Mudragada on Pawan: కాపుల కొట్లాటగా మారిన పవన్‌ టూర్.. ముద్రగడ లేఖతో మరింత రంజుగా రాజకీయం!

Mudragada on Pawan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్రతో ఏపీలో రాజకీయం వేడెక్కింది. అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న పవన్ కల్యాణ్‌కు ఇప్పుడు కొత్త సవాల్‌ ఎదురవుతోంది. పవన్‌పై వైఎస్సార్‌సీపీ నేతల విమర్శలు కాస్తా కాపుల రగడగా మారిపోతోంది. జనసేనానికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాయడం కాక రేపింది. కాపుల పోలరైజేషన్‌ కోసం పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లు కీలకం కావడంతో ఇప్పటి నుంచే పార్టీలు ఈ దిశగా ఫోకస్‌ పెంచినట్లు స్పష్టమవుతోంది. వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం, జనసేన, కాపు ఉద్యమ నేతలు… ఇలా అందరూ ఒకరిపై మరొకరు విమర్శల జోరు పెంచారు. (Janasena Party) (Mudragada Padmanabham)

వైఎస్సార్‌సీపీ (YSRCP) ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై (Dwarampudi Chandrasekhar Reddy) విమర్శలతో మొదలైన ఈ రగడ.. ఇప్పుడు కాపుల కొట్లాటగా మారింది. అధికార పార్టీపై విరుచుకుపడుతున్న పవన్‌కు (Pawan Kalyan) ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. గతంలో ముద్రగడ పేరు ప్రస్తావించకుండా పవన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మనకు నచ్చిన ప్రభుత్వం వస్తే రిజర్వేషన్లు మరిచిపోతారా? అని అప్పట్లో పవన్‌ ప్రశ్నించారు. ఎప్పుడూ ఒకేలా ఉండాలని పేర్కొన్నారు. ద్వారంపూడి కుటుంబంపై పవన్‌ తాజాగా ధ్వజమెత్తడంతో మద్రగడ రియాక్ట్‌ అయ్యారు. ద్వారంపూడి కుటుంబం కాపు ఉద్యమానికి సహకరించిందని ముద్రగడ పేర్కొన్నారు.

వీధిరౌడీ భాష సబబేనా పవన్‌?

” కాపులకు సహకరించినవారి పై విమర్శలా? నేను ఎప్పుడూ ఓటమి ఎరగను. కాపు ఉద్యమంతో ఓటమికి దగ్గరయ్యా. నేను కులాన్ని వాడుకున్నానో లేదో ఇప్పటికైనా తెలుసుకో పవన్.. ఎమ్మెల్యేను తిట్టడానికి విలువైన సమయాన్ని వృధా చేయకండి పవన్.. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడటం, ప్రత్యేక రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ సమస్యలపై పోరాటం చేయాలని 2019లో నా వద్దకు వచ్చిన రాయబారులకు సలహాలిచ్చి పంపాను. సలహాలు అడిగారు కానీ గాలికి వదిలేశారు. పవన్‌కు నిజంగా రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉంటే నా సలహాలపై యుద్ధం చేయండి. పార్టీ పెట్టిన తర్వాత పది మంది ప్రేమించేలా చూసుకోవాలి కానీ, వీధి రౌడీ భాషలో మాట్లాడటం ఎంతవరకు న్యాయమంటారు పవన్?

ఉద్యమానికి సాయం చేసిన వారిపై ఈ తరహా వ్యాఖ్యలా?

పవన్ రాజకీయ యాత్ర ప్రారంభం నుంచి కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే తండ్రి, తాతది తప్పుడు మార్గాల్లో సంపాదన.. అనే మాట చాలా తప్పు. ద్వారంపూడి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. టీడీపీ, బీజేపీలతో కలిసి జనసేన పోటీచేస్తే పవన్ సీఎం ఎలా అవుతారు? ద్వారంపూడి కుటుంబంతో ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. 1984లో అప్పటి సీఎం ఎన్టీఆర్ మంత్రి పదవి ఇస్తే నేను తీసుకోకపోతే ద్వారంపూడి తాత కృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి కిర్లంపూడి వచ్చి మంత్రి పదవి తీసుకుని ప్రజలకు సహాయపడమని సలహా ఇచ్చిన కుటుంబం.. కాపు ఉద్యమాలకు సహాయం చేసిన వారిని విమర్శించడం తగదు.

పార్టీ అధినేతగా రౌడీ భాషలో మాట్లాడటం సరికాదు. తొక్క తీస్తా .. నార తీస్తా .. చెప్పుతో కొడతా లాంటి పదాలు వాడటం కరెక్ట్ కాదు. తరచూ ప్రసంగాల్లో అటువంటి భాష వల్ల ప్రయోజనం లేదు. ప్రజల కోసం ఉద్యమం చేస్తే కులాలకు అతీతంగా మద్దతు లభిస్తుంది” అంటూ పవన్‌ కల్యాణ్‌కు ముద్రగడ పద్మనాభం సంచలన లేఖ రాశారు.

తాను యువతను వాడుకొని భావోద్వేగాలు రెచ్చగొట్టలేదని పవన్‌కు ముద్రగడ చురకలంటించారు. ప్రభుత్వం మారినప్పుడల్లా తాను ఉద్యమాలు చేయలేదన్నారు. చంద్రబాబునాయుడి ద్వారా పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్ పునరుద్ధరిస్తానని పదే పదే చెప్పడం వల్ల రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి బాబు ద్వారా పవన్ కల్పించారన్నారు. జగ్గంపేట సభలో రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలోనిదని వైఎస్ జగన్ అన్నప్పుడు తాను ఇచ్చిన సమాధానం ఏంటో అడిగి తెలుసుకోవాలని పవన్‌కు సూచించారు. తన కంటే చాలా బలవంతుడైన పవన్.. తాను వదిలిన ఉద్యమాన్ని చేపట్టి యువతకు రిజర్వేషన్ ఎందుకు తీసుకురాలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తన సమాధానం తర్వాత కాపు సామాజిక వర్గానికి రూ.20 కోట్లు ఇస్తానన్నా వద్దన్నానని ముద్రగడ పేర్కొన్నారు. బీసీల నుంచి పిల్లి సుభాష్ ని , కాపుల నుంచి బొత్సను సీఎం చేయమని అడిగానన్నారు. తాను రూ. కోట్ల సూట్ కేసులకు అమ్ముడుపోవడానికి ఉద్యమం చేయలేదని స్పష్టం చేశారు ముద్రగడ.

మరోవైపు ముద్రగడపై జనసేన నేత పంతం నానాజీ ఫైర్‌ అయ్యారు. ద్వారంపూడి కుటుంబం ఎప్పుడు సాయం చేసిందని ప్రశ్నించారు. ముద్రగడ లేఖ చూస్తే నవ్వు వచ్చిందన్నారు. ముద్రగడ కాపు నాయకుడు కాదు.. కాపు కులద్రోహి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక ముద్రగడ లేఖ పై ఘాటుగా ప్రతిస్పందించిన జనసేన నేత కిరణ్ రాయల్.. వైఎస్సార్‌సీపీ నిధులతో సభలు పెట్టే ముద్రగడ లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు. కొడుక్కి ఎమ్మెల్యే టికెట్, తనకు ఎంపీ టికెట్ కోసం ముద్రగడ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ముద్రగడ లేఖపై జనసైనికుల సోషల్ మీడియా యుద్ధం..

ముద్రగడ లేఖపై జనసైనికులు (Janasainiks) సోషల్‌ మీడియాలో రచ్చ మొదలు పెట్టారు. ఓపేద కాపు యువకుడి ఆవేదన అంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ లేఖపై మీకు కోపం రావాలన్నా రెడ్డి గారి అనుమతి కావాలి కదండీ… అంటూ లేఖలో జనసైనికులు ఎద్దేవా చేశారు. కాపులను విలన్లుగా చూపించి మీపబ్బం గడుపుకున్నారని మండిపడ్డారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వనని జగన్ చెప్పినా మీరు ఆయనకు ఎందుకు మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు. కాపుల రిజర్వేషన్ అంశాన్ని జనసేన మేనిఫెస్టోలో పెట్టిన పవన్ మీకు శత్రువు ఎలా అయ్యారని ప్రశ్నించారు. కులాన్ని అడ్డుపెట్టుకుని మంత్రి పదవులు చేపట్టిన మీరు ఇప్పుడు కులంతో సంబంధం లేనట్లు మాట్లాడుతున్నారని అందులో పేర్కొన్నారు.

ముద్రగడపై హరిరామ జోగయ్య ఫైర్

ఎమ్మెల్యే ద్వారంపూడిపై పవన్ చేసిన ఆరోపణలను ఖండించాల్సిన అవసరం ముద్రగడకు లేదని హరిరామజోగయ్య (Chegondi Harirama Jogaiah) పేర్కొన్నారు. పత్తిపాడులో ముద్రగడకు గెలిచే సత్తా ఉందా? అని ప్రశ్నించిన ఆయన.. వైసీపీకి మేలు చేకూర్చేలా ముద్రగడ మాట్లాడుతున్నారన్నారు. కాపు కులంలో పుట్టినవారు ఎవరైనా పవన్‌ను విమర్శిస్తారా ? అని అడిగారు. అన్ని కులాలను కలుపుకుపోతున్న పవన్‌ను స్వాగతించాలని కామెంట్‌ చేశారు. పవన్‌పై విమర్శలు చేయకుండా ఉంటే బాగుంటుందంటూ ముద్రగడకు సూచించారు. ముద్రగడపై తనకున్న సదభిప్రాయం పోయిందని వ్యాఖ్యానించారు. పదవుల కోసం కాపు సామాజిక వర్గాన్ని జగన్ కు తాకట్టు పెట్టేందుకు సిద్దమయ్యారని మండిపడ్డారు. ముద్రగడ ఉద్యమం రాజకీయ లబ్ధికోసమే అని తేలిపోయిందన్నారు. కాపు ఉద్యమాన్ని గంగలో కలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్వారంపూడికి ముద్రగడ మద్దతివ్వడం సిగ్గుచేటన్నారు.

మరోవైపు ముద్రగడకు టీడీపీ నేత బుద్దా వెంకన్న బహిరంగ లేఖ రాశారు. కాపులకు జగన్ ప్రభుత్వం ఏమీ చేయకపోయినా మీరెందుకు ప్రశ్నించడం లేదన్నారు. చంద్రబాబును విమర్శిస్తే బీసీలుగా మేం ఊరుకోమన్నారు. ఇకపై మీరు రాసే ప్రతి లేఖకు బదులిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఇక అధికార పార్టీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు (MLA Kannababu) కూడా తాజా రాజకీయ పరిణామాలపై రియాక్ట్‌ అయ్యారు. ఫ్యాన్స్ కోసం పవన్ సినిమా డైలాగ్స్ చెబుతూ హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పవన్ సినిమాటిక్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. సీఎం అవుతానంటూ చెబుతున్న వ్యక్తి భాష సరిగా లేదన్నారు. నాలుగేళ్లుగా వైఎసార్సీపీ లో కాపు నేతలను పవన్ తిడుతూనే ఉన్నారన్నారు. రాజకీయ అవసరాల కోసం మాట్లాడే వ్యక్తుల గురించి మేం స్పందించాలా ? అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే మన లక్ష్యమని సీఎం తమకు చెప్పారన్నారు. పవన్ ద్వారంపూడిని టార్గెట్ చేస్తూ మాట్లాడారన్నారు. ద్వారంపూడి విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ జీవితం ఆరంభించారని గుర్తు చేశారు.

పవన్ ఆధారాలతో మాట్లాడితే బావుంటుందని కన్నబాబు అన్నారు. ద్వారంపూడి చేసిన సవాల్ కు పవన్ స్పందించాలన్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే .. అయితే వ్యక్తిగత దూషణలు సరికాదన్నారు. అవినీతికి తావులేకుండా పరిపాలన చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని స్పష్టం చేశారు. పవన్ నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నారని, ఒక అబద్దాన్ని పదేపదే చెబితే ప్రజలు నిజమని నమ్మేస్తారా ? అని కన్నబాబు ప్రశ్నించారు. ఇలా కాపు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Read Also: Pawan VS Dwarampudi: రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్తా.. తుక్కు తుక్కుగా ఓడిస్తా.. పవన్‌ వర్సెస్‌ ద్వారంపూడి!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles