MLA Pedda Reddy VS JC: అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అక్కడ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్‌రెడ్డి రాజకీయం రంజుగా సాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ రచ్చకెక్కుతున్నారు. 2019 ఎన్నికల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి బ్రదర్స్ ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. వారి వారసులు పోటీ చేయగా ఇద్దరూ ఓటమిపాలయ్యారు. దీంతో అప్పటి నుంచి జేసీ దివాకర్‌రెడ్డి సైలెంట్ అయిపోయారు. ప్రభాకర్‌రెడ్డి మాత్రం తాడిపత్రి తనదేనంటూ హల్ చల్ చేస్తున్నారు. (MLA Pedda Reddy VS JC)
ఈ క్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఒంటికాలిపై లేస్తున్నారు. నిత్యం అదే రచ్చ, ఆరోపణల పర్వం, సవాళ్లు, ప్రతిసవాళ్లతో తాడిపత్రి దద్ధరిల్లుతోంది. అనుచరులపై దాడులు, కేసులు, ప్రెస్‌మీట్లు.. ఇదీ తంతు. తాజాగా జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరుపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫైర్ అయ్యారు. ఆయనపై తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యే పెద్దారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
Read Also : Ambati Rambabu on BRO: పవన్ తీరుపై కథ రెడీ అవుతోంది.. అనేక టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి: అంబటి రాంబాబు
తెలంగాణలో బీఎస్ -3 వాహనాలు అక్రమంగా నడుపుతున్నారని పిటిషన్ వేశారు పెద్దారెడ్డి. ఏడాది క్రితం ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని పెద్దారెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. బీఎస్-3 వాహనాలను బీఎస్-4 గా తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించారని కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు పిటిషన్‌లో వివరాలు పేర్కొన్నారు. ప్రభాకర్ రెడ్డి వాహనాలు జప్తు చేసి సీబీఐ దర్యాప్తు చేయించాలని పిటిషన్‌లో కోరారు.
ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు స్పందిస్తూ.. రవాణా, హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. డీజీపీ, రవాణా శాఖ కమిషనర్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇష్యూ చేసింది. మరోవైపు కౌంటర్ దాఖలు చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి, సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తాడిపత్రి ఎమ్మెల్యే పిటిషన్ పై విచారణ సెప్టెంబరు 12కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.