Skoch Award: వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన జగన్ సర్కార్.. అన్నదాతలను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో చేస్తున్న కృషికి కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు అందించింది. ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో రైతులకు మేలు చేకూరుస్తోంది. వ్యవసాయంలో ఈ-క్రాప్ విధానం పారదర్శకంగా అమలు చేస్తున్నందుకు గానూ కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో 2023 స్కోచ్ అవార్డును అందజేసింది. (Skoch Award)
ఈ అవార్డును శనివారం 18/11/2023న ఢిల్లీలో అందుకోనున్నట్లు వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ చేకూరు హరికిరణ్ వెల్లడించారు. సాంకేతికతను వినియోగించి ప్రజలకు మరింత దగ్గరగా సేవ చేస్తున్న వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలను జాతీయ స్థాయిలో గుర్తించి, వారికి ఈ స్కోచ్ అవార్డ్ ఏటా కేంద్రం అందజేస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ డిజిటల్ ఆండ్రాయిడ్ సాంకేతిక ఈ క్రాప్ విధానం ద్వారా వాస్తవ సాగు రైతులను గుర్తిస్తోంది. పంట వివరములను నమోదు చేయటం, జియో కోఆర్డినేట్స్ ఉపయోగించి కచ్చితమైన సమాచారాన్ని గుర్తిస్తోంది.
పంటసాగు నమోదును క్షేత్ర స్థాయిలో రైతుల భూమి, పంటసాగు వివరములను గ్రామ రెవెన్యూ, గ్రామ వ్యవసాయ సహాయకుడు నమోదు చేసి, ఆ సమాచారం సరి అయినదే అని వేలిముద్రల ద్వారా ధృవీకరిస్తారు. తదుపరి వాస్తవ సాగు రైతు ఈ క్రాప్ లో నమోదయిన సమాచారం వాస్తవం, సరైనదే అని వేలిముద్రల ద్వారా లేదా OTP ద్వారా అంగీకరిస్తూ తన సమ్మతిని తెలుపుతూ ధృవీకరించడం అనే అంశం ఈ విధానంలో అత్యంత పారదర్శకంగా నిలుస్తోంది.
నమోదు చేసిన సమాచారాన్ని ఆమోదం కోసం ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ, సాగునీటి సలహా మండళ్లు, రైతులతో గ్రామసభను నిర్వహించటం, సామాజిక తనిఖీ నిమిత్తం ఆ ఈ క్రాప్ ముసాయిదా డేటా సమాచారాన్ని నోటీస్ బోర్డుల్లో బహిరంగ ప్రదర్శన చేస్తారు. సామాజిక తనిఖీ నిర్ణీత సమయంలోపు వచ్చిన విజ్ఞప్తులు, మార్పులు, చేర్పులు, తొలగింపులు అనే కూర్పునకు సంబంధించి మార్పులు అయిన తర్వాత ఫైనల్ జాబితాను ప్రదర్శిస్తారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో నూటికి నూరు శాతం పంటల సాగు వివరాలను ఈ క్రాప్ విధానంలో నమోదు చేయటం వల్ల ఈ డేటా సమాచారం వివిధ రైతు సంక్షేమ పథకాలు అయిన Dr. వైఎస్సార్ ఉచిత పంటల భీమా పథకం, Dr వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్ట పరిహార పెట్టుబడి రాయితీ, పంట కోసిన తరువాత పంట ఉత్పత్తిని కనీస మద్దతు ధరకు వివిధ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రైతు సాగు సంబంధించిన డేటాను బదలాయించటానికి, అనుసంధానం చేయటానికి ఈ క్రాప్ పంట సాగు డేటా సమాచారం ఒక కేంద్రీకృత సమాచార ప్లాట్ ఫాంగా దోహదపడుతోంది.
Read Also:Skill Development Scam Update: స్కిల్ స్కాంలో కీలక మలుపు.. అప్రూవర్‌గా మారనున్న కీలక నిందితుడు!