CM Jagan: అన్నదాతలకు మేలు చేసే ప్రభుత్వం తమదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan) స్పష్టం చేశారు. గుంటూరు చుట్టుగుంటలో వైఎస్సార్ యంత్ర సేవ (YSR Yantra Seva) పథకంలో భాగంగా ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్ల మెగా పంపిణీని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. రాష్ట్ర స్ధాయి రెండో మెగా పంపిణీలో భాగంగా రూ.361.29 కోట్ల విలువ గల 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లు, 13,573 ఇతర వ్యవసాయ పనిముట్ల పంపిణీని లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు సీఎం జగన్. ఇదే సందర్భంలో రూ.125.48 కోట్ల సబ్సిడీ సొమ్మును కంప్యూటర్‌లో బటన్ నొక్కి నేరుగా రైతన్నల గ్రూపుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేశారు ముఖ్యమంత్రి జగన్.
కార్యక్రమం అనంతరం మాట్లాడిన సీఎం జగన్.. (CM Jagan) రైతుల కోసం తమ ప్రభుత్వం ఏం చేస్తోందన్నది వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
”ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ కింద రైతులకు కావాల్సిన ట్రాక్టర్లయితేనేమి, వ్యవసాయ పరికాలైతేనేమి.. ఇటువంటివన్నీ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఆ రైతన్నలే గ్రూపు కింద ఫామ్ అయ్యి, ఆర్బీకే పరిధిలో ఉన్నమిగిలిన రైతులకు కూడా యంత్రాలన్నీ అందుబాటులోకి తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 10,444 ఆర్బీకేల పరిధిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ పరిధిలో, ఆర్బీకేలతో అనుసంధానమై, ఆర్బీకే పరిధిలోని రైతన్నలే ఈ వ్యవసాయ పనిముట్లన్నీ అతి తక్కువ ధరకు మిగిలిన రైతులకు అందుబాటులోకి తీసుకొస్తారు. గ్రామ స్వరాజ్యం అనే పదానికి నిజమైన అర్థం చెప్పే కార్యక్రమం ఈరోజు జరుగుతోంది.
ఇంతకు ముందు మనం 6,525 ఆర్బీకే స్థాయిలో, 391 క్లస్టర్ స్థాయిలోనూ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు రైతుల పేరుతో ఓపెన్ చేశాం. అక్కడ 3,800 ట్రాక్టర్లను, 391 కంబైన్ హార్వెస్టర్లను, 22,580 ఇతర యంత్రాలను సప్లయ్ చేశాం. ఈరోజు 3,919 ఆర్బీకే స్థాయిలో, మిగిలిన వంద క్లస్టర్ స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు అన్నింట్లోనూ 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లతో పాటు 13,573 ఇతర యంత్రాలను అందుబాటులో ఉండేటట్లు ఈరోజు కార్యక్రమంతో జెండా ఊపి స్టార్ట్ చేస్తున్నా. ప్రతి ఆర్బీకే స్థాయిలో కూడా 15 లక్షల రూపాయలు కేటాయింపు చేసి అక్కడ ఎటువంటి యంత్రాలు కావాలన్నా ఆ రైతుల్నే డిసైడ్ చేయాలని చెప్పి.. వాళ్లు డిసైడ్ చేసిన దాని ప్రకారం 15 లక్షలతో వారి అవసరాల మేరకు తీసుకొచ్చాం.
491 క్లస్టర్ స్థాయిలో వరి బాగా పండుతున్న ప్రాంతాల్లో అక్కడ కంబైన్ హార్వెస్టర్ తీసుకురావాల్సిన అవసరం ఉందని అనిపించిన స్థాయిలో 491 క్లస్టర్లను ఐడెంటిఫై చేశాం. ఒక్కొక్క క్లస్టర్ స్థాయిలో ఒక్కో హార్వెస్టర్‌ను 25 లక్షల రూపాయలతో వాళ్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. 1,052 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆర్బీకే ల పరిధిలో ఇవన్నీ తీసుకొస్తున్నాం. గ్రూపులుగా ఫామ్ అయిన రైతులు కేవలం 10 శాతం కడితే చాలు.. 40 శాతం గవర్నమెంటే సబ్సిడీ కింద ఇచ్చి మిగిలిన 50 శాతం లోన్ల కింద ఆ ఆర్బీకే పరిధిలో ఉన్న ఆ రైతాంగానికి ఇదంతా అందుబాటులోకి తీసుకొస్తున్నాం.
ఆర్బీకే స్థాయిలోనే ఏ రైతు అయినా వాడుకొనేందుకు అతి తక్కువ అద్దెతో ఇవన్నీ అందుబాటులో ఉండేందుకు వైఎస్సార్ యంత్ర సేవా యాప్‌ను కూడా తీసుకొస్తున్నాం. వీటి వల్ల 15 రోజులు ముందుగానే ఆ రైతన్నలు బుక్ చేసుకోవచ్చు. ఆర్బీకే పరిధిలో ఉన్న ప్రతి రైతన్న కూడా దీన్ని ఉపయోగించుకొనే పరిస్థితి రావాలని మనసారా కోరుకుంటున్నా. ఇదే మాదిరిగానే మళ్లీ ఈ సంవత్సరమే అక్టోబర్ మాసంలో 7 లక్షల మంది రైతన్నలకు మంచి జరిగిస్తూ వ్యవసాయ పనిముట్లను, వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లను అందజేస్తాం.
స్ప్రేయర్లు, టార్పాలిన్లు.. ఇలాంటివి కూడా అక్టోబర్ మాసంలో ఆ 7 లక్షల మంది రైతన్నలకు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అర్బీకే అన్న ఒక వ్యవస్థను పటిష్ట పరుస్తూ రైతన్నలకు ఇంకా మంచి జరిగించాలి అనే తపన, తాపత్రయంతో అడుగులు పడుతున్నాయి. రైతులకందరికీ మంచి జరగాలని, దేవుడి దయ, ప్రజలందరి చల్లని ఆశీస్సులతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా.” అని సీఎం జగన్ పేర్కొన్నారు.
Read Also : YSR Yantra Seva: వైఎస్సార్ యంత్రసేవ పథకం.. ప్రభుత్వం ఏం ఇస్తుంది?