Visakhapatnam Boat Accident: రాత్రి 9 గంటలు… నడిరేయి… చుట్టూ ఎటు చూసినా అంతులేని నల్లటి సముద్రం. ఆకాశం నిండా మబ్బులు.. కళ్ల ముందు ఉగ్రరూపం దాల్చిన అలలు. కింద నెమ్మదిగా మునిగిపోతున్న బోటు… ప్రాణాలు కాపాడుకునేందుకు రెండు లైఫ్ జాకెట్లను గట్టిగా పట్టుకుని ఆరుగురు మత్స్యకారులు. ప్రతి అల ఒకసారి వారిని సముద్రంలోకి లాగేస్తుంటే.. మరోసారి పైకి ఎగరేస్తోంది. ఆ రాత్రంతా ఒక్క నిమిషం కూడా కళ్లు మూసుకునే పరిస్థితి లేదు. చీకట్లో ఎవరు ఎక్కడ కొట్టుకుపోతారో తెలియని భయం… తెల్లవారుతుందో లేదో కూడా తెలియని అనిశ్చితి… ప్రతి క్షణం మరణంతో పోరాటమే.
విశాఖ తీరంలో జరిగిన బోటు ప్రమాదం నుంచి అద్భుతంగా అలలతో వీరోచిత పోరాటంలో ప్రాణాలతో బయటపడిన భోగాపురం మత్స్యకారుడు కారె చిన్న చెబుతున్న ప్రతి మాట విన్నవారి కళ్లల్లో నీళ్లు తెప్పిస్తోంది.
రెండు రోజుల వేట… ఒక్క అలతో అంతా తలకిందులు
జులై 1న హార్బర్ నుంచి సముద్రంలోకి బయలుదేరిన బృందం దాదాపు 37 మైళ్ల దూరంలో రెండు రోజుల పాటు చేపల వేట సాగించింది. తిరుగు ప్రయాణంలో తీరానికి మరో 10 మైళ్లు మాత్రమే మిగిలి ఉండగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తుఫాను గాలులు, భీకర అలలు బోటును ఊచకోత కోశాయి. ఒక భారీ అల ఒక్కసారిగా బోటును బోల్తా కొట్టించింది. ఆ క్షణంలోనే తన అన్న కొడుకు చిన్నయ్య సముద్రంలో పడిపోవడంతో, అతడిని కాపాడేందుకు అన్న కూడా దూకాడు. కానీ ఇద్దరూ అలల్లో కలిసిపోయారు.
మునిగిపోతున్న బోటుపై మరణంతో పోరాటం… రాత్రంతా ఒక్కటే ఆశ.. బోటు పూర్తిగా మునిగిపోకముందు ఆరుగురు లైఫ్ జాకెట్లను పట్టుకుని తేలియాడారు. “ఎవరూ విడిపోవద్దు… కలిసే ఉంటేనే బతుకుతాం” అని ఒకరినొకరు ధైర్యం చెప్పుకున్నారు. అలలు ఒక్కోసారి తలపై నుంచి దూసుకెళ్తుంటే… ఉప్పునీరు ఊపిరితిత్తుల్లోకి చేరుతోంది. చలికి శరీరం వణుకుతోంది. చేతులు బిగించి పట్టుకున్న లైఫ్ జాకెట్ ను వదిలేస్తే అంతే అన్న భయం. చీకట్లో ఎవరి ముఖం కూడా కనిపించని పరిస్థితి. గడియారం ఆగిపోయినట్లు అనిపించిన ఆ రాత్రి… ప్రతి నిమిషం ఒక యుగంలా గడిచిందని చిన్న చెబుతున్నాడు.
ఉదయం వెలుతురు పడేసరికి… ఆరుగురిలో ఒకరు కనిపించలేదు. రాత్రి ఎప్పుడో అలల దాటికి కొట్టుకుపోయాడని అప్పుడు మాత్రమే అర్థమైంది.”నువ్వు నలుగురు పిల్లల తండ్రివి… నువ్వు బతుకు”తెల్లవారుతున్న సమయంలో చాలా దూరంలో ఒక భారీ చైనా వాణిజ్య నౌక కనిపించింది.దానిని చూపిస్తూ చిన్న తన తమ్ముడిని పిలిచాడు.”రా… ఎలాగైనా ఈదుకెళ్దాం” అన్నాడు.కానీ తమ్ముడి సమాధానం విన్న క్షణం నుంచి చిన్న జీవితాంతం మరచిపోలేని గాయం మిగిలిపోయింది.”నా వల్ల ఇక ఈదలేను అన్నా… నా ప్రాణం ఇక్కడితో అయిపోయింది. నువ్వు నలుగురు పిల్లల తండ్రివి… నా మాట విను… నువ్వు వెళ్లు… బతుకు…”అని చెప్పి తన అన్నను ముందుకు నెట్టాడు.
ఒక అన్నను కాపాడేందుకు… తన ప్రాణాన్ని సముద్రానికే అప్పగించిన తమ్ముడి ఆ చివరి మాటలు ఇప్పుడు చిన్నను వెంటాడుతున్నాయి.
15 కిలోమీటర్లు… మరణంతో పందెం
తమ్ముడి మాట విని నలుగురు కలిసి షిప్ వైపు ఈదడం ప్రారంభించారు. కానీ సముద్రం మాత్రం ఒక్కొక్కరిని తనలోకి లాగేసుకుంది. చివరకు చిన్న ఒక్కడే మిగిలాడు. సుమారు 15 కిలోమీటర్ల దూరం అలలతో పోరాడుతూ… చేతుల్లో శక్తి లేకపోయినా ఆశ మాత్రం వదలకుండా ఈదుతూనే ఉన్నాడు. ప్రతి అల ఒకసారి వెనక్కి నెట్టింది… ప్రతి శ్వాస చివరిదే అనిపించింది… అయినా కుటుంబం గుర్తొచ్చిన ప్రతిసారి మరోసారి చేతులు కదిలించాడు. చివరకు చైనా నౌక యాంకర్ గొలుసును అందుకుని పట్టుకున్నాడు.
అప్పుడే మరో భారీ అల అతడిని మళ్లీ కిందకు లాగింది. “బాబోయ్… కాపాడండి…” అంటూ చేసిన ఆర్తనాదం అతడి జీవితాన్ని మార్చేసింది.
చైనా సిబ్బంది చూపిన మానవత్వం
అతడి కేకలు విన్న నౌకలోని చైనా సిబ్బంది వెంటనే స్పందించారు. లైఫ్ జాకెట్, తాడు కిందకు విసిరి చిన్నను సురక్షితంగా పైకి లాగారు. అప్పటికే తీవ్ర నీరసం, డీహైడ్రేషన్‌తో ఉన్న అతడికి నీళ్లు తాగించి, పొడి బట్టలు ఇచ్చి, భోజనం పెట్టి సంరక్షించారు. భారత నౌకాదళ హెలికాప్టర్ వచ్చి అతడిని తరలించే వరకు చిన్న అదే నౌకలో చికిత్స పొందాడు.
కన్నీళ్లు పెట్టిస్తున్న ఒక్క మాట…
ప్రస్తుతం కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్న…”నేను ఈ రోజు బతికున్నానంటే… అది నా తమ్ముడు పెట్టిన భిక్ష. నన్ను బతకమని చెప్పి… తానే సముద్రంలో మునిగిపోయాడు. నేను బతికొచ్చాను… కానీ నా మనసు మాత్రం అక్కడే మునిగిపోయింది…” అంటూ కన్నీరు మున్నీరయ్యాడు.
మరో ఆరుగురి కోసం కొనసాగుతున్న గాలింపు
ఈ ప్రమాదంలో గల్లంతైన మిగిలిన ఆరుగురు మత్స్యకారుల కోసం భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్ బృందాలు హెలికాప్టర్లు, ప్రత్యేక బోట్లతో ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నాయి. కుటుంబ సభ్యులు మాత్రం అద్భుతం జరుగుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఈ ఘటన కేవలం ఓ బోటు ప్రమాదం మాత్రమే కాదు… ఒక తమ్ముడు తన అన్న కోసం చేసిన పరమ త్యాగానికి, సముద్రం మధ్యలో మనిషి ప్రాణం కోసం చేసే చివరి పోరాటానికి నిలిచిపోయే విషాద గాథగా మిగిలిపోనుంది.
ఇవీ చదవండి: Visakhapatnam Steel Plant accident: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం 2026: లాడిల్ పేలుడుతో 8 మంది కార్మికులు మృతి – RINL VSP ఘోర దుర్ఘటన
Markapur Bus Accident: మార్కాపురం బస్సు అగ్ని ప్రమాదం: 13 మంది సజీవ దహనం – హృదయ విదారక ఘటన
Bangladesh Bus Accident: పద్మా నదిలో పడిన బస్సు.. 16 మంది మృతి, పలువురు గల్లంతు
