YS Jagan PC: రాష్ట్రంలో కనీవినీ ఎరుగని కరువు పరిస్థితులు నెలకొన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు కుంభకర్ణుడిలా నిద్ర నటిస్తున్నారని వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ముందే తెలిసినా కంటింజెన్సీ ప్రణాళికను అమలు చేయకుండా రైతులను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను కోర్టుల ద్వారా అడ్డుకున్న చంద్రబాబే ఇప్పుడు బీసీలపై దొంగ ప్రేమ ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పోలీసులే గంజాయి రవాణా, మాఫియా కార్యకలాపాల్లో భాగస్వాములయ్యే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరువు, బీసీ రిజర్వేషన్లు, గంజాయి మాఫియాపై బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వైయస్ జగన్ ఆధారాలు, గణాంకాలతో ప్రభుత్వాన్ని నిలదీశారు. YS Jagan PC
సీబీఐ విచారణ సవాలుపై ఎందుకు నోరు మెదపడం లేదు?
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలతోపాటు ఏపీపీఎస్సీపై చంద్రబాబు చేసిన తప్పుడు ఆరోపణలకు సంబంధించి గతంలోనే సమగ్ర ఆధారాలు బయటపెట్టామని వైయస్ జగన్ గుర్తుచేశారు. ఈ రెండు అంశాలనూ సీబీఐకి అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం సిద్ధమా అని సవాల్ విసిరినా ఇప్పటివరకు స్పందన లేదన్నారు. తాము చూపించిన సాక్ష్యాలు, ఆధారాలపై వివరణ ఇవ్వకుండా మీడియా సమావేశాల అనంతరం కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా 52 శాతం వర్షపాతం లోటు
జూన్ నుంచి ఆగస్టు 26వ తేదీ వరకు రాష్ట్రంలో సాధారణంగా 394 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 189.62 మిల్లీమీటర్లు మాత్రమే కురిసిందని వైయస్ జగన్ వివరించారు. మొత్తంగా 52 శాతం వర్షపాతం లోటు ఉందన్నారు. కోస్తాంధ్రలో 47.18 శాతం, రాయలసీమలో 52.36 శాతం మేర లోటు కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలోని 688 మండలాలకు గాను 625 మండలాల్లో వర్షపాతం లోటు ఉందని చెప్పారు. అంటే రాష్ట్రంలోని 91 శాతం మండలాలు వర్షాభావాన్ని ఎదుర్కొంటున్నాయన్నారు. వీటిలో 434 మండలాల్లో లోటు వర్షపాతం, మరో 191 మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అన్నమయ్య, ప్రకాశం, నంద్యాల, చిత్తూరు, వైయస్సార్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందన్నారు. కరువుకు చిరునామాగా ఉండే రాయలసీమతోపాటు కోస్తాంధ్రలోనూ తీవ్ర వర్షాభావం నెలకొందని తెలిపారు.
63 లక్షల ఎకరాలకు.. సాగైంది 50 లక్షల ఎకరాల్లోనే
రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం దాదాపు 63 లక్షల ఎకరాలు కాగా, కేవలం 50 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయని వైయస్ జగన్ తెలిపారు. దాదాపు 80 శాతం విస్తీర్ణంలోనే సాగు నమోదైందన్నారు. జూన్‌లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత జూలై 8న ప్రకాశం బ్యారేజ్ వద్ద, పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేస్తున్నట్లు మంత్రులు, అధికారులు ఫొటోలకు పోజులిచ్చి ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. కాలువ చివరి భూముల వరకూ నీరు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు నమ్మి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి నార్లు పోశారన్నారు. ఇప్పుడు నీరు లేక నార్లు ఎండిపోతున్నాయని, ఎకరాకు కనీసం రూ.15 వేల వరకు రైతులు నష్టపోయారని చెప్పారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ముందే తెలుసని, జూన్‌లో 25 శాతం, జూలైలో 68 శాతం వర్షపాతం లోటు నమోదైందని తెలిపారు. జూలై 10 నాటికే పరిస్థితి తీవ్రంగా ఉందని తెలిసినా ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేయకుండా నీళ్లిస్తామంటూ ప్రచార స్టంట్లు చేసిందని మండిపడ్డారు.
శ్రీశైలంలో నీరున్నా రాయలసీమకు ఇవ్వలేదు
శ్రీశైలం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా ఆగస్టు 11 నాటికే 879.50 అడుగులకు నీరు చేరిందని వైయస్ జగన్ తెలిపారు. దాదాపు 880 అడుగుల వద్ద పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44 వేల క్యూసెక్కుల పూర్తిస్థాయి సామర్థ్యంతో రాయలసీమకు నీరు విడుదల చేసే అవకాశం ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. శ్రీశైలం నీటిమట్టం తగ్గుతున్న కొద్దీ పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించే సామర్థ్యం కూడా తగ్గుతుందని చెప్పారు. 854 అడుగుల దిగువకు నీటిమట్టం పడిపోయిన తర్వాత రాయలసీమకు నీరు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
రాయలసీమ రిజర్వాయర్లలో అడుగంటిన నిల్వలు
ఎస్సార్బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్ పరిధిలోని గోరుకల్లు, అవుకు, గండికోట, పైడిపాలెం, వామికొండ, సర్వరాయసాగర్, చిత్రావతి రిజర్వాయర్ల మొత్తం నిల్వ సామర్థ్యం 59 టీఎంసీలు కాగా ప్రస్తుతం 31 టీఎంసీలే ఉన్నాయని తెలిపారు. డెడ్ స్టోరేజీని మినహాయిస్తే వినియోగానికి అందుబాటులో ఉన్నది 23 టీఎంసీలేనని చెప్పారు. అంటే మొత్తం సామర్థ్యంలో 39 శాతం నీరు మాత్రమే అందుబాటులో ఉందన్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పరిధిలోని జీడిపల్లి, గొల్లపల్లి, చెర్లోపల్లి, పత్తికొండ, కృష్ణగిరి, అడవిపల్లి రిజర్వాయర్ల మొత్తం సామర్థ్యం 43 టీఎంసీలు కాగా ప్రస్తుతం నాలుగు టీఎంసీలే నిల్వ ఉన్నాయన్నారు. డెడ్ స్టోరేజీ 1.65 టీఎంసీలు తీసేస్తే వినియోగానికి రెండున్నర టీఎంసీల నీరు మాత్రమే మిగులుతుందని వివరించారు.
సెప్టెంబర్ 15 తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, ఇప్పుడే శ్రీశైలం నుంచి నీటిని కిందకు తరలించకపోతే రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఇలాంటి పాలకుల నుంచి రాయలసీమను కాపాడేందుకే తమ ప్రభుత్వంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఇన్సూరెన్స్ ప్రాజెక్టుగా చేపట్టామని చెప్పారు. YS Jagan PC
కృష్ణా డెల్టాకూ చుక్క నీరు ఇవ్వలేదు
నాగార్జునసాగర్ కుడి కాలువకు, ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు కూడా చంద్రబాబు ప్రభుత్వం నీరు ఇవ్వడం లేదని వైయస్ జగన్ విమర్శించారు. మరోవైపు పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పులిచింతల ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌పై తెలంగాణ ప్రభుత్వం అక్రమ ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నా చంద్రబాబు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలోని చింతలపాలెం మండలం పాత వెల్లటూరు వద్ద పులిచింతల బ్యాక్‌వాటర్ నుంచి ఎనిమిది టీఎంసీల నీటిని తరలించేందుకు రూ.1,450 కోట్లతో మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారని తెలిపారు. బుగ్గమాధారం వద్ద పులిచింతల దిగువన కృష్ణా నది నుంచి మరో రెండున్నర టీఎంసీలను తరలించేందుకు రూ.394 కోట్లతో రాజీవ్ ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్నాయన్నారు. పులిచింతల సామర్థ్యంలో దాదాపు 10.5 టీఎంసీలను తరలించే ప్రయత్నం జరుగుతున్నా చంద్రబాబు కనీసం ప్రశ్నించడం లేదన్నారు.
ఉచిత పంటల బీమాను నాశనం చేశారు
రైతులకు ఆర్థిక రక్షణగా నిలిచిన వైయస్సార్ ఉచిత పంటల బీమాను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసిందని వైయస్ జగన్ మండిపడ్డారు. ఇప్పుడు రైతులే ప్రీమియం చెల్లించాల్సి రావడంతో బీమా పరిధిలోకి వచ్చే రైతుల సంఖ్య భారీగా తగ్గిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 2022–23 ఖరీఫ్‌కు 1.18 కోట్ల రైతు దరఖాస్తులు బీమా పరిధిలోకి వస్తే, ప్రస్తుతం కేవలం 40 లక్షల దరఖాస్తులే వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం 30–35 శాతం మంది రైతులు కూడా బీమా రక్షణలోకి రావడం లేదన్నారు. YS Jagan PC
2023–24 ఖరీఫ్‌కు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రీమియాన్ని 2024 జూలైలో చంద్రబాబు ప్రభుత్వం చెల్లించకపోవడంతో రైతులు రూ.3 వేల కోట్ల పరిహారాన్ని కోల్పోయారని ఆరోపించారు. ప్రభుత్వం తన వాటాగా రూ.1,800 కోట్లు, రూ.1,100 కోట్ల మేర చెల్లించి ఉంటే కేంద్ర వాటాతో కలిపి రైతులకు రూ.3 వేల కోట్ల పరిహారం వచ్చేదన్నారు. 2025 అక్టోబర్‌లో మోంథా తుఫానుతో రైతులు తీవ్రంగా నష్టపోయినా ఇప్పటివరకు పైసా పరిహారం ఇవ్వలేదని విమర్శించారు.
వ్యవసాయ వ్యవస్థలన్నీ నిర్వీర్యం
సీజన్ ముగిసేలోగా చెల్లించే ఇన్‌పుట్ సబ్సిడీని నిలిపివేశారని, ఈ–క్రాప్, రైతు భరోసా కేంద్రాలు, అగ్రి ల్యాబ్స్‌ను నిర్వీర్యం చేశారని వైయస్ జగన్ తెలిపారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్థితిని సృష్టించారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో ‘సీఎం యాప్’ ద్వారా ప్రతి ఆర్బీకే పరిధిలో పంటల ధరలను నిరంతరం పర్యవేక్షించేవారమన్నారు. ఎక్కడైనా రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే వ్యవసాయ సహాయకుడు యాప్‌లో నమోదు చేయగానే జాయింట్ కలెక్టర్, మార్క్‌ఫెడ్ జోక్యం చేసుకుని పంట కొనుగోలు చేసేవారని తెలిపారు. మార్కెట్‌లో పోటీ సృష్టించి రైతులకు మెరుగైన ధరలు వచ్చేలా చేశామన్నారు. ఐదేళ్లలో మార్కెట్ జోక్యం కోసం రూ.7,800 కోట్లు ఖర్చు చేసి రైతులకు అండగా నిలిచామని చెప్పారు. ఇప్పుడు సున్నా వడ్డీ పథకాన్నీ చంద్రబాబు రద్దు చేశారని విమర్శించారు.
అన్నదాతకు మూడేళ్లలో రూ.41 వేల ఎగవేత
పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారని వైయస్ జగన్ గుర్తుచేశారు. మూడేళ్లకు రూ.60 వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.19 వేలు మాత్రమే ఇచ్చి రూ.41 వేలు ఎగ్గొట్టారని విమర్శించారు.
కరువు ప్రణాళిక ఎక్కడ?
జూలై చివరినాటికే 52 శాతం వర్షపాతం లోటు నమోదైనా కంటింజెన్సీ ప్రణాళిక ఎందుకు అమలులోకి రాలేదని వైయస్ జగన్ ప్రశ్నించారు. ఆగస్టులోనే రైతులకు అలసందలు, ఉలవలు, నువ్వులు, మినుములు, పెసలు, జొన్నలు, సజ్జలు వంటి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను ఉచితంగా అందించాల్సి ఉందన్నారు. ఇప్పటికే పంటలు వేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఏం సాయం చేసిందని నిలదీశారు. వర్షాభావ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. YS Jagan PC
- డ్రౌట్ మానిటరింగ్ సెంటర్లను పూర్తిస్థాయిలో యాక్టివేట్ చేయాలి.
- జిల్లా వ్యవసాయ కంటింజెన్సీ ప్రణాళికలను అమలు చేయాలి.
- ప్రతి జిల్లాలో డ్రౌట్ కంటింజెన్సీ సెల్ ఏర్పాటు చేయాలి.
- స్వల్పకాలిక, కరువును తట్టుకునే విత్తనాలను రైతులకు పంపిణీ చేయాలి.
- వ్యవసాయ కూలీలకు అదనపు ఉపాధి హామీ పనులు కల్పించాలి.
- పేదలకు ఆహార భద్రత కల్పించాలి.
- పశువులకు మేత కొరత రాకుండా జిల్లాల వారీగా ఏర్పాట్లు చేయాలి.
- మిగులు మేత ఉన్న జిల్లాలు, రాష్ట్రాల నుంచి ముందుగానే తెప్పించాలి.
ఆగస్టు కూడా ముగిసిపోతున్న సమయంలో ఇక విత్తనాలు ఇచ్చినా రైతులకు ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. కరువు సమయంలో ప్రజలను ఆదుకోవడంపై కాకుండా తప్పుడు ప్రచారం, అంశాల మళ్లింపు, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుపైనే చంద్రబాబు దృష్టి పెట్టారని ధ్వజమెత్తారు.
బీసీల రిజర్వేషన్లపై చంద్రబాబు మహా డ్రామా
34 శాతం ఇచ్చింది జగన్.. కేసులు వేయించింది చంద్రబాబు
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నంబర్ 176 ద్వారా స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు సిద్ధమైందని వైయస్ జగన్ తెలిపారు. కానీ చంద్రబాబు తన పార్టీ నాయకుడు, అప్పటి ఏపీ స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ కౌన్సిల్ సభ్యుడు బిర్రు ప్రతాప్‌రెడ్డి ద్వారా హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులు వేయించారని ఆరోపించారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హైకోర్టు బీసీల 34 శాతం రిజర్వేషన్లను కొట్టివేసిందన్నారు. కోర్టుకు వెళ్లేది చంద్రబాబే.. రిజర్వేషన్లను కొట్టేయించేది ఆయనే.. ఇప్పుడు ఎవరూ కోర్టుకు వెళ్లవద్దంటూ దొంగ ఏడుపులు ఏడ్చేది కూడా ఆయనేనని విమర్శించారు.
రిజర్వేషన్ లేకున్నా 34 శాతానికి మించి పదవులు
న్యాయస్థానం తీర్పుతో రిజర్వేషన్లు అమలు చేయలేని పరిస్థితుల్లోనూ ఓపెన్ కేటగిరీ స్థానాల్లో బీసీలను ప్రోత్సహించి 34 శాతానికి మించి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించామని వైయస్ జగన్ చెప్పారు.
| పదవులు/స్థానాలు | బీసీలకు కల్పించిన ప్రాతినిధ్యం |
|---|---|
| 25 మంత్రి పదవులు | 11 మంది–40 శాతానికి పైగా |
| ఉప ముఖ్యమంత్రి పదవులు | ఇద్దరు బీసీలు |
| 11 రాజ్యసభ స్థానాలు | నలుగురు–36 శాతం |
| 25 లోక్‌సభ స్థానాలు | 11–44 శాతం |
| 58 ఎమ్మెల్సీ స్థానాలు | 28–48 శాతం |
| 13 జెడ్పీ చైర్‌పర్సన్ పదవులు | 6–46 శాతం |
| 13 మేయర్ పదవులు | 9–69 శాతం |
| 636 ఎంపీపీ పదవులు | 239–38 శాతం |
| 84 మున్సిపల్ చైర్‌పర్సన్ పదవులు | 44–53 శాతం |
| 639 జెడ్పీటీసీ స్థానాలు | 227–36 శాతం |
| 8,239 ఎంపీటీసీ స్థానాలు | 3,361–41 శాతం |
| 10,536 సర్పంచ్ పదవులు | దాదాపు 4,000–38 శాతం |
| 196 ఏఎంసీ చైర్మన్ పదవులు | 76–39 శాతం |
| 137 ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ పదవులు | 53–సుమారు 39 శాతం |
2014–19 మధ్య చంద్రబాబు ఒక్క బీసీ నేతను కూడా రాజ్యసభకు పంపలేదని, వైయస్సార్‌సీపీ మాత్రం 11 స్థానాల్లో నలుగురిని పంపిందని గుర్తుచేశారు.
56 బీసీ కార్పొరేషన్లతో సరికొత్త చరిత్ర
139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ 56 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని వైయస్ జగన్ తెలిపారు. వాటి ద్వారా ఆయా కులాలకు నేరుగా ఆర్థిక ప్రయోజనాలు అందించామన్నారు. నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనులు, కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేశామని చెప్పారు. వాటిలో మహిళలకు 50 శాతం వాటా కల్పించిన ఘనత కూడా వైయస్సార్‌సీపీ ప్రభుత్వానిదేనన్నారు.
బీసీలకు చట్టసభల్లో 50 శాతం కోసం పోరాటం
చట్టసభల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలని వైయస్సార్‌సీపీ ఎంపీలతో పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టించామని వైయస్ జగన్ తెలిపారు. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ కోసం డిమాండ్ చేశామన్నారు. బీసీ కులగణన చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని గుర్తుచేశారు.
బీసీలకు రూ.1.82 లక్షల కోట్ల ప్రయోజనం
వివిధ డీబీటీ పథకాల ద్వారా బీసీల ఖాతాల్లో నేరుగా రూ.1.30 లక్షల కోట్లు జమ చేశామని వైయస్ జగన్ తెలిపారు. నాన్–డీబీటీ ప్రయోజనాలతో కలిపితే బీసీలకు అందించిన మొత్తం ప్రయోజనం రూ.1.82 లక్షల కోట్లని చెప్పారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్ కానుక, వైయస్సార్ చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహనమిత్ర, చేదోడు, జగనన్న తోడు, కళ్యాణమస్తు, షాదీ తోఫా తదితర పథకాలతో బీసీ కుటుంబాలకు గతంలో ఎన్నడూ జరగని మేలు చేశామన్నారు.
బీసీల బతుకులను బుగ్గిపాలు చేస్తున్న చంద్రబాబు
వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలన్నింటినీ చంద్రబాబు రద్దు చేశారని వైయస్ జగన్ విమర్శించారు. ఎన్నికల్లో బాండ్లు ఇచ్చి ప్రచారం చేసిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను మేనిఫెస్టోతో సహా చెత్తబుట్టలో వేశారని మండిపడ్డారు. రాజకీయంగా ఎదుగుతున్న బీసీ నాయకులను ఓర్చుకోలేక అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని ధ్వజమెత్తారు.
యాక్సిడెంట్ కేసును హత్యాయత్నంగా..
18 ఏళ్ల యువకుడికి సంబంధించిన బైక్ ప్రమాదాన్ని హత్యాయత్నం కేసుగా మార్చి, కుట్రకోణాన్ని జోడించి మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జైలుకు పంపారని వైయస్ జగన్ ఆరోపించారు. అప్పలరాజును పరామర్శించేందుకు తాను వెళ్లినప్పుడు లక్షలాది మంది సమక్షంలో జరగని ఘటనను జరిగినట్లు చూపించి, మహిళా ఎస్సైని అడ్డుపెట్టుకుని ఆమదాలవలస పార్టీ సమన్వయకర్త చింతాడ రవిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపారని విమర్శించారు.
విరూపాక్షిపై తప్పుడు కేసులతో కక్ష సాధింపు
కర్నూలు జిల్లాలో టీడీపీ కార్యకర్తలే దాడులకు పాల్పడినా బోయ సామాజికవర్గానికి చెందిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసులు పెట్టారని వైయస్ జగన్ తెలిపారు. వైయస్సార్‌సీపీ కార్యకర్త ఇంటిపై దాడి జరుగుతోందని ఫోన్ చేసినా పోలీసులు స్పందించలేదన్నారు. ఆ కార్యకర్తను రక్షించేందుకు విరూపాక్షి వెళ్లగా ఆయనపైనా, ఆయన తమ్ముడిపైనా దాడి చేసి తమ్ముడి చేయి విరగ్గొట్టారని చెప్పారు. టీడీపీ కార్యకర్త తన భార్య దుస్తులను తానే చింపుతున్న వీడియో బయటకు వచ్చినా, ఆ నేరాన్ని విరూపాక్షి అనుచరులపై మోపి ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. బాధితుల ఫిర్యాదును పోలీసులు స్వీకరించకపోగా తెల్లవారుజామున వందల మంది పోలీసులతో విరూపాక్షి ఇంటిపై దాడి చేసి అరెస్టు చేశారని మండిపడ్డారు.
కారుమూరి కుటుంబంపై అక్రమ కేసులు
యాదవ సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్‌కుమార్ యాదవ్‌పై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని వైయస్ జగన్ విమర్శించారు. జిల్లా స్థాయి కాంట్రాక్టు, టెండర్‌కు సంబంధించిన అంశాన్ని లిక్కర్ రవాణా కేసుగా మార్చి ఏలూరు ఎంపీగా పోటీ చేసిన సునీల్‌కుమార్‌ను వేధించారని ఆరోపించారు.
మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించని ప్రభుత్వం
విశాఖపట్నానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లి ప్రమాదానికి గురై, ఆరుగురు మరణించినా స్థానిక మంత్రి కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించలేదని వైయస్ జగన్ మండిపడ్డారు. బీసీలపై ప్రేమ ఉందని చెప్పుకునే ప్రభుత్వం వారికి కష్టం వచ్చినప్పుడు కనిపించలేదన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.9 వేల కోట్ల బకాయిలు పెట్టడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందడం లేదని చెప్పారు. చదువులు మానేస్తున్న వారిలో అత్యధికంగా నష్టపోతున్నది బీసీ విద్యార్థులేనన్నారు.
ఏపీలో ఉన్నామా.. కొలంబియాలో ఉన్నామా?
రాష్ట్రంలో మట్టి, ఇసుక, సిలికా, క్వార్ట్జ్, లేటరైట్, మద్యం మాఫియాలు చెలరేగుతున్నాయని వైయస్ జగన్ విమర్శించారు. అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ప్రభుత్వ ఆస్తులు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, విలువైన భూములను కావాల్సిన వారికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. కల్తీ మద్యం, బెల్ట్ షాపులు, గంజాయి, డ్రగ్స్ ప్రతి గ్రామం, ప్రతి వీధికీ విస్తరించాయన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో జరిగిన ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల దుస్థితికి నిదర్శనమని చెప్పారు. ఇద్దరు ఎస్సైలు ప్రయాణిస్తున్న కారు మత్తులో ఆటోను ఢీకొందని, డ్రైవర్‌గా మరో ఎస్సై ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. ప్రమాదం తర్వాత ప్రజలు కారును చుట్టుముట్టి చూడగా డిక్కీలో గంజాయి, మద్యం సీసాలు, పోలీసు యూనిఫాం కనిపించాయని తెలిపారు. “మనం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా? కొలంబియాలో ఉన్నామా?” అనే అనుమానం ప్రజలకు కలిగిందన్నారు.
బల్లికురవ ఎస్సై నాగరాజు, సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు ఈ కారులో ఉన్నారని పేర్కొన్నారు. ఘటనను వీడియో తీస్తున్న గ్రామస్థులను సీఐ బెదిరించారని, వీడియో తీస్తే జైల్లో పెడతామని హెచ్చరించారని ఆరోపించారు.
ఒక్క ఘటనకు మూడు కథలు
అద్దంకి ఘటనను కప్పిపుచ్చేందుకు పోలీసు అధికారులు పరస్పర విరుద్ధ కథనాలు చెప్పారని వైయస్ జగన్ పేర్కొన్నారు.
- ఇద్దరు ఎస్సైలు కారులో వెళ్తుండగా అనుమానాస్పద వ్యక్తి గంజాయి మూట వదిలి పారిపోయాడని, అతడిని వెంబడించే క్రమంలో ప్రమాదం జరిగిందని దర్శి డీఎస్పీ చెప్పారని తెలిపారు.
- ముందస్తు సమాచారంతో గంజాయి స్వాధీనం చేసుకునేందుకు దాడికి వెళ్లారని ప్రకాశం జిల్లా ఎస్పీ చెప్పారన్నారు.
- బల్లికురవ ఎస్సై కుమారుడికి కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సంతమాగులూరు ఎస్సై వెళ్లారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారని చెప్పారు.
ఒకే ఘటనపై మూడు వేర్వేరు కథనాలు చెప్పడం కప్పిపుచ్చే ప్రయత్నానికి నిదర్శనమన్నారు. గంజాయి, మద్యం సీసాలు అప్పటికే స్వాధీనం చేసుకున్నవని ఎస్పీ చెప్పగా, వాటిని ఎక్కడ, ఏ కేసులో స్వాధీనం చేసుకున్నారో వెల్లడించలేదన్నారు. ఎస్సై 108కు ఫోన్ చేసి, అంబులెన్స్ వచ్చే వరకు అక్కడే ఉన్నారని పోలీసులు చెప్పారని, కానీ 108 పేషెంట్ కేర్ రికార్డులో స్థానిక వ్యక్తి ఫోన్ చేసినట్లు ఉందని వైయస్ జగన్ తెలిపారు.
వ్యవస్థను కాపాడాల్సినవారే నిందితులను కాపాడుతున్నారు
ప్రమాదంలో ఆటోలోని ప్రయాణికులు గాయపడి ఆస్పత్రి పాలయ్యారని వైయస్ జగన్ చెప్పారు. కారులో ఎస్సైలు, డిక్కీలో గంజాయి, మద్యం, పోలీసు యూనిఫాం ఉన్నాయని ప్రత్యక్షంగా కనిపిస్తున్నా సీఐ, డీఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారులు ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తప్పు చేసిన పోలీసులపై చర్యలు తీసుకుని వ్యవస్థకు స్పష్టమైన సంకేతం పంపాల్సిన ప్రభుత్వం వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. గ్రానైట్ మాఫియా నుంచి పోలీసులు వసూళ్లు చేసి స్థానిక ఎమ్మెల్యే, చిన్నబాబు, పెద్దబాబుకు వాటాలు పంపుతున్న క్రమంలోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం వస్తోందని ఆరోపించారు.
పోలీసు శాఖలో పరిపాలనా సౌలభ్యం కోసం రేంజ్‌లు ఉంటాయని, కానీ ఇప్పుడు రేంజ్‌ల వారీగా సిండికేట్లు ఏర్పడి వసూళ్లలో భాగస్వాములయ్యే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు, పోలీసులు, నేరస్తులు కుమ్మక్కై గంజాయి, డ్రగ్స్ మాఫియాను నడుపుతున్నారని ధ్వజమెత్తారు.
పోలీస్‌స్టేషన్ నుంచి గంజాయి డాన్ పరారీ
విజయవాడ నిడమానూరులో 140 కిలోల గంజాయి పట్టుబడిన కేసులో కేరళకు చెందిన గంజాయి డాన్ సోహైల్‌ను విశాఖలో అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చారని వైయస్ జగన్ తెలిపారు. పటమట పోలీస్‌స్టేషన్ నుంచి అతడు పరారయ్యాడని చెప్పారు. జూన్ 9న ఘటన జరిగితే ఇప్పటికీ పట్టుకోలేకపోయారని, అతడు తప్పించుకున్నాడా లేక తప్పించబడ్డాడా అనే అనుమానం కలుగుతోందన్నారు.
టీడీపీ నేతలే చేస్తున్న ఫిర్యాదులు
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో గంజాయి, గుట్కా విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని స్థానిక టీడీపీ నాయకులే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని వైయస్ జగన్ తెలిపారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో ఇద్దరు మహిళా టీడీపీ నేతలు గంజాయి విక్రయిస్తున్నారని అదే పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అధికార పార్టీ అనుచరులు తమిళనాడుకు 220 కిలోల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారని తెలిపారు. కుప్పానికి చెందిన టీడీపీ నేతలు ఒడిశాలో గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డారని చెప్పారు.
వైయస్సార్‌సీపీ హయాంలో గంజాయిపై ఉక్కుపాదం
తమ ప్రభుత్వంలో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేకంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను ఏర్పాటు చేశామని వైయస్ జగన్ తెలిపారు.
- 11,550 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశాం.
- నాలుగున్నర కోట్ల గంజాయి మొక్కలను తొలగించాం.
- 13,210 మందిని అరెస్టు చేశాం.
- 2,950 వాహనాలను జప్తు చేశాం.
- పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని గంజాయి రవాణా మార్గాలను మూసివేశాం.
- ఆపరేషన్ పరివర్తన్, ఆపరేషన్ నవోదయం అమలు చేశాం.
- గిరిజనులను ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించేందుకు రూ.144 కోట్లు ఖర్చు చేశాం.
- గిరిజనులకు మూడు లక్షలకు పైగా ఎకరాల అటవీ హక్కుల భూములను పంపిణీ చేశాం.
ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైందని, పోలీసులనే గంజాయి వ్యాపారంలో భాగస్వాములను చేసి అధికార పార్టీ నాయకులతో కలిసి మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. “రాష్ట్రంలో రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. చంద్రబాబు పాలనలో గిట్టుబాటు ధర వస్తున్న ఒకే ఒక్క పంట గంజాయి” అని వైయస్ జగన్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
పోలీసులతో ఎన్నికలు గెలవలేరు
స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతాయా అన్నది ప్రశ్నార్థకమని వైయస్ జగన్ అన్నారు. గంజాయి కేసులో ఎస్సైలు సాధారణ దుస్తుల్లో ఉంటే ముందస్తు సమాచారంతో దాడికి వెళ్లారని పోలీసులు సమర్థిస్తున్నారని, ప్రతిపక్ష సమావేశాలకు సాధారణ దుస్తుల్లో పోలీసులు వస్తే వారిని ఎలా గుర్తించాలని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో పోరాటం చేయాల్సిందేనని, చివరకు ప్రజాస్వామ్యమే గెలవాలని అన్నారు. పోలీసులను ఉపయోగించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకసారి గెలిచామని చంద్రబాబు చెప్పుకోవచ్చేమో కానీ ప్రజల వ్యతిరేకత సాధారణ ఎన్నికల్లో బయటపడుతుందని హెచ్చరించారు.
గతంలో నంద్యాల ఉప ఎన్నికల్లో పోలీసులను మోహరించి, డబ్బు కుమ్మరించి, ప్రలోభపెట్టి, నాయకులను అరెస్టు చేసి టీడీపీ గెలిచిందని గుర్తుచేశారు. ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో అదే నంద్యాల స్థానాన్ని వైయస్సార్‌సీపీ 36 వేల నుంచి 38 వేల మెజార్టీతో గెలుచుకుందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు తాము ప్రజల కోసం నొక్కిన సంక్షేమ బటన్లపై జరిగాయని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చడం వల్లనే వైయస్సార్‌సీపీకి ఘనమైన ఫలితాలు వచ్చాయన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాన్ని బుల్డోజ్ చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.
వెలిగొండలో చంద్రబాబుది క్రెడిట్ చోరీ
వెలిగొండ ప్రాజెక్టు నుంచి 31వ తేదీన నీరు విడుదల చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై విలేకరులు ప్రశ్నించగా, ప్రాజెక్టు చరిత్రను పరిశీలించాలని వైయస్ జగన్ సూచించారు. వెలిగొండ కోసం పనిచేసింది మొదట వైయస్ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత తన ప్రభుత్వమేనన్నారు. ఎవరి హయాంలో టన్నెల్ ఎంత పూర్తయిందో, ఏ మేరకు పనులు జరిగాయో పరిశీలిస్తే వాస్తవాలు బయటపడతాయని చెప్పారు. ఎలాంటి కృషి చేయకుండానే క్రెడిట్ దక్కించుకోవడాన్ని చంద్రబాబు దగ్గరే నేర్చుకోవాలని, వెలిగొండ విషయంలో ఆయనది క్రెడిట్ చోరీ అని వ్యాఖ్యానించారు.
ఈ పాలనకు ఏ ఇంట్లో ఓట్లు పడతాయి?
రాష్ట్రంలో వస్తున్న సర్వేల్లో వైయస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని, వైయస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నట్లు వెల్లడవుతోందని విలేకరులు ప్రస్తావించారు. దీనిపై వైయస్ జగన్ స్పందిస్తూ.. “చంద్రబాబు పాలన ఈ విధంగా ఉంటే ఆయనకు ఏ ఇంట్లో ఓట్లు పడతాయి? ఎవరు ఓట్లు వేస్తారు?” అని ప్రశ్నించారు.
మీడియా సమావేశంలో జగన్ చూపిన డాక్యుమెంట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 26-08-2026_YS_JAGAN_PIC FINAL
Read also: YS Jagan with YSRCP Leaders: స్థానిక పోరుకు.. సమర శంఖం.. ప్రతి చోటా పోటీ.. ఎక్కడా ఏకగ్రీవం కాకూడదు: వైఎస్ జగన్
YS Jagan PC on DSC: గ్రూప్-1పై, డీఎస్సీపై.. సీబీఐ విచారణకు రెడీనా? సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్
