HomeTelanganaAdilabad News: వరకట్నానికి నో.. ఆడంబరాలకు దూరం – ఆదిలాబాద్ కొలాం తెగ గొప్ప నిర్ణయం

Adilabad News: వరకట్నానికి నో.. ఆడంబరాలకు దూరం – ఆదిలాబాద్ కొలాం తెగ గొప్ప నిర్ణయం

Adilabad News: సమాజంలో పెళ్లిళ్లు రోజు రోజుకు ఖర్చులు, ఆడంబరాలతో భారంగా మారుతున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ కొలాం తెగ ఒక ఆదర్శ నిర్ణయం తీసుకుంది. తమ పిల్లల పెళ్లిళ్లలో వరకట్నం తీసుకోవడం లేదా ఇవ్వడం పూర్తిగా నిషేధిస్తూ, ఆడంబరాలకు దూరంగా సాదాసీదాగా వివాహాలు జరపాలని గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

ఈ నిర్ణయం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని న్యూ టెంబ్రీగూడ గ్రామంలో తీసుకున్నారు. బేల, జైనథ్, సాత్నాల మండలాలకు చెందిన కొలాం సంఘం పెద్దలు, పూజారులు, గ్రామస్థులు కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించి పెళ్లిళ్ల విషయంలో అనుసరించాల్సిన నియమాలను ఖరారు చేశారు.

వరకట్నం పూర్తిగా నిషేధం
ఈ సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయం వరకట్నాన్ని పూర్తిగా నిరాకరించడమే. తమ తెగలో ఎవరూ వరకట్నం ఇవ్వకూడదని, తీసుకోకూడదని కుల పెద్దలు స్పష్టంగా పేర్కొన్నారు. వరకట్నం కారణంగా కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోవడం, సామాజిక సమస్యలు తలెత్తడం వంటి పరిణామాలను నివారించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సాదాసీదా ఎంగేజ్‌మెంట్, పెళ్లి
పెళ్లికి ముందు జరిగే ఎర్రబొట్టు (ఎంగేజ్‌మెంట్) కార్యక్రమాన్ని కూడా సాదాసీదాగా నిర్వహించాలని సూచించారు. పెళ్లిళ్లు ఖర్చుతో కూడుకున్న వేడుకలుగా కాకుండా సంప్రదాయబద్ధంగా, సాంప్రదాయ పద్ధతుల్లో జరగాలని కుల పెద్దలు నిర్ణయించారు. పెళ్లి పందిరి కూడా పాత సంప్రదాయాల ప్రకారం ఏర్పాటు చేయాలని, ప్రకృతి కి ప్రాధాన్యత ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

మద్యం, గంజాయి, డీజేలకు నిషేధం
పెళ్లి కార్యక్రమాల్లో మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలు పూర్తిగా నిషేధించాలని నిర్ణయించారు. అలాగే పెళ్లిళ్లలో డీజే సౌండ్ సిస్టమ్‌లకు కూడా అనుమతి లేదని ప్రకటించారు. వాటి స్థానంలో కొలాం సంప్రదాయ వాయిద్యాలైన డోలు, పెంప్రీ వంటి వాయిద్యాలతోనే వేడుకలు జరపాలని సూచించారు. దీంతో సంప్రదాయ సంస్కృతి కాపాడటంతో పాటు యువతకు మంచి సందేశం వెళ్లేలా ఉంటుందని తెలిపారు.

నియమాలు పాటించకపోతే చర్యలు
ఈ నియమాలను కచ్చితంగా పాటించాలని గ్రామస్థులకు సూచించారు. ఎవరైనా ఈ నిర్ణయాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కుల పెద్దలు హెచ్చరించారు. సమావేశంలో పాల్గొన్న వారందరితో ఈ నిర్ణయాలను పాటిస్తామని ప్రతిజ్ఞ కూడా చేయించారు.

సమాజానికి ఆదర్శంగా
కొలాం తెగ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వరకట్నం, ఆడంబరాలకు దూరంగా సంప్రదాయ పద్ధతిలో వివాహాలు జరపాలని తీసుకున్న ఈ నిర్ణయం ఇతర సమాజాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చ‌ద‌వండి: Telangana Govt News: గురుకుల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి.. హెల్త్ కమాండ్ సెంటర్‌తో రేవంత్ సర్కార్ కొత్త చర్యలు
Telangana Funds: తెలంగాణ గ్రామ పంచాయతీలకు భారీ నిధులు… కేంద్రం నుంచి రూ.11 వేల కోట్లకు పైగా విడుదల
Telangana Farmers: వ్యవసాయంలో డ్రోన్ విప్లవం.. భారీ సబ్సిడీతో రైతులకు ఆధునిక సాంకేతిక సహాయం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు