ్మణుడి కుటుంబాన్ని బతికించాడట శ్రీవారు.
అప్పుడు బ్రహ్మాదిదేవతలు “బలహీనులు, అల్పాయుష్కులైన మానవులను ఉద్దరించడానికై కలియుగాంతం వరకూ ఈ వేంకటాచలంపై ఉండవలసిందిగా వేడుకున్నారు. దీంతో శ్రీనివాసుడు “దివ్యమూర్తిగా దర్శనమిస్తాను కానీ.. ఎవరితోనూ మాట్లాడను. అందరి కోరికలూ తీరుస్తాను” అంటూ “కన్యామాసం, శ్రవణానక్షత్రం” రోజున దివ్యమైన సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించారట శ్రీవారు. తొండమానుడు ఆలయగోపురాలు నిర్మించాడట.
బ్రహ్మదేవుడు రెండు అఖండ దీపాలు వెలిగించి, ఇవి కలియుగాంతం వరకూ వెలుగుతూంటాయని తెలిపాడు. అనంతరం పదిరోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడట. అవే తర్వాత కాలంలో బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధం చెందాయని పండితులు చెబుతున్నారు. అందుకే “భగవంతుడి నామాన్నినిత్యం జపిద్దాం.. భగవంతుడిని మనసుతోనైనా చేరుకుందాం… అని భక్తులకు పండితులు హితబోధ చేస్తుంటారు.
- కలౌ వేంకటనాయక.. కలియుగంలో పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవం నారాయణుడు.. స్వామి అనుగ్రహం అందరికి ఉండాలని కోరుకుంటూ.. ఈ కథనంలో ఏవైనా తప్పులు దొర్లిన పక్షంలో శ్రీనివాసుడు మన్నించి కటాక్షించాలని వేడుకుంటున్నాం.
Read Also : Sri Venkateswara: కలియుగ వైకుంఠ నాథునికి ఎన్ని కోట్ల ఆస్తులంటే..