Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా భుజాల నొప్పితో బాధపడుతున్న ఆయన ఇవాళ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో రొటేటర్ కఫ్ గాయంతో పాటు రెండు భుజాల కండరాల్లో తీవ్ర సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించి, శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించినట్లు సమాచారం. అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాతే ఆపరేషన్‌కు రావాలని పవన్ నిర్ణయించుకున్నారని గత వారం వెల్లడైంది.
ముందు బాధ్యతలు.. తర్వాత వైద్యం
వైద్యులు తక్షణ శస్త్రచికిత్సను సూచించినప్పటికీ, ముందుగా ప్రభుత్వ కార్యక్రమాలు, ఇప్పటికే నిర్ణయించిన అధికారిక పర్యటనలు పూర్తి చేసి ఆ తర్వాతే చికిత్స తీసుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. గతవారం ముంబైలో వైద్య పరీక్షలు చేయించుకున్న అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఏమిటి ఈ రొటేటర్ కఫ్ గాయం?
రొటేటర్ కఫ్ అనేది భుజాన్ని స్థిరంగా ఉంచే కండరాలు, టెండన్ల సమూహం. వీటికి గాయమైతే…
చేతిని పైకి ఎత్తడం కష్టమవుతుంది.
భుజంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది.
బరువులు ఎత్తలేని పరిస్థితి ఏర్పడుతుంది.
ఎక్కువకాలం నిర్లక్ష్యం చేస్తే శస్త్రచికిత్స అవసరం కావచ్చు.
పవన్ కళ్యాణ్ విషయంలో రెండు భుజాల కండరాలపై ప్రభావం కనిపించడంతో వైద్యులు ఆపరేషన్‌ను సూచించినట్లు సమాచారం.
గాయాలకు కారణమేంటి?
పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో ఎన్నో యాక్షన్ సన్నివేశాలను డూప్ లేకుండా చేసిన విషయం తెలిసిందే. మరోవైపు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటనలు, సభలు, అభిమానుల మధ్య జరిగే రద్దీ, నిరంతర ప్రయాణాలు భుజాలపై తీవ్ర ఒత్తిడిని పెంచినట్లు ఆయన గతంలో కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ఈ కారణాల వల్లే గాయం మరింత తీవ్రతరమైనట్లు భావిస్తున్నారు.
ఆపరేషన్ తర్వాత ఎంతకాలం విశ్రాంతి?
శస్త్రచికిత్స అనంతరం వైద్యుల పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ సుమారు ఐదు రోజులపాటు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన తర్వాత ఫిజియోథెరపీ, పునరావాస చికిత్స కొనసాగించే అవకాశముంది. పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత తిరిగి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. సాధారణంగా రొటేటర్ కఫ్ శస్త్రచికిత్స అనంతరం పూర్తి కోలుకోవడానికి కొన్ని వారాల నుంచి కొన్ని నెలల వరకు సమయం పట్టవచ్చు.
అభిమానుల ప్రార్థనలు
పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తై, ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
ఇవీ చదవండి: Pawan Kalyan: OG-2లో సుభాష్ చంద్రబోస్ ట్విస్ట్? పవన్ కల్యాణ్ సినిమాపై ఊహించని కథనం వైరల్!
Pawan Kalyan: వచ్చే తరం కోసం ఆలోచించాలి.. నిర్మాణాత్మక రాజకీయాలే దేశానికి అవసరం: పవన్ కల్యాణ్
