YSR Rythu Dinotsavam: రైతును మోసం చేయకూడదనే నిబద్ధత, నైతికత కలిగిన వ్యక్తి వైఎస్సార్‌.. రైతు దినోత్సవంలో సీఎం జగన్‌

YSR Rythu Dinotsavam: రైతును మోసం చేయకూడదనే నిబద్ధత, నైతికత కలిగిన నాయకుడిని డాక్టర్‌ వైఎస్సార్‌ అంటారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని (YSR Rythu Dinotsavam) నిర్వహించారు. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి కార్యక్రమం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం జగన్ హాజరయ్యారు. 2022 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతాంగానికి బీమా పరిహారం విడుదల చేశారు. అగ్రి టెస్టింగ్‌ ల్యాబులు ప్రారంభించారు. అనంతరం భారీ బహిరంగ సభలో మాట్లాడిన సీఎం జగన్‌.. తమ ప్రభుత్వం రైతన్నలకు చేస్తున్న మేలును వివరించారు. ప్రతిపక్షాన్ని, దుష్ట చతుష్టయాన్ని దునుమాడుతూ జగన్‌ ప్రసంగం సాగింది. (YSR Rythu Dinotsavam)

దేవుడి దయతో ఈరోజు వాతావరణం కూడా చల్లగా ఉందంటూ జగన్‌ ప్రసంగం మొదలు పెట్టారు. తెలుగు వారి గుండెల్లో, తెలుగు రైతుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే ఓ మంచి వ్యక్తి ఓ మహా మనిషి పుట్టిన రోజు ఈరోజు అని తెలిపారు. డాక్టర్‌ వైఎస్సార్‌గారి జయంతి, నాన్నగారి జయంతి అన్నారు. ఏటా రైతు దినోత్సవంగా అన్నదాతకు పాదాభివందనం చేస్తూ జరుపుకుంటున్నామని జగన్‌ చెప్పారు. ఈరోజు నాన్నగారు గుర్తొచ్చినప్పుడల్లా రైతన్నలకు తాను ఏరకంగా రైతుల పట్ల స్పందించాడన్నది గుర్తొస్తుందన్నారు. ఉచిత విద్యుత్‌, జలయజ్ఞం, రైతు పేద కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ ఆయన తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకం గుర్తొస్తుందన్నారు. 104, 108, కుయ్‌ కుయ్‌ కుయ్‌ అంటూ… ఆ సౌండ్‌ కూడా గుర్తొస్తుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, లక్షల్లో ఆయన కట్టిన ఇళ్లు గుర్తొస్తాయని జ్ఞాపకం చేసుకున్నారు సీఎం జగన్‌.

ఏ పథకం చూసినా ఆయన గుర్తొస్తారు..

ఏ పథకం చూసినా కూడా ఒక మంచి పేరు దివంగత నేత, రాజశేఖరరెడ్డి గారు, నాన్నగారు గుర్తొస్తారని జగన్‌ తెలిపారు.

“భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన చేసిన మంచి ఎప్పటికీ గుర్తుంటుంది. ఆయనను గౌరవిస్తూ మనం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమాల్లోనూ ఆయన్ను గౌరవిస్తూ డాక్టర్‌ వైఎస్సార్‌ గారి పేరే పెట్టడం జరిగింది. రైతు దినోత్సవం నాడు 10.20 లక్షల మంది రైతన్నలకు 1,117 కోట్లు బీమా పరిహారంగా నేరుగా బటన్‌ నొక్కి పంపే కార్యక్రమం జరుగుతోంది. రైతుల తరఫున ప్రీమియం మొత్తం కడుతున్న ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు. ఒక్కమన రాష్ట్రంలోనే. రైతన్నలకు ప్రతి ఎకరా కూడా నష్టపోకూడదని ఆర్బీకే స్థాయిలోనే ఈ-క్రాపింగ్‌ అమలు చేస్తున్నాం.

దేవుడి దయ వల్ల నాలుగేళ్లలోనే సకాలంలోనే కావాల్సినంత వర్షం కురిసింది. ఒక్క కరువు మండలం కూడా డిక్లేర్‌ చేయాల్సిన అవసరం రాలేదు. నాలుగేళ్లలో 54,48,000 మంది రైతన్నలకు వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా ద్వారా 7,802 కోట్ల బీమా పరిహారంగా చెల్లించడం జరిగింది. రైతు కష్టంలో ఉన్నప్పుడు మనందరి ప్రభుత్వం నిలబడింది. గత ప్రభుత్వంలో ఆ 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు హయాంలో సగటున ప్రతి ఏటా 300 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించే పరిస్థితి. చంద్రబాబు పరిపాలనలో ప్రతి సంవత్సరం ఉమ్మడి అనంతపురం అంతా కరువుగానే కనిపించే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా పంట నష్టపోయిన రైతన్నలకు బీమా పరిహారంగా ఇచ్చింది అరకొరగానే.

అప్పటి ప్రభుత్వం చెల్లించిన బీమా పరిహారం 5 సంవత్సరాలు కలిపి కేవలం రూ.3,411 కోట్లు మాత్రమే. అది కూడా కేవలం 30.85 లక్షల మందికి మాత్రమే. ఈ నాలుగు సంవత్సరాల్లో అక్షరాలా బీమా పరిహారంగా చెల్లించింది 7,802 కోట్లు అని గుర్తు చేస్తున్నా. అది కూడా 54.48 లక్షల మంది రైతన్నలకు. నిజాలు ఈ మాదిరిగా ఉంటే బీమా పరిహారానికి సంబంధించి చంద్రబాబు, ఆయన గజదొంగల ముఠా, దుష్ట చతుష్టయం, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఏంమంటున్నారు? వీళ్లందరికీ దత్తపుత్రుడు ఏమంటున్నాడు ఆలోచన చేయమని కోరుతున్నా. బీమా పరిహారానికి సంబంధించి మొసలి కన్నీరు కార్చడం మొదలు పెట్టారు.

ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత ఎక్కువ ఇప్పించాలని తాపత్రయం..

బీమా కంపెనీ నుంచి రైతులకు అందాల్సిన పరిహారం ఎందుకు అందకూడదనుకుంటున్నారు. రైతులకు ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత ఎక్కువ ఇప్పించాలని ప్రభుత్వం తాపత్రయం పడుతోంది. వాస్తవాలు ఇవీ అయితే, ఏ రకంగా వీరు మభ్యపెడుతున్నారో ఆలోచించాలి. ఆర్బీకేల్లో ప్రతి గ్రామంలో ఎవరికి ఎంత ఇన్సూరెన్స్‌ వస్తోంది, ఎన్ని ఎకరాల్లో పంట నష్టం అన్నీ టెస్టింగ్‌లు చేస్తున్నారు. సోషల్‌ ఆడిట్‌లో పేర్లు పెడుతున్నారు. అభ్యంతరాలు కూడా తీసుకుంటున్నారు. ఇన్ని జరిగిన తర్వాత కూడా రైతుల బీమా పరిహారం ఏ ఒక్క రైతూ నష్టపోకుండా ఇస్తున్న గొప్ప కార్యక్రమం జరుగుతున్నా రాజకీయాలు, వక్రీకరణ చేస్తున్నారు.

చంద్రబాబు 5 ఏళ్ల కాలంలో కరువు కాలంలో కూడా రైతులకు అందాల్సిన బీమా అందలేదని నోరెత్తలేదు ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు. చంద్రబాబు వచ్చి రెయిన్‌ గన్‌తో కరువును పారదోలాను అని ఫొటోలకు పోజిస్తావుంటే కరువు వెళ్లిపోయిందని నిస్సిగ్గుగా రాశారు. ఈరోజు ఈక్రాప్‌ ద్వారా పూర్తి ప్రీమియంను కట్టడమే కాకుండా రైతన్నకు అండగా నిలుస్తుంటే మొసలి కన్నీరు కారుస్తున్నారు. నోటిఫైడ్‌ పంటలన్నింటికీ ఇన్సూరెన్స్‌ ప్రీమియం కట్టి ఇప్పిస్తున్న ఉచిత బీమా పథకం దేశంలో ఎక్కడా లేదు. మన రాష్ట్రంలో తప్ప. రెండో అతి పెద్ద గొప్ప మార్పు.. వైఎస్సార్‌ రైతు భరోసా పీఎం కిసాన్‌. మూడు విడతల్లోవైఎస్సార్‌ రైతు భరోసా సాయం రూ.13,500. క్రమం తప్పకుండా వస్తోంది.

నాలుగేళ్లలో 52.38 లక్షల మంది రైతన్నలకు ఒక్కొక్కరికి రూ.61,500 రైతన్నల చేతుల్లో నేరుగా బటన్‌ నొక్కి పెట్టడం జరిగింది. ఈ ఒక్క పథకానికే 30,985 కోట్ల రూపాయలు నేరుగా రైతన్నలకు అందజేశాం. రాష్ట్రంలో 50 శాతం మంది రైతన్నకు అర హెక్టారు భూమి కూడా లేదు. ఒక హెక్టారు కూడా లేని వారు 70 శాతం మంది ఉన్నారు. ఇలాంటి రైతన్నలకు 13500 ఇచ్చే కరెక్టుగా టయ్యానికి ఇచ్చేసరికి 80 శాతం పంట ఖర్చులకు మేలు జరుగుతోంది. ఇది చిన్న సన్నకారు రైతులకు సంజీవని లాంటిది.

రైతు భరోసా కేంద్రాలు విప్లవాత్మకం..

మూడో అతి పెద్ద మార్పు.. దేశం మొత్తం మన రాష్ట్రానికి వచ్చి ఎలా జరుగుతోందో అని చూసి వెళ్లే మార్పు. రైతు భరోసా కేంద్రాలు. విత్తనం మొదలు పంట అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ రైతులకు అండగా, తోడుగా ఉంటూ రైతును చేయి పట్టుకొని నడిపిస్తున్న వ్యవస్థ గ్రామ స్థాయిలో కనిపిస్తోంది. 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇలాంటి మార్పు దేశంలో ఎక్కడా కూడా లేదు. నాలుగో గొప్ప మార్పు ఈ క్రాప్‌. ఇది కూడా దేశంలో ఎక్కడా జరగడం లేదు. ఇతర రాష్ట్రాలన్నీ నేర్చుకొని వెళ్తున్నాయి. ఐదో ముఖ్యమైన మార్పు.. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగినా కూడా ఆ సీజన్‌ ముగియక మునుపే పంట నష్టపరిహారం రైతన్న చేతుల్లో పెడుతున్న ఏకైక ప్రభుత్వం కూడా మన రాష్ట్రమే. 22.74 లక్షల మంది రైతన్నలకు 1,965 కోట్లు ఈరోజు పంట నష్టపరిహారంగా చెల్లించాం.

ఎక్కడా దళారులు, మధ్యవర్తులు, లంచాలు లేవు. ఎవరికి మంచి జరగాల్నో వారికి నేరుగా జరుగుతోంది. ఆరో గొప్ప మార్పు సున్నా వడ్డీ పథకం. సున్నా వడ్డీకి నిజమైన అర్థం చెబుతూ తన రుణాలు సకాంలో చెల్లిస్తే చాలు.. ప్రోత్సాహం ఇస్తూ సున్నా వడ్డీ పథకం ఇస్తున్నాం. బహుశా దేశంలో ఎక్కడైనా ఉందో లేదో తెలియదుగానీ మన రాష్ట్రం అగ్రగామిగా ఉంది. గతంలో సున్నా వడ్డీ పథకానికి మంగళం పలికారు. గతంలో 87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి 15 వేల కోట్లు కూడా ఇవ్వకుండా రైతులను నిలువునా ముంచేసిన పరిస్థితులు.

మీ బిడ్డ ప్రభుత్వంలో 73.88 లక్షల మంది రైతులకు 1,835 కోట్లు ఇవ్వడం జరిగిందని తెలియజేస్తున్నా. ఏడో గొప్ప మార్పు.. ధరలు పోటీ పడే పరిస్థితి. రైతులు నష్టపోకుండా ఆదుకోవడం కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి. మిరప, పసుపు, ఉల్లి, చిరు ధాన్యాలు, అరటి బత్తాయి పంటలకూ కనీస మద్దతు ధర ప్రకటించాం. మార్కెట్‌లో రేటు తగ్గితే ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసే గొప్ప కార్యక్రమం జరుగుతోంది. ధాన్యం కొనుగోలుకు అక్షరాలా 58,767 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇతర పంటల కొనుగోలు కోసం 7,633 కోట్లు ఖర్చు చేశాం. రైతును చేయి పట్టుకొని నడిపించేలా గతంలో ఎప్పుడూ జరగలేదు. గత ప్రభుత్వం ఎగ్గొట్టి 965 కోట్లు మనమే చెల్లించాం.384 కోట్లు విత్తన బకాయిలు మనమే చెల్లించాం. కరెంటు బకాయిలు 8,800 కోట్లు మనమే కట్టాం.

సబ్సిడీ భరించాం..

8వ గొప్పమార్పు.. రైతన్నలకు పగటి పూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇచ్చే గొప్ప కార్యక్రమం. 1700 కోట్లు కేటాయించి ఫీడర్ల కెపాసిటీ పెంచి రైతన్నలకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చాడు మీ బిడ్డ. నాలుగేళ్లలోనే 40,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. రైతన్నలపై ప్రేమ అంటే, ధ్యాస అంటే ఇదీ అని చెప్పడానికి గర్వపడుతున్నా. ఆక్వా రైతులకూ కరెంటు యూనిట్‌ 1.50రూ.కే ఇవ్వడం మీ బిడ్డ హయాంలోనే జరిగింది. నాలుగేళ్లలో 2,968 కోట్లు సబ్సిడీగా భరించాం.

9వ మార్పు.. సన్న, చిన్నకారు రైతులకు సాగులో అవసరమయ్యే యంత్రాలు అందుబాటులో ఉండాలని ఆలోచన చేశాం. గ్రామంలో ఆర్బీకే పరిధిలో వైఎస్సార్‌ యంత్ర సేవ పథకాన్ని తీసుకొచ్చాం. ప్రతి ఆర్బీకే పరిధిలో 1100 కోట్ల వ్యయంతో వైఎస్సార్‌ యంత్ర సేవ పథకాన్ని ప్రారంభించాం. సబ్సిడీ రూపంలో 400 కోట్లు ప్రభుత్వం భరించింది. 100 సంవత్సరాలకుపైగా చుక్కల భూములుగా మిగిలిపోయిన 2.06 లక్షల ఎకరాలకు 87560 మంది రైతన్నలకు సంపూర్ణ భూహక్కు పత్రాలు ఇవ్వడం మరో గొప్ప విజయం. పశువుల కోసం 340 అంబులెన్స్‌లు.. నియోజకవర్గానికి 2 చొప్పున ఈరోజు తిరుగుతున్నాయి. 12వ గొప్పమార్పు సహకార రంగానికి తోడుగా ఉండేట్లుగా.. ప్రైవేట్‌ డెయిరీల గుత్తాధిపత్యానికి గండి కొడుతూ అమూల్‌ రంగ ప్రవేశం. అమూల్‌ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో 8 సార్లు రేట్లు పెంచారు. గేదె పాలు రూ.22, ఆవు పాలు రూ.11 పెరిగింది.

మిల్లెట్స్‌ను ప్రోత్సహించే కార్యక్రమం జరుగుతోంది. 8 జిల్లాల్లో చిరు ధాన్యాలు ఇంటింటికీ రేషన్‌లో ఇవ్వడం మొదలు పెట్టాం. 32 చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ ప్లాంట్లు మొదలు పెట్టాం. ఆర్బీకే స్థాయిలో కనీస గిట్టుబాటు ధర ఉండేట్లుగా అడుగులు వేస్తున్నాం. మరో గొప్ప మార్పు.. 100 సంవత్సరాల తర్వాత సమగ్ర భూ సర్వే. రైతన్నల భూములన్నీ సమగ్రంగా సర్వే, అప్‌డేట్‌ చేయించి వివాదాలకు తావు లేకుండా భూ హక్కు పత్రాలు చేతిలో పెడుతున్నాం. గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా 2 వేల రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటికే సబ్‌ రిజిస్ట్రేషన్‌ సేవలు అందుతున్నాయి. ఇది 16వ గొప్ప మార్పు. ఆర్బీకేలను ఇంకా పటిష్టపరచబోతున్నాం. రాబోయే రోజుల్లో సాయిల్‌ టెస్టింగ్‌ చేయించబోతున్నాం. ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ కూడా తీసుకొస్తున్నాం.

ఆర్బీకే స్థాయిలో డ్రోన్లు తీసుకొస్తున్నాం…

ఆర్బీకే స్థాయిలో డ్రోన్లు తీసుకొస్తున్నాం. భారతదేశం కాదు.. ప్రపంచ దేశాల నుంచి ఆంధ్రరాష్ట్రంలో వ్యవసాయం ఎలా జరుగుతోందని వాళ్లు చూసి వెళ్లే పరిస్థితులు రాబోతున్నాయి. ఇరిగేషన్‌కు సంబంధించి ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసేలా అడుగులు వేస్తున్నాం. చిరుధాన్యాలు చంద్రబాబు హయాంలో 152 లక్షల టన్నులు దిగుబడి ఉండేది. మన ప్రభుత్వంలో 13 లక్షల టన్నులు పెరిగి 165 లక్షల టన్నులకు చేరిందని తెలియజేస్తున్నా. నాలుగేళ్లలో రైతన్నలకుమంచి చేసేందుకు మీ బిడ్డ ప్రభుత్వంలో అక్షరాలా రూ.1,70,769 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.

వ్యాపారం కాదని అర్థం కావాలి…

రైతు చేస్తున్నది అన్నం పెట్టే వ్యవసాయం తప్ప వ్యాపారం కాదని, పాలించే వాళ్లకు అర్థం కావాలి. రైతును మోసంచేయకూడదని, ప్రజలను మోసం చేయకూడదని పాలకుడికి ఒక నిబద్ధత ఉండాలి. నైతికత ఉండాలి. అలాంటి నిబద్ధత, నైతికత ఉంటే ఆ మనిషిని ఆ గుండెను ఒక వైఎస్సార్‌ అని అన్నారు. అలాంటి నైతికత, నిబద్ధత ఉంటే ఆ గుండెను ఆ మనిషిని ఒక జగనన్న అంటారని సగర్వంగా తెలియజేస్తున్నా. నిబద్ధత, నైతికత లేకపోతే ఆ గుండెను, మనిషిని ఓ చంద్రబాబు నాయుడు అంటారు.

పేదల ప్రభుత్వం కావాలా? పెత్తందారుల ప్రభుత్వం కావాలా?

వర్షాలు లేని సంవత్సరాల్లో రైతులకు అండగా నిలబడే మనసే లేకపోతే రాబందులకు, నక్కలకు విందు భోజనం దొరుకుతుంది. మనకు పాడి పంట ఉండే నాయకత్వం కావాలా, లేక నక్కలు, తోడేళ్లు ఉండే పాలన కావాలా? మనకు రైతు రాజ్యం కావాలా లేక రైతును మోసం చేసే పాలన కావాలా? రైతుకు తోడుగా ఉండే ఆర్బీకే వ్యవస్థ కావాలా, గత ప్రభుత్వంలోమాదిరిగా దళారీ వ్యవస్థ కావాలా? పేదల ప్రభుత్వం కావాలా? లేక పెత్తందార్ల ప్రభుత్వం కావాలా? మనకు దేవుడి దయతో వర్షాలు కావాలా? లేక చంద్రబాబు ఐరెన్‌ లెగ్‌ కరువు కావాలా? మాట తప్పని ప్రభుత్వం కావాలా? వెన్నుపోటుకు కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు పాలన కావాలా?

అక్కచెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా డబ్బులు పోయే డీబీటీ ప్రభుత్వం కావాలా? చంద్రబాబు ప్రభుత్వంలో మాదిరిగా రైతుల్ని, పేదల్ని, సామాజిక వర్గాల్ని మోసం చేసి దోచుకోవడం, పంచుకోవడం, తినుకొనే డీపీటీ పద్ధతి కావాలా? అదే రాష్ట్రం, అదే బడ్జెట్‌, అప్పుడు కూడా అప్పటికన్నా ఇప్పుడు గ్రోత్‌ రేటు తక్కువే. ఇదే డబ్బును అప్పట్లోచంద్రబాబు గారి హయాంలో ఎవరి జేబుల్లోకి వెళ్లింది ఈడబ్బంతా ఆలోచనచేయమని కోరుతున్నా. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని సుప్రీంకు వెళ్లే పైశాచిక ఆనందం పొందే పెత్తందార్లు కావాలా? ఆరోగ్యశ్రీ, 104, 108, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌, 100 శాతం ఫీజు రీయింబర్ష్‌మెంట్‌, వసతి దీవెన అందించే మనందరి ప్రభుత్వం కావాలా? పేదలకు ఇలాంటి మంచి చేసిన చరిత్ర ఎక్కడా టార్చ్‌ లైట్‌ వేసి చూసి వెతికినా కనిపించని పెత్తందార్ల ప్రభుత్వం కావాలా?

ప్రతి రైతును, అక్కచెల్లెమ్మను, పేద వాడిని, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ, నా నిరుపేద వర్గాలను కోరుతున్నా.. ఎలాంటి ప్రభుత్వం కావాలో ఆలోచించాలి. వాళ్ల దగ్గర ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఓ దత్తపుత్రుడు ఉన్నాడు. వీళ్లంతా కలిసి తోడేళ్ల మాదిరి ఏకమై ఒక్క అబద్ధాన్ని వందసార్లు చెప్పిందే చెప్పి మోసం చేసే ప్రయత్నాలు చేస్తారు. నాకు వీళ్ల మాదిరి అబద్ధాలు, మోసం చేయడం చేత కాదు. నేను నమ్ముకుంది దేవుడి దయను, మీ చల్లని దీవెనలను.. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మంచి జరిగి ఉందా? లేదా అనేది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి, రైతన్నలకు, పేదలకు ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.” అంటూ సీఎం జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

Read Also : YS Jagan at Chittoor: “వెన్నుపోటు వీరుడు-ప్యాకేజీ శూరుడు”.. చంద్రబాబు, పవన్‌పై సీఎం జగన్‌ సెటైర్లు

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles