HomeAstrologyLakshmi Panchami 2026: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎలా పూజించాలి?

Lakshmi Panchami 2026: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎలా పూజించాలి?

Lakshmi Panchami 2026: హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవిని సంపద, ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు. చైత్ర మాసంలో వచ్చే లక్ష్మీ పంచమి రోజున ఆమెను పూజించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు భక్తులు భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే ధనసంపదలు పెరిగి కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని నమ్మకం. 2026లో మార్చి 23న వచ్చే లక్ష్మీ పంచమికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పండితులు చెబుతున్నారు.

ఈ పవిత్ర దినాన లక్ష్మీదేవి భూమిపైకి వచ్చి తన భక్తులను ఆశీర్వదిస్తుందని పురాణాల్లో ప్రస్తావించబడింది. అందుకే ఈ రోజు పూజలు, దానధర్మాలు చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగి ఐశ్వర్యం పెరుగుతుందని విశ్వాసం.

లక్ష్మీ పంచమి పూజా విధానం
లక్ష్మీ పంచమి రోజున ఉదయం తొందరగా నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. తర్వాత తలస్నానం చేసి పూజకు సిద్ధం కావాలి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, బియ్యప్పిండితో ముగ్గులు వేయడం శుభసూచకం. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు.

పూజ కోసం లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహాన్ని చెక్క పీఠంపై ఉంచాలి. ఎర్రటి వస్త్రం పరచి గులాబీ పూలతో అలంకరించడం మంచిది. రాగి లేదా ఇత్తడి కలశంలో నీళ్లు పోసి, పసుపు కుంకుమ వేసి పైభాగంలో కొబ్బరికాయను ఉంచాలి. ముందుగా గణపతిని పూజించి తర్వాత లక్ష్మీదేవిని ఆరాధించాలి.

పూజ సమయంలో “ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః” అనే మంత్రాన్ని జపిస్తూ పూలు, అక్షింతలు సమర్పించాలి. ఆవు నెయ్యితో వెలిగించిన దీపాల ముందు పూజ చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. నైవేద్యంగా పాలు పొంగించి చేసిన పరమాన్నం లేదా స్వీట్లు సమర్పించడం మంచిది.

లక్ష్మీ పంచమి రోజున చేయాల్సిన పరిహారాలు
అప్పుల సమస్యలు తగ్గాలంటే:
నెయ్యి దీపంలో రెండు లవంగాలు వేసి లక్ష్మీదేవి ముందు వెలిగిస్తే అప్పుల బాధలు క్రమంగా తగ్గుతాయని విశ్వాసం.

ఆకస్మిక ధనలాభం కోసం:
తమలపాకుపై కర్పూరం వెలిగించి హారతి ఇస్తే ధనలాభం కలుగుతుందని చెబుతారు.

కుటుంబ శ్రేయస్సు కోసం:
ఇంట్లో పూజ చేసే స్త్రీలు తమ మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకుని పూజిస్తే భర్త ఆయుష్షు, ఆదాయం పెరుగుతాయని నమ్మకం.

ధనధాన్య వృద్ధికి చేయాల్సిన పనులు
లక్ష్మీ పంచమి రోజున పేదలకు బియ్యం లేదా ధాన్యాన్ని దానం చేస్తే సంవత్సరం అంతా ఆర్థికంగా అభివృద్ధి ఉంటుందని విశ్వాసం. అలాగే గోవుకు పచ్చిగడ్డి తినిపించి నమస్కారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజు చిన్నగా అయినా బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, వాహనాలు కొనుగోలు చేయడం, గృహప్రవేశాలు చేయడం వంటి శుభకార్యాలు చేయడం మంచిదని విశ్వసిస్తారు.

సమస్యల నివారణకు ఆచరించాల్సిన నియమాలు
ఇంటి శుభ్రతకు రాళ్ల ఉప్పు నీటితో తుడవడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం, తులసిని పూజించడం వల్ల ఆర్థికాభివృద్ధి కలుగుతుందని నమ్మకం. పూజ గదిలో ఐదు పసుపు కొమ్ములను లక్ష్మీదేవి ముందు ఉంచి తర్వాత వాటిని పర్సులో లేదా బీరువాలో ఉంచితే ఐశ్వర్యం పెరుగుతుందని విశ్వాసం. అలాగే ఇంటి గుమ్మం నుండి పూజ గది వరకు బియ్యప్పిండితో లక్ష్మీదేవి పాదముద్రలు వేయడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగిస్తే అష్ట దరిద్రాలు తొలగి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని అంటారు.

వాస్తు దోషాల నివారణ
ఇంటి ఈశాన్యం మూలలో కొద్దిగా కళ్ళు ఉప్పును ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగి సంపద పెరుగుతుందని విశ్వాసం. అలాగే పూజ సమయంలో సాంబ్రాణి పొగ వేయడం ఇంటిలో సానుకూల శక్తిని పెంచుతుందని చెబుతారు.

ఆహార నియమాలు
లక్ష్మీ పంచమి ముందు రోజు సాదా పెరుగు అన్నం తినడం శుభప్రదం. పంచమి రోజున మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి లేని సాత్వికాహారం తీసుకోవడం మంచిది.

ఈ రోజు తప్పక చేయాల్సినవి
లక్ష్మీ పంచమి రోజున కనకధారా స్తోత్రం పఠించడం, ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను కట్టడం, నెయ్యి దీపం వెలిగించడం వంటి ఆచారాలు చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని విశ్వాసం.

ఈ పవిత్ర రోజున భక్తితో లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆర్థిక సమస్యలు తొలగి కుటుంబంలో ఐశ్వర్యం, శాంతి, సంతోషం పెరుగుతాయని హిందూ సంప్రదాయం చెబుతోంది.

ఇవీ చ‌దవండి: Simhachalam Sri Varaha Lakshmi Narasimha Swamy Temple: సింహాచలం అప్ప‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్.. డిజిటల్ సేవలు ప్రారంభం.. కియోస్క్‌లతో క్షణాల్లో దర్శన టికెట్లు
Manchu Lakshmi: ‘పుష్పలోని ఫైర్ డైలాగ్ ముందే మా సినిమాలో ఉంది’.. మంచు లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు