HomeAndhra PradeshYS Jagan MAVIGUN: దేశంలో అతి పెద్ద స్కామ్‌కు క్యాపిటల్‌ అమరావతి.. మ‌చిలీప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరు.....

YS Jagan MAVIGUN: దేశంలో అతి పెద్ద స్కామ్‌కు క్యాపిటల్‌ అమరావతి.. మ‌చిలీప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరు.. మ‌.వి.గ‌న్ అంటూ జగన్‌ సంచ‌ల‌నం

YS Jagan MAVIGUN: దేశంలో అతి పెద్ద స్కామ్‌కు క్యాపిటల్‌ అమరావతి అని, అది అసలు ప్రజల రా«జధాని కాదని, స్కామ్‌ల రాజధాని అని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతికి ఎప్పుడూ వ్యతిరేకం కాదన్న ఆయన అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు తమది అదే మాట అని, ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ తమ పార్టీ వ్యతిరేకం కాదని వెల్లడించారు. అమరావతి నిర్మాణాల్లో సీఎం చంద్రబాబు అంతులేని అవినీతి చేస్తున్నారని, ఒక్కో చదరపు అడుగుకు దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.11 వేల నుంచి రూ.14 వేల వరకు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. దీన్ని ప్రశ్నిస్తే అమరావతి వ్యతిరేకులని ముద్ర వేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు.

రాజధానిలో ఇప్పటికే 50 వేల ఎకరాల భూమి ఉండగా, మరో 50 వేల ఎకరాల సేకరణకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, ఆ లక్ష ఎకరాల్లో రోడ్డు, సివరేజ్, నీరు, విద్యుత్‌ కనెక్షన్‌ వంటి కనీస సదుపాయాల కోసం ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున, మొత్తం రూ.2 లక్షల కోట్లు కావాలని, అంత మొత్తం ఖర్చు చేసే పరిస్థితి లేదని జగన్‌ చెప్పారు. ఆ దిశలోనే నాడు విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ను, కర్నూలులో జ్యుడీషియల్‌ రాజధానిని ప్రతిపాదించామని చెప్పారు. అలా చేస్తే దోపిడి సాధ్యం కాదు కాబట్టి, చంద్రబాబుకు ఆసక్తి చూపలేదన్నారు. అందుకే ఇప్పుడు ప్లాన్‌–బి ప్రతిపాదిస్తున్నామని వెల్లడించారు.

మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పరిధిలో ‘మ వి గన్‌’ పేరుతో రాజధాని ఏర్పాటు చేయాలని జగన్‌ సూచించారు. రాజధానిగా ఈ ప్రాంతం ఎంతో అనువుగా ఉంటుందన్న ఆయన, తద్వారా శరవేగంగా అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఈ ప్రాంతంలో నేషనల్‌ హై వే కనెక్టివిటీ ఉందని గుర్తు చేశారు. మరోవైపు మచిలీపట్నంలో పోర్టును కూడా తాము అభివృద్ధి చేశామని చెప్పారు.

రాజధాని ప్రాంతంలో తొలి విడత భూములు తీసుకున్న రైతులకు ఇప్పటికీ న్యాయం చేయలేదని, దీంతో వారిలో వ్యతిరేకత వస్తోందని శ్రీ వైయస్‌ జగన్‌ అన్నారు. మరోవైపు అమరావతి పనుల్లో అంతులేని అవినీతి. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఒకరోజు అసెంబ్లీ పెట్టి, అమరావతి పేరుతో తీర్మానం చేశారని చెప్పారు. పైగా మండలిని వదిలి కేవలం అసెంబ్లీనే సమావేశపర్చారని గుర్తు చేసిన ఆయన, నిజానికి ఆ తీర్మానం అస్సలు అవసరమే లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగన్‌ తేల్చి చెప్పారు.

ప్రెస్‌మీట్‌లో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

దోపిడీకి స్టాంప్‌.. డైవర్షన్‌.. అదే ఉద్దేశం
చంద్రబాబునాయుడు వంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం. ఎందుకంటే ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు. నిజాయితీ అంతకన్నా లేదు. పరిపాలన అంటే చంద్రబాబు దృష్టిలో..  అది కేవలం దోపిడీ చేయడానికి, అవినీతిని చేయడానికి మాత్రమే. రకరకాల పద్ధతుల్లో దోపిడీ చేస్తూ, వాటికి రకరకాల పేర్లు పెడతాడు. దాని చుట్టూ డ్రామాలాడతాడు. విజన్‌ అంటాడు, సంపద సృష్టి అంటాడు. టాపిక్‌లు డైవర్ట్‌ చేస్తూ, స్కాములు చేస్తూ దోచేసే ప్రయత్నం చేస్తుంటాడు. అమరావతిలో గత వారం శాసనసభలో చేసిన తీర్మానంలో కూడా ఆ డ్రామాలే మనకు కనిపిస్తాయి. ప్రజల్ని పక్కదోవ పట్టించడం, తన దోపిడీకి స్టాంప్‌ వేసుకోవడం, తన దోపిడీ నుంచి ప్రజల దృష్లి మళ్లించడం.. అలా వారిని పక్కదోవ పట్టించడం కోసమే అమరావతిపై అసెంబ్లీ తీర్మానం.

ఎక్కడా లేనిది మనకెందుకు వర్తిస్తోంది?
నిజంగా రాజధాని మీద అసెంబ్లీలో తీర్మానమే అవసరం లేదని మంత్రి కె.పార్థసారథి స్వయంగా చెప్పారు. నేను అడుగుతున్నా. అసలు రాజ్యాంగంలో రాష్ట్ర రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా? దేశ రాజధాని అని ఉంటుంది తప్ప, రాష్ట్రాల రాజధాని ప్రస్తావన అందులో లేదు. ఓన్లీ గవర్నెన్స్‌. ఈ ఫ్యాక్ట్‌ నిజంగా కూడా ఎవరూ కూడా మర్చిపోకూడదు. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం అంటూ అధికారికంగా, మన ఏపీ హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ కూడా దాఖలు చేశారు. ఈ మేరకు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ఇంకా మన కళ్ల ఎదుటే 2000వ సంవత్సరంలో కేంద్రం కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలను తీసుకొచ్చింది. ఆ రాష్ట్రాలకు రాజధానులు ఎలా వచ్చాయి? కేంద్రం ఏమైనా డిసైడ్‌ చేసిందా? కేంద్రం నిర్ణయించలేదే?. ఆ రాష్ట్రాలు వాళ్లు స్వయంగా నిర్ణయించుకున్నారు. మరి ఎవరికీ వర్తించనిది.. కేవలం మనకు మాత్రమే ఎందుకు వర్తిస్తోంది? ఎలా వర్తిస్తోంది?.

కనీస మౌలిక వసతులకు రూ.2 లక్షల కోట్లు!
చంద్రబాబును అడుగుతున్నా. ఏడేళ్లుగా మీరే ముఖ్యమంత్రిగా ఉండి, మొదటి టర్మ్‌ ఐదు సంవత్సరాలు, తర్వాత ఇప్పుడు రెండు సంవత్సరాలు. లక్ష ఎకరాల అమరావతిలో ఇంత వరకు కట్టింది ఎంత? అమరావతి తన పెట్‌ ప్రాజెక్టు అంటూ నినాదమిస్తూ తాను ఇంత వరకు ఇక్కడ చేసిన పనులేమిటి?.

అమరావతి నిజంగా సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అయ్యిందా? ఈయన డబ్బా కొట్టినట్టుగా. చంద్రబాబు ఏ దేశం పోతే ఆదేశం బొమ్మలు  చూపిస్తాడు. అదిగో ఇదే అమరావతి అంటాడు. మరి ఎంత వరకు వచ్చింది? ఆ దేశాలు ఇక్కడేమైనా కనపడుతున్నాయా? కనీసం భూములిచ్చిన రైతులకు చెప్పిన హామీలైనా నెరవేర్చాడా ఈ పెద్దమనిషి?.

మొదట తీసుకున్న 50 వేల ఎకరాల్లోనే కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజ్‌ అంటే సీవరేజ్, వాటర్‌.. వీటి కల్పనకు అయ్యే ఖర్చు చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం.. ఆయనే స్వయంగా కేంద్ర ప్రభుత్వం, వివిధ బ్యాంకులకు ఇచ్చిన లెక్కల ప్రకరాం ఎకరాకు రూ.2 కోట్లు అవుతుంది. అంటే 50 వేల ఎకరాలకు అయ్యే లక్ష కోట్లకే దిక్కు లేదనుకుంటే, ఇప్పుడు సడన్‌ గా మరో 50 వేల ఎకరాలు కావాలంటున్నారు. మరి అక్కడ అదనంగా అయ్యే వ్యయం మరో లక్ష కోట్లు. అలా అమరావతిని ఎందుకు పెంచాల్సి వస్తోంది. ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు?. మరి ఈ డబ్బులు ఎలా వస్తాయి? ఆ పనులన్నీ పూర్తవడానికి ఎన్నేళ్లు పడుతుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఈ దశాబ్దాలు పట్టే ఈ సమయంలో.. ఈ 2 లక్షల కోట్ల వ్యయం ఇంకా ఎంతకు చేరుతుంది?.

నాడు బ్రహ్మాండమైన సిటీ. నేడు మున్సిపాలిటీ!
2019కి ముందు ఈయనే స్వయంగా చేసిన మాస్టర్‌ ప్లాన్‌. 50 వేల ఎకరాలకు సంబంధించి బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడ వస్తోందని మనందరికీ ఊదరగొట్టి. బాహుబలి సెట్టింగులన్నీ చూపించాడు. మరి ఆ మాస్టర్‌ ప్లాన్‌ను సడన్‌గా ఈయనే ఎందుకు మారుస్తున్నాడు? అప్పుడు ఇదే 50 వేల ఎకరాల్లోనే బ్రహ్మాండమైన బెస్ట్‌ క్యాపిటల్‌ సిటీ అని ఊదరగొట్టిన ఇదే వ్యక్తి.. ఈరోజు ఆ 50 వేల ఎకరాల రాజధాని కేవలం మున్సిపాలిటీగా మిగిలిపోతుందని ఎందుకు అంటున్నాడు?. ఆ మాట అని ఇంకో 50 వేల ఎకరాలు కావాలంటున్నాడు. అంటే రాజధానిలో ఎలాగైనా మళ్లీ భూములు సేకరించాలన్నదే ఆయన లక్ష్యం.

డైవర్షన్‌ కోసం తీర్మానం డ్రామా:
అమరావతి పనుల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్‌ఎఫ్‌టీకి రూ.11 వేల నుంచి రూ.14 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. అంత వ్యయం ఎందుకవుతోంది? ఏ స్కాముల వల్ల అది ఎగబాకుతోంది? అన్న వాటికి సమాధానం అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో చెప్పలేదు. 5.30 గం. అసెంబ్లీ సమావేశాన్ని కేవలం జగన్‌ను తిట్టడానికి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై దుమ్మెత్తి పోయడానికి, బూతులు తిట్టడానికే వాడుకున్నారు.

రాజధాని పేరిట పట్టపగలు తాను చేస్తున్న దోపిడీ నుంచి ప్రజల్ని డైవర్ట్‌ చేయడానికి ఈ డ్రామాకు తెర లేపాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఓ వైపున అసెంబ్లీ పిలుస్తాడు. ఇంకో వైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్‌ను పిలవడు. ఎందుకు? కౌన్సిల్‌ ను పిలిస్తే రాజధాని పేరిట చంద్రబాబు చేస్తున్న అవినీతి బాగోతాన్ని సభ్యులు బయట పెడతారని. ఈయన బండారాన్ని అంతా సభ్యులు కడిగిపారేస్తారని.

చంద్రబాబుకు ఆ విషయం తెలుసు. అయినా..
భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరూ మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెబుతున్నాడు. అసెంబ్లీలో వీళ్లు చేయగా లేనిది.. అదే అసెంబ్లీలో మళ్లీ దాన్ని మార్పు చేయలేరా? చట్టాల గురించి మాట్లాడే ఈ వ్యక్తి చట్ట సవరణల గురించి మాట్లాడడా? ఆయనకు తెలియదా అంటే, తెలుసు. కానీ ఒక డ్రామా. తన అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు డ్రామా. ఏ చట్టమైనా కూడా చట్టసభ ద్వారా రూపొందుతుంది. అలాగే ఆ చట్టంలో సవరణలు కూడా అదే చట్ట సభ చేయగలుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ చంద్రబాబునాయుడు ఏదో కొత్తగా ప్రజలకు తెలియనట్టుగా, దాన్ని పక్కదోవ పట్టిపట్టించేట్టుగా దాన్ని విప్లవాత్మకంగా తీసుకొస్తున్నట్టుగా బిల్డప్‌ ఇస్తున్నాడు. ఇదంతా ఎందుకంటే తన అవినీతి నుంచి టాపిక్‌ డైవర్ట్‌ చేసేందుకు.

ఏనాడైనా ఇక్కడే ఉండిపోయారా?
నేను సూటిగా చంద్రబాబును అడుగుతున్నా.. 2014 నుంచి ఇప్పటివరకు 12 ఏళ్ల కాలంలో మనస్ఫూర్తిగా చంద్రబాబు ఇక్కడ నివసించారా? మనస్ఫూర్తిగా కాపురం చేశారా? ఇప్పటికి కూడా మీ కుటుంబాలు అన్నీ ఎక్కడ ఉన్నాయి? 2019 వరకు హైదరాబాద్‌ కు షటిల్‌ సర్వీస్‌ చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల వరకు వీళ్ల అడ్రస్‌ అంతా హైదరాబాద్‌. ఇప్పుటికి కూడా రెండు రోజులు హైదరాబాద్‌.. మిగిలిన ఐదు రోజులే ఇక్కడ. ఈయన కొడుకు లోకేష్, పవన్‌ కల్యాణ్‌ అయితే వారానికి నాలుగు రోజులు ఇక్కడ ఉంటే గొప్ప. పవన్‌ కల్యాణ్‌ ఎప్పుడు ఎక్కడుంటాడో కూడా తెలీదు. ప్రత్యేకంగా ఒక్కొక్కరికీ ఒక్కొక్క విమానం. అంతా షటిల్‌ సర్వీసులు.

ఏ ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు:
వైయస్సార్‌ సీపీ ఈ ప్రాంతానికే కాదు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ అప్పుడూ ఇప్పుడూ కూడా వ్యతిరేకం కాదనే విషయం స్పష్టంగా మరొక్కసారి చెబుతున్నా. ఈ సందర్భంగా కొన్ని వాస్తవాలు మీ ద్వారా ప్రజల ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నా. చంద్రబాబుగారు చెప్పిన లెక్కల ప్రకారమే, తానంతట తానే కేంద్రానికి, బ్యాంకులకు సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌ ప్రకారమే అమరావతి ప్రాంతంలో ఒక ఎకరంలో కనీస మౌలిక వసతులు అంటే రోడ్లు, నీరు, కరెంటు, సివరేజ్‌ ఏర్పాటుకు రూ.2 కోట్లు కావాలి. అంటే మొత్తం 50 వేల ఎకరాలకు అయ్యే ఖర్చు లక్ష కోట్లు. మొదటి దశలో తీసుకున్న 50 వేల ఎకరాలకు అవసరమయ్యే ఖర్చు లక్ష కోట్లకే దిక్కు లేదనుకుంటే, రెండో దశలో మరో 50 వేల ఎకరాలు తీసుకుంటామంటున్నారు. అందులో 20 వేల ఎకరాలకు ఇప్పటికే నోటిఫికేషన్‌ కూడా ఇచ్చేశారు.

ఈ లెక్కన రాజధానిలో తీసుకున్న, తీసుకోబోతున్న లక్ష ఎకరాల్లో కేవలం రోడ్లు వేయడానికి, కరెంట్, నీళ్లు ఇవ్వడానికి, డ్రెయినేజీ కనెక్షన్లు ఇవ్వడానికి ఎకరాకు రూ.2 కోట్లు చొప్పున లక్ష ఎకరాలకు ఏకంగా రూ 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఇది చాలా కీలకమైన అంశం. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు పూర్తయ్యే సరికి ఈ రూ.2 లక్షల కోట్లు.. ఇంకెంత పెరుగుతుందో చెప్పలేము. ఎన్నేళ్లు పడుతుందో కూడా తెలియదు. ఎన్ని దశాబ్దాలు పడుతుందో కూడా చెప్పలేము. ఆ వ్యయం రూ.4 లక్షల కోట్లు అవుతుందో లేక రూ.10 లక్షల కోట్లు అవుతుందో సమయమే నిర్ణయిస్తుంది.

ఇప్పటి వరకు చేసిన వ్యయం ఎంత?:
ఎకరాకు రూ.2 కోట్లు అనేది 12 ఏళ్ల క్రితం 2014లో చంద్రబాబు ఇచ్చిన లెక్కలు. 12 ఏళ్ల క్రితం లెక్కల ప్రకారమే రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన చంద్రబాబు, విడిపోయిన రాష్ట్రానికి 7 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారు?.

2014–19 మధ్య తొలి ఐదేళ్లలో రెండు లక్షల కోట్లకు గాను ఈయన పెట్టిన ఖర్చు రూ.5,335 కోట్లు. అవి కూడా అప్పులు ద్వారా తెచ్చినవే. ఈ రెండేళ్లలో ఎంత ఖర్చు చేశారని చూస్తే.. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ.47 వేల కోట్ల అప్పు చేయగా, ఇప్పటికే అందులో రూ.13 వేల కోట్లు తీసుకున్నారు. అందులో మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ కింద రూ.5,500 కోట్లు ఇచ్చారు. మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ కింద 10 శాతం కాంట్రాక్ట్‌ కంపెనీలకు ఇవ్వడం, అందులో కమీషన్ల కింద 8 శాతం తీసుకోవడం. ఇదే టీడీపీ ప్రభుత్వ వ్యవహారం.

అదే మా హయాంలో మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ అనేది లేదు. పని చేసి బిల్లు పెడితే నిధులిచ్చాం. చంద్రబాబు అధికారంలోకి రాగానే దాన్ని మార్చి మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ విధానం తీసుకొచ్చారు. ఇంకా ఇప్పటి వరకు కేవలం రూ.2,500 కోట్లు మాత్రమే బిల్లుల కింద చెల్లించారు.  మరో రూ.960 కోట్లు డైవర్ట్‌ చేశారు. అమరావతిలో పనుల కోసం చంద్రబాబు తన ఏడేళ్ల పాలనలో ఇప్పటి వరకు దాదాపు రూ.8 వేల కోట్లు ఖర్చు చేశారు. అది కూడా రోడ్లు, నీరు, కరెంటు, సివరేజ్‌ వంటి కనీస మౌలిక సదుపాయాల కోసం ఏడేళ్లలో ఈ పనుల కోసం కేవలం రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తే.. .మొత్తం రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టడానికి ఎన్నేళ్లు పడుతుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుందో అందరూ ఆలోచన చేయాలి.

అమరావతి స్కామ్‌. రాష్ట్రంపై ప్రభావం:
ఇది కాక బిల్డింగ్‌ల ఖర్చు వేరు. ఇక రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఎక్కడ? ఇతర ప్రభుత్వ బాధ్యతలు, వాటి పరిస్థితి ఏంటి? ఇది చాలా  కీలకమైన విషయం. ఇప్పటికే చంద్రబాబు తన స్కామ్‌ల కోసం అమరావతి పేరిట అప్పులు తెచ్చి కుమ్మరించడం వల్ల రాష్ట్రంపై దాని ప్రభావం కనిపిస్తోంది.

నాడు–నేడు పనులు నిలిచిపోయాయి. స్కూళ్లు, ఆస్పత్రులను పట్టించుకునే నాథుడే లేడు. పిల్లలకు ఇవ్వాల్సిన విద్యా దీనెన (ఫీజు రీయింబర్స్‌మెంట్‌) వసతి దీవెన ఆగిపోయాయి. ఈ ఏడాదితో కలిపి రూ.10 వేల కోట్లు అవసరమైతే బకాయిలతో కలిపి  బడ్జెట్‌లో పెట్టింది కేవలం రూ.2,600 కోట్లు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ ఆగిపోయింది. హాస్పిటళ్లు బోర్డు తిప్పేశాయి. ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు పేదవాడికి ఉచిత వైద్య సేవలు నిలిపివేశాయి.

వ్యవసాయం పూర్తిగా దెబ్బ తింది. రైతులకు ఏ పంటకూ గిట్టుబటు ధర రాని పరిస్థితి. కనీసం జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. ఉచిత పంటల బీమా గాలికెరిగిపోయింది. ఆర్బీకేలు నిర్వీర్యం అయ్యాయి. ఈ–క్రాప్‌ జరిగిందో లేదో పట్టించుకునే నాథుడే లేడు. మెడికల్‌ కాలేజీ పనులు పూర్తిగా ఆగిపోయాయి. మెడికల్‌ కాలేజీలు పూర్తవ్వడానికి రూ.5 వేల కోట్లు అవసరం. ఏటా రూ.1000 కోట్లు పెడితే పూర్తయ్యే పరిస్థితి. కానీ, పనులు ఆగిపోయాయి.

ఇంకా మా ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాలన్నీ రద్దయ్యాయి. రాష్ట్రానికి అవసరమయ్యే ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు అన్నీ కూడా ఆగిపోయాయి. చివరకు చంద్రబాబు ఇచ్చిన సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీలు కూడా మోసాలుగా మిగిలిపోయాయి.

రూ.2 లక్షల కోట్లు పెట్టే స్థోమత ఉందా?
లక్ష ఎకరాల్లో కనీస మౌలిక వసతులకు రూ.2 లక్షల కోట్లు ఎలా పెట్టగలుగుతారు?. ఆ స్థోమత ప్రస్తుతం ఉందా? ఉద్యోగులకు ఇప్పటికే రూ.36 వేల కోట్లు బకాయిలు. అంటే చంద్రబాబు తన జీవితమంతా ఇక్కడే రోడ్లు, కరెంటు, నీళ్లు, డ్రైనేజీలు కట్టుకుంటూ, వాటి కోసం అప్పులు చేస్తూ పోతే, అంతవరకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలు ఇలాగే ఇబ్బందులు పడుతూ ఉండాలా? ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు చెప్పిన లక్ష ఎకరాల అమరావతి ఎప్పటికి పూర్తవుతుంది?  అసలు రూ.2 లక్షల కోట్లు పెట్టే స్థోమత మనకి ఉందా? అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నారనే కౌన్సిల్‌ని సమావేశపరచకుండా అసెంబ్లీలో మాత్రమే తీర్మానం చేశారు.

అమరావతి స్కామ్‌ ఇలా! ఇది గూడపుఠాని కాదా?
అమరావతిలో టెండర్లు ఒక్కసారి గమనిస్తే, 2018లో ఏ పనులు,  ఎవరు చేశారో 2024 టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా ఇప్పుడు వారికి అవే పనులకు సంబంధించిన టెండర్లు దక్కాయి. ఇది గూడుపుఠాని కాదా? మాఫియా వ్యవహారం కాదా? ఒకవైపు అనూహ్యంగా టెండర్లు రద్దు చేసి రేట్లు పెంచేస్తున్నారు. మరోవైపు టెండర్లు రిగ్‌ చేసి మళ్లీ వారే టెండర్లు పొందుతున్నారు. ఇక్కడ మరో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. ఇక్కడ ల్యాండ్, ఇసుక ఫ్రీ, కరెంట్‌ ఛార్జీల్లో రాయితీలు. జీఎస్టీ, సీనరేజీ, ఎన్‌ఏసీ మినహాయింపులు. ఇవన్నీ ఉన్నా సరే, చదరపు అడుగుకు రూ.11 వేల నుంచి రూ.14 వేలు వ్యయం. ఇది భయంకరమైన దోపిడీ కాదా?.

దేశంలోనే అతి పెద్ద స్కామ్‌ క్యాపిటల్‌గా అమరావతి:
క్యాపిటల్‌గా అమరావతి రియాలిటీని పక్కన పెడితే దేశంలోనే అతిపెద్ద స్కామ్‌కు అమరావతిని చంద్రబాబు క్యాపిటల్‌గా చేశారు. అమరావతి రాజధాని ముసుగులో ఒక పెద్ద ఆర్గనైజ్డ్‌ స్కామ్‌ (వ్యవస్థీకృత అవినీతి) జరుగుతోంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ఏ మహానగరాలకు వెళ్లినా ఫైవ్‌ స్టార్‌ సదుపాయాలతో కట్టిన చోట కూడా చదరపు అడుగు నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ.4500 లకు మించదు. కానీ ఇక్కడ మాత్రం రూ.11 వేల నుంచి రూ.14 వేలు చూపిస్తున్నారు. అది కూడా ఇన్ని ఉచితాలు, రాయితీలు, మినహాయింపులు ఇచ్చిన తర్వాత.

అమరావతి అవినీతిలో పరాకాష్టకు ఉదాహరణ:
చంద్రబాబు కట్టాలనుకుంటున్న 5 టవర్లు. టెండర్లు చూస్తే.. వారి దోపిడికి వీరప్పన్‌ కూడా సరిపోడు. సెక్రటేరియట్‌లో టవర్‌–1, టవర్‌–2 (బేస్‌మెంట్, గ్రౌండ్‌ ప్లస్‌ 39 ఫ్లోర్‌)కు సంబంధించి హిందూ పత్రికలో గత ఏడాది ఏప్రిల్‌ 27న వచ్చిన కథనం ప్రకారం.. 2018లో ఖరారైన కాంట్రాక్ట్‌ వ్యయం రూ.932 కోట్లు కాగా, ఇప్పుడు అదే పని విలువను ఏకంగా రూ.1,423 కోట్లకు పెంచారు. 4.8 శాతం పెంచారు. ఇంకా కాంట్రాక్టర్లకు నజరానాగా జీఎస్టీ, సినరేజీ, ఎన్‌ఏసీ, ఇంకా పన్నుల మినహాయింపు ద్వారా మరో రూ.275.7 కోట్లు. అలా మొత్తంగా నిర్మాణ వ్యయం రూ.1762.81 కోట్లకు పెంచారు. అంటే ఇదే పనికి 2018లో రూ.932 కోట్లు అయితే, అది ఏకంగా రూ.830 కోట్లు పెరిగి మొత్తం ఖర్చు రూ.1762.81 కోట్లు అయింది. ఇంకా ఆ కాంట్రాక్ట్‌ షాపూర్‌ పల్లంజీ సంస్థకే ఇచ్చారు.

మరోవైపు టవర్‌ 3, టవర్‌ 4 చూస్తే 2018లో కాంట్రాక్ట్‌ విలువ రూ.784.63 కోట్లు. అదే విలువను ఇప్పుడు రూ.1,247 కోట్లకు పెంచారు. ఇక్కడా 4.54 శాతం ఎక్సెస్‌. ఇక్కడ కూడా నజరానాగా జీఎస్టీ, సినరేజీ, ఎన్‌ఏసీ ఇంకా పన్నుల మినహాయింపు ద్వారా మరో రూ.241.7 కోట్లు లబ్ధి. అలా మొత్తంగా రూ.1,545 కోట్లకు ఎల్‌ అండ్‌ టీకి కట్టబెట్టారు. అంటే అప్పుడు, ఇప్పుడు ఒకే కాంట్రాక్టర్‌.

ఇక జీఏడీ టవర్‌. బేస్‌మెంట్, గ్రౌండ్‌ ప్లస్‌ 49 అంతస్తులు. 2018లో ఖరారైన కాంట్రాక్ట్‌ విలువ రూ.554 కోట్లు. ఇప్పుడు ఆ పని విలువను రూ.844.22 కోట్లకు పెంచారు. ఇక్కడా టెండర్లలో 4.53 శాతం ఎక్సెస్‌. ఇక్కడ కూడా కాంట్రాక్టర్‌కు జీఎస్టీ, ఎన్‌ఏసీ, సినరేజ్‌ ఛార్జీల మినహాయింపు ద్వారా మరో రూ.163.6 కోట్ల లబ్ది. అన్నీ కలిపి ఏకంగా రూ.1,046 కోట్లకు ఇచ్చారు. దీన్ని ఎన్‌సీసీ సంస్థకు కట్టబెట్టారు. అలా మొత్తంగా ఈ 5 టవర్లకు రాయితీలతో కలిపి రూ.4,354 కోట్లకు కాంట్రాక్టులు ఇచ్చారు.

మళ్లీ దీనికి అదనంగా ఏసీలు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఫైర్‌ ఫైటింగ్స్, లిఫ్ట్‌లు.. వీటన్నింటి కోసం మరో రూ.2,316 కోట్లతో టెండర్లు పిల్చారు. ఆ మొత్తం కూడా కలుపుకుంటే 5 టవర్ల ఖర్చు రూ.6,671 కోట్లు. దీనికి అదనంగా ఆ కట్టే కాంప్లెక్స్‌లో మౌలిక వసతుల కోసం రూ.1,053 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 5 టవర్ల మొత్తం బిల్డప్‌ ఏరియా 52,20,496 ఎస్‌ఎఫ్‌టీ కాగా, ఒక్కో ఎస్‌ఎఫ్‌టీ ఖర్చు ఏకంగా రూ.14,796. అదనపు మౌలిక వసతుల కల్పన వ్యయం తీసేసినా కూడా అమరావతిలో ఒక్కో ఎస్‌ఎఫ్‌టీ నిర్మాన వ్యయం రూ.12,779. అదే అన్నీ కలిపి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో చూసినా ఎస్‌ఎఫ్‌టీ ఖర్చు కేవలం రూ.4,500 మాత్రమే. ఇంకా అక్కడ ఏదీ ఫ్రీ లేదు.

తాత్కాలిక సచివాలయం వ్యయం రూ.1100 కోట్లు:
మరోవైపు తాత్కాలిక సచివాలయం కోసం ఏకంగా రూ.1100 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు మళ్లీ రూ.6671 కోట్లు, మరో రూ.1053 కోట్లు ఖర్చు చేసి కొత్తగా నిర్మిస్తున్నారు. అంటే ఆ రూ.1100 కోట్లు ఏం అయ్యాయి? ఇదంతా గంగలో పోసినట్లే కదా?
ఒక్కసారి మిగతా చోట్ల వ్యయం చూస్తే.. తెలంగాణలో ఇటీవల కేసీఆర్‌గారు సచివాలయాన్ని 28 ఎకరాల్లో నిర్మించారు. దాదాపు 10 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన ఈ భవనానికి రూ.615 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్‌ భవనం రూ.970 కోట్లతో, 1272 మంది కూర్చునేలా నిర్మించారు. కానీ మన సచివాలయాన్ని మాత్రం ఏకంగా రూ.1,449 కోట్లతో నిర్మిస్తున్నారు. అంటే పార్లమెంట్‌ ఖర్చును దాటింది, కేసీఆర్‌ నిర్మాణ ఖర్చు కంటే రెండింతలు అవుతోంది. ఆ 5 టవర్లతో పాటు, హైకోర్టు కోసం మరో రూ.1480 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే స్కామ్‌ల కోసం హైకోర్టు, అసెంబ్లీ భవనాలను కూడా వదలడం లేదు.

డిజైన్లకే రూ.401 కోట్లు!:
చంద్రబాబు తన అవినీతిని సచివాలయ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు మాత్రమే పరిమితం చేయలేదు. రోడ్లు అయినా, కొండవీటి వాగు వరద మళ్లింపు అయినా, ఆర్కిటెక్చర్‌ డిజైన్లు అయినా.. ప్రతి చోటా అవినీతి కనిపిస్తోంది. అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లకే రూ.401 కోట్లు ఖర్చు చేశారు.

రోడ్లు, ఫ్లైఓవర్లలోనూ అదే తంతు:
కొండవీటి వాగు నుంచి వారధి వరకు ఫ్లైఓవర్‌ నిర్మాణానికి కి.మీ.కు రూ.170 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మా హయాంలో బెంజ్‌ సర్కిల్‌ వద్ద రెండో ఫ్లైఓవర్‌ను కి.మీ. రూ.130 కోట్లతో నిర్మించాం. అమరావతిలో మిగిలిన 6 లేన్‌ రోడ్ల కోసం కి.మీకు ఏకంగా రూ.53 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అదే నేషనల్‌ హైవే నిర్మాణంలో కి.మీకు కేవలం రూ.20 కోట్లకే టెండర్లు పిలుస్తారు.

ప్రశ్నిస్తే ఎదురుదాడి.. నిందలు
ఈ దోపిడీని ప్రశ్నించకూడదట!. అడిగితే ఎదురుదాడి చేస్తారు. అమరావతికి వ్యతిరేకం అంటారు. ఏడేళ్లలో అమరావతి కోసం రూ.8 వేల కోట్లు ఖర్చు చేశారు. మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌గా మరో రూ.5,500 కోట్లు ఇచ్చారు. ఇది పూర్తిగా స్కామ్‌. మొదట తీసుకున్న 50 వేల ఎకరాల్లో కనీస మౌలిక సదుపాయాలకు ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు చేయలేని పరిస్థితి ఉంటే, మరో 50 వేల ఎకరాలు తీసుకుని, భవనాలు కాకుండా కేవలం మౌలిక సదుపాయాల కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పడం అసాధ్యం. ఇది సాధ్యం కాదని తెలిసినా ప్రజలను మభ్య పెడుతున్నారు. ఇలా చేస్తే రాష్ట్రానికి రాజధాని ఎలా ఏర్పడుతుంది? ఏదీ ఉండదు.

డైవర్షన్‌ కోసమే అమరావతి తీర్మానం:
అమరావతిలో కనీస మౌలిక సదుపాయాల కోసం రూ.2 లక్షల కోట్ల వ్యయం అసాధ్యమని తెలిసినా రైతులను మోసం చేయడానికి, అప్పులు తెచ్చి అమరావతి పేరుతో స్కామ్‌లు చేయడం చంద్రబాబు ప్రణాళిక. ఈ దోపిడీ నుంచి దృష్టి మళ్లించడానికి అసెంబ్లీలో అమరావతి తీర్మానం అంటూ డ్రామా చేశారు.

అందుకే ఆనాడు అలా ప్రతిపాదించాం:
ఎవరూ అమరావతికి వ్యతిరేకం కాదు. కానీ అది సాధ్యం కాదని, అంత ఖర్చును రాష్ట్రం భరించలేదని, ప్రజలపై భారం పడకూడదని, ఇతర ప్రాంతాలు వెనుకబడకూడదని, అభివృద్ధి, సంక్షేమం ఆగిపోకూడదని భావించాం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి మెట్రో నగరాలతో పోటీ పడేందుకు ఒక గ్రోత్‌ ఇంజిన్‌ అవసరం. రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖపట్నం ఆ పాత్రకు సరిపోతుందని భావించి దాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించాం. ఇందులో ఎలాంటి స్వార్థం లేదు. ప్రాక్టికల్‌గా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. అలాగే కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని భావించాం.

అమరావతిపై ఏనాడూ నిర్లక్ష్యం చూపలేదు:
అలాగే అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలని నిర్ణయించాం. తీసేయాలని ఎప్పుడూ అనుకోలేదు. సాధ్యం కాదు కాబట్టే మోస్ట్‌ ప్రాక్టికల్‌ సొల్యూషన్‌ తీసుకు వచ్చాం. మా ఆలోచనల్లో ఎక్కడా కూడా అమరావతిని నిర్లక్ష్యం చేయలేదు. ఈ ప్రాంతంలో ఐదేళ్ల పాటు రైతులకు కౌలు పెంచాం. రాజధానిలో ఇచ్చే పెన్షన్లు రూ.5 వేలకు తీసుకెళ్లాం. ఈ ప్రాంతంలో ప్రజలకు, రైతులకు మంచి చేయాలని ఇవన్నీ చేశాం. మా ఆలోచన అంతా కూడా ఆచరణాత్మక ఆలోచనలు. మోస్ట్‌ ప్రాక్టికల్‌ ఆలోచనలు, సాధ్యమయ్యే ఆలోచనలు.

విశాఖపై ఆరాటం. అందుకు ఈ కారణాలు:
ప్రభుత్వం తన బాధ్యతగా ప్రజలకు చేయాల్సిన ప్రతీ మేలు కూడా చేస్తూ ప్రభుత్వం మీద, ప్రజల మీద అప్పుల భారం మోపకుండా, అతి తక్కువ పెట్టుబడితో విశాఖపట్నంలో అల్రెడీ అక్కడున్న మౌలిక సదుపాయాలకు కాస్త మెరుగులు దిద్ది, అదనంగా కొన్ని భవనాలు కడితే చాలు ఒక గ్రోత్‌ ఇంజిన్‌లా మారుతుంది. దీని కోసం కేవలం రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తే చాలు. అది కూడా ఒకేసారి పెట్టాల్సిన అవసరం లేదు. ఏటా రూ.2 వేల కోట్లు పెడితే చాలు. ఆటోమెటిక్‌గా విశాఖ గొప్ప స్థాయికి వెళ్తుంది. గ్రోత్‌ ఇంజిన్‌ తయారవుతుంది. చదువుకున్న మన పిల్లలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, మనకు కూడా ఒక మహానగరం తయారవుతుందని ఆరాట పడ్డాం. కానీ, దీని మీద చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా, వాళ్ల ముఠా కేవలం వారి స్వార్థం కోసం, వాళ్ల బినామీలు, వాళ్ల ఆస్తులు, వాళ్లు కొనుగోలు చేసిన ల్యాండ్‌ రేట్లు పెంచుకోవడం కోసం చెప్పని అబద్ధం లేదు. అంత దారుణంగా విష పూరిత ప్రచారాలు చేశారు.

నిజంగా సంకుచిత భావం ఉండి ఉంటే..
నిజంగా చెబుతున్నా. నాకు సంకుచితమైన ఆలోచన నాకు ఉండి ఉంటే.. రాయలసీమలోనే రాజధాని పెట్టేవాడ్ని. విశాఖలోనే ఎందుకు పెట్టాలనుకుంటాను. నిజంగానే నాకు సంకుచితమైన ఆలోచన ఉండి ఉంటే.. నేను ముఖ్యమంత్రి కాకముందే ఇక్కడ భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకున్నా.. చంద్రబాబు అప్పటికీ భూములు కొనలేదు.. ఇల్లు కట్టలేదు. నాకే సంకుచితమైన ఆలోచన ఉండి ఉంటే.. అమరావతిని లెజిస్లేచర్‌ క్యాపిటల్‌గా ఎందుకు చేస్తా.. చేయాల్సిన అవసరం ఏముంది.

స్కామ్‌ల కోసం చంద్రబాబు కుట్రలు:
అదే ఇవాళ చంద్రబాబునాయుడు ఎగ్జిక్యూటీవ్‌ క్యాపిటల్‌గా విశాఖను రద్దు చేశాడు. న్యాయ రాజధానిగా కర్నూలును రద్దు చేశాడు. పోనీ, అమరావతిలో రూ.2 లక్షల కోట్లు ఎప్పుడు పెట్టగలడో, ఎక్కడ నుంచి తెస్తాడో చంద్రబాబు చెప్పగలడా?. సాధ్యం కానిది కళ్ల ముందే అందరికీ కనిపిస్తోంది. దాని కోసం అని భ్రమ కల్పిస్తూ, స్కాములు చేస్తూ, భవిష్యత్తులో కూడా రాష్ట్రానికి ఒక గ్రోత్‌ ఇంజిన్‌ అనేది లేకుండా చేస్తున్నాడు. అటువైపున బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ పెరుగుతా ఉంటుంది. కానీ భవిష్యత్తులో కూడా మన రాష్ట్రం పెరగనివ్వకుండా చంద్రబాబు తన స్కాముల కోసం కుట్ర చేస్తున్నాడు. ఇన్నిన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టడం అసాధ్యమని ఒకవైపున కనిపిస్తుంటే, మరోవైపున రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సిన పనులు, ప్రజలకు చేయాల్సిన మంచి ఇవన్నీ కూడా ఆగిపోతున్న పరిస్థితులు.

వీటన్నింటికీ చంద్రబాబు బదులిస్తారా?:
రెండేళ్లు పూర్తి కాకముందే చంద్రబాబు గ్రాస్, కమిటెడ్‌ రూపంలో చేసిన అప్పులు రూ.3.37 లక్షల కోట్లు. ఈరోజు అప్పు చేస్తే తప్ప జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రూ.2 లక్షల కోట్లతో రాజధాని అంటున్నాడు. ఎప్పుడు డెవలప్‌ చేస్తాడు? ఈలోగా రైతుల పరిస్థితి ఏమిటీ? అక్కచెల్లెమ్మల పరిస్థితి ఏమిటీ? చదువుతున్న పిల్లల పరిస్థితి ఏమిటీ? నాడు–నేడు పనుల పరిస్థితి ఏమిటీ? శిథిలమవుతున్న స్కూళ్లు, ఆస్పత్రుల పరిస్థితి ఏమిటీ? ఆరోగ్య శ్రీ పరిస్థితి ఏమిటీ? ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన రూ.36 వేల కోట్ల బకాయిల పరిస్థితి ఏమిటీ? ఇక తప్పనిసరిగా ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతల పరిస్థితి ఏమిటీ? ఒక వేళ పెట్టాలని అయినా చంద్రబాబు అడుగులు ముందుకు వేస్తే.. ఇలా పెట్టుకుంటూ పోతే రాష్ట్రం ఏం కావాలి? రాష్ట్ర ప్రజలు ఏం కావాలి? వీళ్ల సంక్షేమం, అభివృద్ధి ఏం కావాలి? రాష్ట్రానికి సంబంధించిన మిగిలిన బాధ్యతల పరిస్థితి ఏమిటీ? మిగతా ప్రాంతాలు ఏం కావాలి?.

సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు నిజమే అయితే..:
ఇన్నాళ్లూ ప్రజలను మభ్యపెడుతూ చంద్రబాబు అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్ట్‌ అని అంటున్నాడు. రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా చంద్రబాబునాయుడు మభ్యపెడుతూ వచ్చాడు. నేను అడుగుతున్నా.. అయ్యా చంద్రబాబూ.. సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ ప్రాజెక్ట్‌ అయితే, అమరావతి కోసం ఇప్పటికే కమిటెడ్, గ్రాస్‌ లోన్లు రూ.47 వేల కోట్లు ఎందుకు చేస్తున్నట్లు? లోన్లు కాకుండా రాష్ట్ర బడ్జెట్‌ నుంచి కేటాయింపులు ఎందుకు చేస్తున్నారు? సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్ట్‌ అయితే, రాజధాని కోసం తెస్తున్న రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారెంటీలు ఎందుకు ఇస్తున్నారు? భూములు అమ్మి డబ్బు తెస్తానని చెప్పిన వాడివి, ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ప్రభుత్వ ఖజానాపై ఎందుకు భారం మోపుతున్నారు? సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్ట్‌ అని చెబుతున్న చంద్రబాబు.. ఇప్పటి వరకు అమ్మిన భూములు ఎన్ని? మీ విజనరీ ఆలోచనల ద్వారా అమరావతి ప్రాజెక్ట్‌ నుంచి ఇప్పటి వరకు ఎంత డబ్బులు వచ్చాయి? తన స్కాముల కోసం అమరావతి పేరు చెప్పి, చంద్రబాబు అప్పులు తెస్తున్నాడు. దాని ప్రభావం రాష్ట్రం మీద కనిపిస్తోంది.

మా ప్లాన్‌–ఏ నచ్చలేదు. అందుకే ప్లాన్‌–బీ చెప్పాం:
మేము ప్రాక్టికల్‌గా చేసిన ఆలోచన చంద్రబాబుకు, వారి ముఠాకు నచ్చలేదు. చాలా ప్రాక్టికల్‌గా మేము ప్రజల బాగోగుల కోసం, రాష్ట్రానికి మంచి కోసం చేసిన ఆలోచనలు మీకు నచ్చలేదు. మేము చేసిన ప్లాన్‌–ఏ ఏ మీకు నచ్చలేదు. పోనీ, ప్లాన్‌–బీ ఇచ్చాం కదా.. మేము చెప్పిన ప్లాన్‌ గురించి ఆలోచించారా? అంటే అదీ లేదు. కొద్ది నెలల క్రితం నేను చెప్పాను. మచిలీపట్నం టు విజయవాడ 70 కి.మీ. విజయవాడ టు గుంటూరు మరో 40 కి.మీ. మచిలీపట్నంలో మా హయాంలో ప్రారంభమైన పోర్టు. అందుకు ల్యాండ్‌ ఇచ్చాం, పర్మిషన్లు తెచ్చాం, పనులు మొదలుపెట్టాం, ఫైనాన్షియల్‌ క్లోజర్‌ కంప్లీట్‌ చేశాం. ఎవ్వరితో ప్రమేయం లేకుండా దానికి డబ్బులు వచ్చేలా ఏర్పాట్లు చేశాం. కాబట్టి ఏ ఇబ్బంది లేదు.

మ వి గన్‌:
అందుకే మ వ గన్‌ ప్రతిపాదిస్తున్నాం. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య 110 కి.మీ నేషనల్‌ హైవే ఉంది. ఈ నేషనల్‌ హైవేకు కాస్త అటు, ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్‌ ఏరియా కింద డిక్లేర్‌ చేయండి. మచిలీపట్నం నుంచి ‘మ’ తీసుకోండి, విజయవాడ నుంచి ‘వి’ తీసుకోండి, గుంటూరు నుంచి ‘గన్‌’ (జీయూఎన్‌) తీసుకుని మ వి గన్‌ (జీయూఎన్‌) అని పేరు పెట్టండి. ఒకవేళ గన్‌ అంటే బాగుండదు. అది జగన్‌ అని గుర్తుకు వస్తుంది అనుకుంటే వేరే పేరు పెట్టండి.

నువ్వు అమరావతిలో పెట్టే రూ.2 లక్షల కోట్లు అది అయ్యేది కాదు. సచ్చేది కాదు. ఆ రూ.2 లక్షల కోట్లలో 10 శాతం పెట్టినా చాలు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం, రింగ్‌ రోడ్లు, ఇతరత్రా పనులు కోసం, చిన్న చిన్న మౌలిక సదుపాయాల కోసం 10 శాతం పెట్టినా చాలు. మ వి గన్‌ (జీయూఎన్‌) క్యాపిటల్‌ ప్రాంతం ఫ్యూచర్‌లో ఎకనామిక్‌ ఇంజిన్‌ అవుతుంది.

ఈ ప్రాంతంలో పొటెన్షియల్‌ కూడా ఉంది:
విజయవాడ దాని చుట్టుపక్కల దాదాపుగా 20 లక్షల మంది ప్రజలు ఉన్నారు. గుంటూరులో దాదాపుగా 10 లక్షల మంది ప్రజలు ఉన్నారు. మచిలీపట్నంలో దాదాపుగా 3, 4 లక్షల మంది ప్రజలున్నారు. దాదాపు ఇంత జనాభా ఉన్న 35–40 లక్షల మంది జనాభా ఉన్న ప్రదేశంలో కాస్త ఖర్చు పెడితే అదొక మహానగరంగా అదొక గ్రోత్‌ ఇంజిన్‌ గా ఎదుగుతుంది. అనే ఆలోచన చెప్పినాం.

చంద్రబాబుగారి ఉద్దేశం ఇదే
కానీ, ఇదీ నచ్చలేదు ఎందుకంటే.. దీంట్లో స్కాములు చేయలేరు. నిజానికి అమరావతి పూర్తయ్యే నాటికి ఎన్ని లక్షల కోట్లు అవుతుందో, ఎన్ని సంవత్సరాలు, దశాబ్దాలు పడుతుందో చెప్పలేం. సాధ్యం కానిది, పెట్టలేరని తెలిసి కేవలం నీ స్వార్థం కోసం నువ్వు, నీ బినామీల ఆస్తుల విలువను పెంచుకునే దాని కోసం రాష్ట్రం మీద భారం మోపుతూ అప్పులు తీసుకొస్తూ, రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి.. రాష్ట్రాన్ని అంధకారంలోకి, అప్పుల ఊబిలోకి నెట్టేసే కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు.

కేవలం 200 ఎకరాల రాజధాని!:
మొన్న అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడింది చూస్తే.. ప్రజలకు పూర్తిగా ఒక విషయం అర్థమైపోయింది. లక్షల ఎకరాల అమరావతి లేదని, నవ నగరాలు లేవని, ఎయిర్‌ పోర్టు లేదని, రైల్వే స్టేషన్‌ లేదని, ఇంటర్నేషనల్‌ స్టేడియం లేదని చంద్రబాబు మాటల్లోనే స్పష్టంగా చెప్పాడు. నారాయణను అడిగినాడంట ఈయన.. నారాయణ ఈయనకు చెప్పినాడంట.. ట్రంక్‌ ఇన్ఫ్రా 2022 మే 27కు అయిపోతుందంట, లే అవుట్లన్నీ 2028 మే 27కు అయిపోతుందంట, 5 టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు 2028 ఆగస్టు నాటికి పూర్తవుతాయట. ఈ మాటలన్నీ ఎవరు చెప్పారు, నారాయణను అడిగితే నారాయణ చంద్రబాబుకు చెప్పాడట. చివరికి లక్ష ఎకరాల రాజధాని కాస్తా 200 ఎకరాలకు వచ్చింది.

చంద్రబాబుది ఆచరణాత్మక ధోరణి కాదు:
మరి 200 ఎకరాల్లోనే రాజధాని నిర్మించేట్టుగా అయితే ఇంక ఆ మారుమూల ప్రాంతానికి ఎందుకు పోయినావు స్వామీ, జనసంచారం లేని ఆ ప్రాంతానికి ఎందుకు పోయినావు స్వామీ. హైవే పక్కన విజయవాడ–గుంటూరు–మచిలీపట్నం మధ్యలో ఎక్కడ కట్టినా గానీ బ్రహ్మాండంగా డెవలప్‌ అయ్యుండేది కదా? రాజధాని విషయంలోనే కాదు ఏ విషయంలో కూడా చంద్రబాబుకు ఆచరణాత్మక ధోరణి అన్నది ఎప్పుడూ లేదు. ఎప్పుడూ ఆయన ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా ఉంటాడు. నిజంగా ఆయనలో ప్రాక్టికల్‌ సెన్స్‌ ఉన్నింటే ఆచరణాత్మక ధోరణి ఉన్నింటే ఈ పాటికి రాజధాని వచ్చేసి ఉండేది. పనులు అయిపోయి ఉండేవి. హైవే పక్కన కట్టి ఉంటే అయిపోయేది. ఈపాటికి గ్రోత్‌ ఇంజిన్‌ లా ఎదిగి ఉండేది, ఆ బీజాలు పడి ఉండేవి.

మా మాటలన్నీ నిజం. అదే మా తాపత్రయం:
నేను ఇదివరకే చెప్పాను. మాకు ఏ ప్రాంతమన్నా కూడా వ్యతిరేకత లేదని. మరొక్కసారి మళ్లీ మళ్లీ చెబుతున్నాను. చంద్రబాబు తన స్కాముల కోసం ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నాడు తప్ప దీంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు. నేను చెప్పిన ప్రతి మాటా కూడా ప్రాక్టికల్‌ గా ఆలోచన చేస్తే ఎవరికైనా కూడా జగన్‌ చెప్పేది నిజమే కదా అనిపించే మాటలే. మేం తాపత్రయపడిందల్లా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేవు అన్న నిజాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలకు మనసులో పెట్టుకుని సంక్షేమం, అభివృద్ధి రెండూ కూడా రాష్ట్రంలో కొనసాగిస్తూ సత్వరమే ఒక గ్రోత్‌ ఇంజిన్‌ లాంటి నగరాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందనే మౌలిక లక్ష్యాన్ని అప్పుడూ చెప్పాం, ఇప్పుడూ చెబుతున్నాం.

ఎప్పుడైనా మాది ఒకే మాట. రాజధాని విషయంలో మేం ఇచ్చిన సలహాను ఈ ప్రభుత్వం పక్కన పెట్టిన నేఫథ్యంలో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అనేది పూర్తిగా పక్కకు పోయిన నేపథ్యంలో కేవలం అప్పుల మీదే రాజధాని పనులు ఆధారపడ్డ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు, లక్ష ఎకరాల అమరావతిలో కేవలం రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ, నీళ్లు, కరెంటు కోసమే ఇంత డబ్బు పెడితే ఇక ప్రజలు, రాష్ట్రం ఏం కావాలి? అని మరొక్కసారి ప్రశ్నిస్తున్నా.

అన్నీ బయట పడతాయి. వెలుగులోకి వస్తాయి:
చంద్రబాబుకు ఒకటే చెబుతున్నా. చంద్రబాబు చేస్తున్న ఈ స్కాములు, ఈదోపిడీలు ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. రాజధాని పేరుతో ప్రజలను పణంగా పెట్టి కేవలం దోపిడీయే ఆలోచనతో తాను చేస్తున్నవన్నీ కూడా వెలుగులోకి కచ్చితంగా వస్తాయి. రానున్న రోజుల్లో రాజధానికి సంబంధించిన ప్రతి పనిలో కూడా చంద్రబాబు ఎంతెంత మెక్కుతున్నారో అవన్నీ కూడా ఈరోజు చెప్పినట్టుగానే సాక్ష్యాధారాలతో మళ్లీ మళ్లీ చెబుతూనే ఉంటాం. చంద్రబాబునాయుడుకు దేవుడు గట్టిగా మొట్టికాయలు వేస్తాడు. ఇంకా ప్రజలు కూడా త్వరలోనే మొట్టికాయలు వేసే రోజు వస్తుంది. తాను చేస్తున్న ఇంత అన్యాయపు ధోరణి వల్ల చంద్రబాబుకు అవి తప్పవు. రాబోయే రోజుల్లో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక లోతైన విచారణ చేస్తామని, తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదని జగన్‌ వివరించారు.

ఇవీ చ‌ద‌వండి:  YS Jagan Tweet: హలో ఇండియా.. ఏపీలో నో పోలీస్‌, నో పోలీస్‌, నో పోలీస్‌.. వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న ట్వీట్
YS Jagan: నియోజకవర్గాల పెంపుపై వైఎస్ జ‌గ‌న్ హాట్ కామెంట్స్.. సీట్ల పెంపు, మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ల‌పై..
YS Jagan on Putta Mahesh: టీడీపీ ఎంపీ పుట్టా మ‌హేష్ పై వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. 
YS Jagan Press meet: రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక విధ్వంసం.. ‘కాగ్‌’ నివేదిక కూడా తేల్చిన నిజం: జ‌గ‌న్ ధ్వ‌జం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు