Pawan Kalyan: రాజకీయ పార్టీని నడపడం చాలా కష్టసాధ్యమైన పని అని జనసేన (Janasena Party) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. వారాహి యాత్రలో (Varahi Yatra) భాగంగా ఆయన తూర్పు గోదావరి జిల్లా మలికిపురం బహిరంగ సభలో ప్రసంగించారు. వేల కోట్లు ఉన్న వాళ్లు కూడా పార్టీని నడపాలంటే భయపడతారని, ధైర్యవంతులైన 150 మందితో జనసేన ప్రస్థానం మొదలైందన్నారు. జవాబుదారీతనంతో కూడిన రాజకీయాలు చేయటం తన బాధ్యత అని పవన్ స్పష్టం చేశారు. తమ ఓటుతో గెలిచి వేరొక పార్టీలోకి పోతే ప్రజలు సహించరని ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను ఉద్దేశించి కౌంటర్ వేశారు పవన్.
కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు రాలేదు..
కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు తాను రాలేదని, అన్ని కులాలను కలిపేందుకు వచ్చానని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. విశ్వనరుడు అనే సిద్ధాంతంతో రాజకీయాల్లోకి వచ్చానన్న ఆయన.. మొదట భారతీయుడిని, చివరిగా భారతీయుడిని అని చెప్పిన అంబేద్కర్ తరకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. జనసేన తరఫున ప్రతి నియోజకవర్గంలో పోటీకి నలుగురు ముందుకు వస్తున్నారని చెప్పారు. తన ఎదురుగా ఉన్నవాళ్లంతా ప్రేమతో వచ్చినవాళ్లేనని, డబ్బు కోసం వచ్చినవాళ్లు కాదని తెలిపారు. గోదావరి వలే తాను కూడా ఈ నేలను అంటిపెట్టుకుని ఉన్నానని చెప్పారు.
పొట్టి శ్రీరాములు 56 రోజులు నిరాహారదీక్ష చేసి ఆంధ్రరాష్ట్రం సాధించారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. బటన్ నొక్కితే డబ్బులు అందరికీ వస్తున్నాయా? అని ప్రశ్నించిన పవన్.. అనేక వస్తువుల మీద జీఎస్టీ చెల్లించి మనమే ప్రభుత్వ ఖజానా నింపుతున్నామన్నారు. 2019లో ఓడిపోయినప్పుడు సర్వం కోల్పోయినట్లు అనిపించిందని, ఒక ఆశయం కోసం పోరాడుతున్నప్పుడు అన్నీ ఉంటాయని పవన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఖజానాలోని డబ్బును మళ్లీ అందరికీ న్యాయంగా పంచాలని పవన్ అభిప్రాయపడ్డారు. 100 మనది దగ్గర పన్నులు తీసుకుని 40 మంది వైసీపీ వాళ్లకే లబ్ది చేస్తే ఎలా ? అంటూ ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి పవన్ కామెంట్ చేశారు.
ఓటు చీలడం వల్ల ప్రజా వ్యతిరేకత ఉన్నవాళ్లు గెలుస్తున్నారన్న పవన్ కల్యాణ్.. 70 శాతం ప్రజలు వ్యతిరేకించిన వాళ్లు పదవిలోకి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని చెప్పుకొచ్చారు. రాజోలులో 15 రోజుల్లో రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తానే వచ్చి శ్రమదానంతో రోడ్డు వేస్తానని హెచ్చరించారు. ప్రజలకు సరైన రోడ్డు వేయకుంటే ఎన్ని బటన్లు నొక్కినా ఏం లాభం అని ప్రశ్నలు గుప్పించారు. క్రిమినల్, రౌడీ గ్యాంగ్స్ ను పులివెందులలోనే పెట్టుకోండంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నన్ను బెదిరిస్తున్నారు.. జగన్ అంటే ద్వేషం లేదు..
తనను ఎలా తిరుగుతావో చూస్తా అంటూ కొందరు హెచ్చరిస్తున్నారని పవన్ వాపోయారు. సీఎం అయ్యాక సర్వస్వం తానే అనుకుంటే తప్పు అంటూ సెటైర్లు వేశారు. తాను రౌడీలకు భయపడే వ్యక్తిని కాదు, విప్లవకారుడినంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ అంటే నాకు వ్యక్తిగత ద్వేషం లేదంటూనే… ఇప్పటివరకు విప్లవ పంథాతో ఉన్న రాజకీయ నాయకుడిని చూడలేదని, ఇప్పుడు చూస్తారంటూ కామెంట్ చేశారు. వైసీపీ అక్రమాలు చదివి చదివీ కళ్లజోడు వచ్చిందని పవన్ కల్యాణ్ జోక్ చేశారు. తన ఆఖరి క్షణం వరకు ప్రజల కోసమే కష్టపడతానని పవన్ చెప్పుకొచ్చారు.
విభజన సమయంలో మొదలైన తెలంగాణ నేతల తిట్లు ఇంకా ఆగలేదన్న పవన్.. రాజోలులో వెలిగించిన ఈ చిరు దీపం .. ఏదో ఒకరోజు ఏపీలో అఖండ జ్యోతిగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన ఫస్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్ అన్నారు. సెకండ్ ప్రయారిటీ రోడ్లు, రహదారులు అని, తర్వాత విద్య, వైద్యం, ఉపాధి అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేశారని ఆరోపించిన పవన్.. అనంతబాబు చేసిన తప్పు కాపు సామాజిక వర్గానికి సంబంధం లేదన్నారు. వ్యక్తి చేసిన తప్పుకు వ్యక్తికే శిక్ష పడాలని వ్యాఖ్యానించారు.
రాజోలులో గంజాయి బాగా అభివృద్ధి చెందిందని ఆరోపణలు చేశారు పవన్. మోదీకి వైసీపీ దౌర్జన్యాలపై చెప్పాలనిపించిందని, కానీ తనకు కంప్లైంట్ చేయడం చిరాకు అని చెప్పుకొచ్చారు. సొంత బాబాయిని చంపుకుని తమకు ఏం తెలియదంటే నమ్మాలా ? అని సెటైర్లు వేశారు. పాము తమ పిల్లలనే మింగినట్లు జగన్ సొంత వారినే మింగుతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన మీద ఒక్క రాయి పడినా నేనెంతో చూపిస్తానని చెప్పారు.
శ్రీవాణి ట్రస్ట్ లో అవినీతి లేదంటారు.. వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. మీ శ్వేతపత్రాన్నినేను నమ్మనంటూ పవన్ వ్యాఖ్యానించారు. హిందువుల నుంచి వచ్చిన డబ్బును అర్చక సమాజం వారికి ఇవ్వాలని కోరారు. శ్వేతపత్రం అని చెప్పి వైట్ పేపర్ చూపిస్తే తాము నమ్మేది లేదన్నారు. వైవీ సుబ్బారెడ్డికి శిక్ష పడేలా చేస్తామని పవన్ హెచ్చరించారు. దళితులకు మేనమామ అని చెప్పిన వ్యక్తి 23 నుంచి 24 పథకాలు తీసేశాడని పవన్ పేర్కొన్నారు. మరోవైపు టీడీపీ నేతల నోటి నుంచి కూడా ఇలాంటి విమర్శలే రావడం… సగటు పవన్ అభిమానిని ఆలోచించేలా చేస్తోందనే విశ్లేషణలు వస్తున్నాయి.
Read Also : Mudragada on Pawan: కాపుల కొట్లాటగా మారిన పవన్ టూర్.. ముద్రగడ లేఖతో మరింత రంజుగా రాజకీయం!