Ambati Rambabu on BRO: జనసేనాని పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి ధ్వజమెత్తారు. అంబటి రాంబాబును శ్యాంబాబు పేరిట ఇమిటేట్ చేస్తూ ఇటీవల రిలీజ్ అయిన బ్రో మూవీలో సీన్ ఉందంటూ వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో తనపై సినిమాలో చూపిన విధానంపై మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో తనను ఎదుర్కోలేక పవన్ ఇలాంటి దిగజారిపోతున్నారని ఫైర్ అయ్యారు. తాడేపల్లిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన మంత్రి అంబటి.. పవన్‌పై సినిమా కథ రెడీ అవుతోందంటూ సంచలన కామెంట్స్ చేశారు. (Ambati Rambabu on BRO)
బ్రో సినిమా కలెక్షన్లు పెంచుకునేందుకు తాపత్రయపడుతున్నారని అంబటి చెప్పారు. అట్టర్ ప్లాప్ సినిమాను అద్భుతమని చెబుతున్నారన్నారు. సినిమా కలెక్షన్లు రోజురోజుకు దారుణంగా పడిపోతున్నాయని గుర్తు చేశారు. కాంట్రవర్సీ చేసి కాసులు సంపాదించాలనుకుంటున్నారని, సినిమాను సినిమాగా తీయాలని హితవు పలికారు. పైశాచికానందం పొందాలి అనుకుంటే సినిమా హిట్ కాదని హెచ్చరించారు. పవన్ కు ఇచ్చిన రెమ్యునరేషన్ కూడా బ్రో సినిమాకు రాలేదని ఎద్దేవా చేశారు.
గిట్టనివారిని సినిమాలో చూపించి పైశాచికానందం పొందారని అంబటి తెలిపారు. త్రివిక్రమ్, పవన్ కలిసి శ్యాంబాబు క్యారెక్టర్ పెట్టారని పేర్కొన్నారు. ఈ సినిమాలో తన శత్రువులను తిట్టాలని పవన్ అనుకున్నారని, అందుకే సినిమా అట్టర్ ప్లాప్ అయిందన్నారు. బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకునే కుట్ర ఈ సినిమా వెనుక ఉందని ఆరోపణలు చేశారు. పవన్ కొత్త సినిమా నిర్మాత టీడీపీకి చెందిన విశ్వప్రసాద్ అని గుర్తు చేశారు.
పవన్ కు ఇవ్వాల్సిన ప్యాకేజీని విశ్వప్రసాద్ ద్వారా అందజేశారని అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్లాక్ మనీని వైట్ మనిగా చేసిన పవన్ కళ్యాణ్ కు అందించారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపణలు చేశారు. వారాహి అనే పవిత్రమైన వాహనాన్ని పవన్ తన కాళ్ల కింద పెట్టుకున్నాడని ధ్వజమెత్తారు.
పవన్ వ్యక్తిగత తీరుపై కథ రెడీ అవుతోందని అంబటి రాంబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ సినిమాకు అనేక పేర్లు పరిశీలనలో ఉన్నాయన్నారు. నిత్య పెళ్లికొడుకు, తాళి – ఎగతాళి, బహుభార్యా ప్రవీణుడు , మూడుముళ్లు – ఆరుపెళ్లిళ్లు… టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.
Read Also : Ambati on pawan: వారాహి ఎక్కి పవన్ అసత్యాలు మాట్లాడుతున్నారు: మంత్రి అంబటి