HomeAndhra PradeshYS Jagan Press meet: రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక విధ్వంసం.. ‘కాగ్‌’ నివేదిక కూడా తేల్చిన...

YS Jagan Press meet: రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక విధ్వంసం.. ‘కాగ్‌’ నివేదిక కూడా తేల్చిన నిజం: జ‌గ‌న్ ధ్వ‌జం

YS Jagan Press meet: రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం కొనసాగుతోందని, రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ తర్వాత, తాము ప్రెస్‌మీట్‌లో ప్రస్తావించిన అనేక అంశాలు పూర్తిగా వాస్తవమని, కాగ్‌ నివేదిక కూడా తేల్చిందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఒకవైపు ఆదాయాలు పడిపోవడం, మరోవైపు రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు విపరీతంగా పెరగడం వల్ల, ఆర్థిక రంగం పూర్తిగా కుదేలైందని ఆయన తెలిపారు. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడి కొనసాగుతోందని, అధికార పక్షం ఏ ఒక్కదాన్ని వదలిపెట్టకుండా అన్నీ దోచుకుంటోందని చెప్పారు. గతంలో తాము అమలు చేసిన పథకాలన్నీ నిలిపి వేయడం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

మరోవైపు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు 16 రోజులు జరిగినా, ఏ రోజూ ప్రజా సమస్యలపై చర్చ జరగలేదని శ్రీ వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు. అన్నీ తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారమే అని, ఏమీ చేయకపోయినా అన్నీ చేసినట్లు బిల్డప్‌ ఇవ్వడమే కాకుండా.. మొత్తం ‘ఆత్మస్తుతి..పరనింద’ అన్నట్లుగా సెషన్‌ సాగిందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికి మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా, సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్‌తో సహా ఏ పథకాలు అమలు చేయడం లేదని గుర్తు చేశారు.

పరిమితికి మించి అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, రాష్ట్రాన్ని దారుణ ఆర్థిక దుస్థితిలోకి నెట్టేస్తోందని శ్రీ వైయస్‌ జగన్‌ తెలిపారు. తమ ప్రభుత్వం రెండేళ్లు కోవిడ్‌ ఉన్నా, ఆ 5 ఏళ్లలో చేసిన అప్పును, ఈ కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే చేసిందని చెప్పారు. అతి ముఖ్యమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను చంద్రబాబు ప్రభుత్వం సర్వనాశనం చేసిందని అన్నారు. ఏ ఒక్క వర్గానికి మేలు చేయకపోయినా, హామీలు అమలు చేయకపోయినా అంత అప్పు చేయడం దారుణమన్నారు. YS Jagan Press meet

ప్రెస్‌మీట్‌లో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

ఆరోజు మేం చెప్పిందే ‘కాగ్‌’ రూఢీ చేసింది
ఏ ప్రభుత్వానికి అయినా 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టింది. అంటే మెజారిటీ సమయం అయిపోయింది. ఇటీవలి శాసనసభ సమావేశాలు 16 రోజులు జరిగాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో మోసాలు, అబద్ధాలు కనిపించాయి తప్ప, ఎలాంటి మేలు ప్రజలకు లేదు. పైగా ప్రజలను ఈ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై గత నెల 19న నేను మాట్లాడాను. ఆరోజు నేను ఏదైతే మాట్లాడానో.. ఆ తర్వాత కాగ్‌ నివేదిక కూడా అవే విషయాలను రూఢీ చేసింది. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక విధ్వంసాన్ని కాగ్‌ నివేదిక చూపింది.

చంద్రబాబు ఆర్థిక విధ్వంసం. కొన్ని ఉదాహరణలు
మా ప్రభుత్వం చివరి ఏడాది.. 2023–24, అలాగే చంద్రబాబు తొలి ఏడాది 2024–25 రెండింటినీ పోలిస్తే, అనేక విషయాలు స్పష్టమవుతాయి. 2023–24లో మా ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు రూ.2,36,486.61 కోట్లు కాగా, ఆ ఏడాది ప్రభుత్వ ఆదాయం రూ.1,73,767 కోట్లు. అప్పుడు రెవెన్యూ లోటు రూ.36,682 కోట్లు కాగా, ద్రవ్య లోటు రూ.62,719 కోట్లు. అదే చంద్రబాబు తొలి ఏడాది 2024–25లో దారుణ పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఏడాది ప్రభుత్వ వ్యయం రూ.2,49,096 కోట్లు కాగా, ప్రభుత్వ ఆదాయం రూ.1,68,024.85 కోట్లు మాత్రమే. మరోవైపు రెవెన్యూ లోటు రూ.60,285 కోట్లు కాగా, ద్రవ్య లోటు రూ.81,071.18 కోట్లు. అంటే ఒక్క ఏడాదిలోనే రెవెన్యూ లోటు 55.84 శాతం పెరగ్గా, ద్రవ్య లోటు (అంటే అప్పు) 29.26 శాతం పెరిగింది.  ఇంత జరిగినా, కనీస పథకాలు, హామీల అమలు లేదు. సూపర్‌సిక్స్, సూపర్‌ సెవెన్‌ గాలికెగిరిపోయాయి. చంద్రబాబుగారి హయాంలో ఇంత దారుణ పరిస్థితి.

ఆ తర్వాత కూడా.. అంటే 2024–25 తర్వాత కూడా ద్రవ్యలోటు క్రమంగా పెరుగుతూనే ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 2025–26 ఆర్థిక సంవత్సరంలో పది నెలల వరకు చూస్తే.. ద్రవ్యలోటు మా 5 ఏళ్ల హయాంలో కూడా ఎన్నడూ లేనంత విధంగా చంద్రబాబు హయాంలో దారుణంగా పెరిగింది. అప్పుడు మా హయాంలో రెండేళ్లు కోవిడ్‌ ఉంది. పైగా మేము అన్ని హామీలు అమలు చేసి చూపాం. YS Jagan Press meet

మొత్తం వ్యయంలో అప్పుల శాతం పోలిక
రాష్ట్ర ప్రభుత్వ మొత్తం వ్యయంలో అప్పుల శాతం. దీనికి సంబంధించి రెండు ప్రభుత్వాల మధ్య పోలిక చూస్తే.. మా ప్రభుత్వ హయాంలో తొలి ఏడాది 2019–20లో అది 25.59 శాతం. 2020–21 కోవిడ్‌ సమయంలో కాస్త పెరిగి 31.82 శాతానికి చేరింది. ఆ మరుసటి ఏడాది 2021–22లో దాన్ని నియంత్రించాం. 14.08 శాతానికి తగ్గించాం. 2022–23లో కూడా అది 24.97 శాతం కాగా, మా ప్రభుత్వ చివరి ఏడాది 2023–24లో కూడా ప్రభుత్వ మొత్తం వ్యయంలో ద్రవ్యలోటు 26.52 శాతం. అదే చంద్రబాబుగారి హయాంలో తొలి ఏడాది 2024–25లో ఏకంగా ఎలాంటి స్కీములూ లేకపోయినా, సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ లాంటి పథకాలేమీ లేకపోయినా, మేము అమలు చేసిన పథకాలన్నీ ఆపేసినా కూడా.. ప్రభుత్వ మొత్తం వ్యయంలో ద్రవ్యలోటే ఏకంగా 32.55 శాతానికి పెరిగింది. ఇంకా ఈ ఏడాది 2025–26లో తొలి 10 నెలల్లో అది ఏకంగా 39.74 శాతానికి ఎగబాకింది.

జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు. గణాంకాలు
అంతే కాకుండా 2024–25లో రాష్ట్ర జీడీపీలో ద్రవ్యలోటు చూస్తే అది కూడా దారుణంగా ఉంది. చంద్రబాబు సీఎం అయిన తర్వాత తొలి ఏడాదిలో రాష్ట్ర జీడీపీలో ద్రవ్యలోటు (అప్పుల శాతం) ఏకంగా 5.08 శాతం. అదే మా ప్రభుత్వ హయాంలో ఆ 5 ఏళ్లలో చూస్తే, అప్పుడు రాష్ట్ర జీడీపీలో సగటు ద్రవ్యలోటు కేవలం 4.11 శాతం మాత్రమే. నిజానికి మా ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్‌. దాంతో అనుకోని ఖర్చులు పెరిగాయి. అలాంటి విపత్కర పరిస్థితులు. ఇంకా తుచ తప్పకుండా మ్యానిఫెస్టో కూడా అమలు చేశాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడిపించే విషయంలో చంద్రబాబుగారి విధ్వంసపు రికార్డుకు ఇవి నిజంగా చిత్రపటాలుగా నిలబడతాయి.

అందులో చంద్రబాబుది విధ్వంస రికార్డు
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో చంద్రబాబుగారిది ఒక విధ్వంస రికార్డు. నెట్‌ బారోయింగ్‌ సీలింగ్‌ (ఎన్‌బీసీ). దీన్ని ంద్రం చూస్తుంది. ఏ రాష్ట్రం అయినా ఎన్‌బీసీకి లోబడి అప్పు చేయాలి. కానీ, చంద్రబాబు ప్రతి ఏడాది దాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించడమే కాకుండా.. తనకు తాను మంచి పరిపాలన దక్షుడినని పెద్ద బిల్డప్‌ కూడా ఇస్తున్నారు. నాడు 2014–19 మధ్య కూడా చంద్రబాబు ఎన్‌బీసీ పరిధిని దాటి రూ.29,099 కోట్లు ఎక్కువ అప్పు చేశారు. అదే మా ప్రభుత్వ హయాంలో 2019–24 మధ్య ఎన్‌బీసీ పరిమితి కన్నా రూ.12,707 కోట్లు తక్కువ అప్పు చేశాం.

ఆ తర్వాత 2024లో చంద్రబాబు మళ్లీ సీఎం కాగానే సీన్‌ రివర్స్‌. 2024–25లో ఎన్‌బీసీ పరిమితిని మించి రూ.17,953 కోట్లు ఎక్కువ అప్పు చేశారు. ఇక 2025–26లో పరిస్థితి చూస్తే ఇంతకన్నా ఘోరంగా ఉంది. ఈ రెండేళ్లలో చంద్రబాబుగారు తెచ్చిన అప్పులు, కుదుర్చుకున్న అప్పులు.. అన్నీ కలిపి ఎంత అని చూస్తే ఇప్పటికే రూ.3.20 లక్షల కోట్లు దాటాయి. YS Jagan Press meet

మా ప్రభుత్వ హయాంలతో ఆ 5 ఏళ్లలో మేం మొత్తం రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే, ఈ రెండేళ్లలోనే చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు రూ.3,20 లక్షల కోట్లు దాటాయి. అన్నింటికీ ఆధారాలు, జీఓలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ రెండేళ్లలోపే చంద్రబాబు ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు ఏకంగా రూ.3,20,454 కోట్లు. మరి ఎవరిది ఆర్థిక విధ్వంసం?

ప్రభుత్వ ఆదాయం ఎందుకు తగ్గుతోంది?
చంద్రబాబుగారి హయాంలో రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు ఎందుకు పెరుగుతున్నాయి? అవి మా హయాంలో ఎందుకు నియంత్రణలో ఉన్నాయి అని చూస్తే.. ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రావడం లేదు. విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ అవినీతి. మొత్తం దోచుకో. పంచుకో.  తినుకో. (అదే డీపీటీ). అందరూ జాయింట్‌గా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు పెరగడం లేదు. రాష్ట్రానికి రావాల్సిన వనరులు  రావడం లేదు. చంద్రబాబుగారు, ఆయన బినామీలు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఆయన ఎల్లో మీడియా సహచరులు అంతా దోచుకో. తినుకో. పంచుకో. దేన్నీ వదలడం లేదు. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్‌›్జ, లేటరైట్, గ్రానైట్‌.. చివరకు లిక్కర్‌ను కూడా వదలడం లేదు. భూములను వదలడం లేదు. అధిక రేట్లకు పీపీఏలు. ఇలా అన్నింటా దోపిడీ. మరి ప్రభుత్వానికి ఆదాయాలు ఎలా వస్తాయి? సంక్షేమం, అభివృద్ధి ఎలా నడుస్తుంది? అంతా దోచేస్తుంటే.. ఎన్ని అప్పులు తెచ్చినా కూడా ఎలా సరిపోతాయి?

అడ్డగోలుగా భూపందేరాలు
ఏ స్థాయిలో వీరి దోపిడీ ఉందంటే.. విశాఖలో రూ.5 వేల కోట్ల విలువైన భూమిని చంద్రబాబుగారు దగ్గరుండి తన సమీప బంధువుకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయి? ఆశ్చర్యం కలిగించే విషయం ఇది. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు శనక్కాయులు, బెల్లాన్ని పంచి పెట్టినట్లు అతి తక్కువ రేట్లకు భూములను ఇస్తున్నారు. భూములు ఇవ్వడమే కాకుండా వారు నిర్మాణం చేసిన దాంట్లో ప్రతి చదరపు అడుగుకు (ఎస్‌ఎఫ్‌టీ) రూ.2 వేలు కంపెనీలకు ఎదురు ఇస్తారంట!. ఇలాంటి స్కాములు జరుగుతుంటే రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయి?.

అధ్వాన్న ఆర్థిక పరిస్థితికి మరో ఉదాహరణ:
చంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక పనితీరు అధ్వానం అని చెప్పడానికి మరో ఉదాహరణ. సాధారణంగా ట్రెజరీలో కనీస క్యాష్‌ బ్యాలెన్స్‌ ఉండాలి. ఆ మినిమం క్యాష్‌ బ్యాలెన్స్‌ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌లో లేకపోతే, అది వెంటనే స్పెషల్‌ డ్రాయింగ్‌ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్‌)కు దారి తీస్తుంది. ప్రభుత్వ ఖజానాలో ఎప్పుడైతే డబ్బులు లేకుండా పోతాయో, మొదట ఎస్‌డీఎఫ్‌ ట్రిగ్గర్‌ అవుతుంది.. ఈ ఎమౌంట్‌ కూడా దాటిపోతే వడ్డీతో సహా చేబదులు (వేస్‌ అండ్‌ మీన్స్‌ ఎక్కౌంట్‌–డబ్లు్యఎంఏ) ట్రిగ్గర్‌ అవుతుంది. అది కూడా దాటిపోతే, అప్పుడు ఓవర్‌ డ్రాఫ్ట్‌ (ఓడీ)కి వెళ్లిపోతాం. ఇవన్నీ కూడా రకరకాల వడ్డీతో కూడిన విధానాలు. ట్రెజరీలో మినిమం బ్యాలెన్స్‌ లేకపోతే ఈ పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటే.. ఏ కష్టాలు కూడా చంద్రబాబుగారి హయాంలో లేనప్పటికీ 2024–25లో అలా ట్రెజరీలో మినిమం బ్యాలెన్స్‌ ఉన్నది కేవలం 8 రోజలు మాత్రమే. అంటే 365 రోజులకు 357 రోజులు ట్రెజరీలో మినిమం బ్యాలెన్స్‌ కూడా పెట్టలేదు.

అప్పులు దాచి పెడుతున్నారు. ఫిర్యాదు చేస్తాం
ఒకవైపు గత మా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు. మరోవైపు విపరీతంగా అప్పులు. పైగా ఆ అప్పులను దాచే ప్రయత్నం చేస్తున్నారు.  2024–25లో చంద్రబాబు వాస్తవంగా చేసిన అప్పులు ఏకంగా రూ.81,082 కోట్లు. ఇది కాగ్‌ నివేదికలో కూడా స్పష్టంగా ఉంది. అందులో స్టేట్‌మెంట్‌–6లో చూపారు. కానీ, చంద్రబాబుగారు అసెంబ్లీలో ఆ అప్పును కేవలం రూ.60,485 కోట్లుగా చూపారు. అలా పూర్తిగా తప్పుడు సమాచారం ఇచ్చి, రూ.20 వేల కోట్ల అప్పును దాచి పెట్టారు. దీని మీద కేంద్ర క్యాబినెట్‌ సెక్రటరీకి లేఖ రాస్తున్నాం. ఇలా దగ్గరుండి సభను తప్పుదోవ పట్టించడం తప్పు. అందుకే దీనిపై డీఓపీటీ, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి కూడా లేఖ రాస్తున్నాం.

పైన ప్రస్తావించినవి డైరెక్ట్‌ అప్పులు కాగా, 2024–25లో బడ్జెట్‌యేతర అప్పుల వివరాలు కావాలని, మండలిలో మేము లిఖితపూర్వకంగా కోరితే, దాటవేశారు తప్ప, వివరాలు ఇవ్వలేదు. అనేక సంస్థల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో అప్పులు చేశారు. అందుకు జీఓలు కూడా ఇచ్చారు. అన్నీ దొంగచాటు వ్యవహారాలు.16 రోజలు అసెంబ్లీ సమావేశాలు చూస్తే, తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారం, సొంత డబ్బా తప్ప, ప్రజలకు ఒరిగిందేమీ లేదు.
అంతా ఆత్మస్తుతి. పరనింద. YS Jagan Press meet

మళ్లీ అడుగుతున్నాం. ఇప్పుడైనా సమాధానం చెబుతారా?
మీ బడ్జెట్‌ తర్వాత కొన్ని ప్రశ్నలు వేశాం. వాటికి ఇప్పటికీ సమాధానం రాలేదు. బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి. అందుకే మళ్లీ అడుగుతున్నాం. ఇప్పటికి మూడు బడ్జెట్లు అయిపోయాయి. సూపర్‌సిక్స్‌లో చెప్పిన యువగళం పథకం ఏమైంది? ప్రతి నిరుద్యోగికి ఇప్పటి వరకు మీరు నెలకు రూ.3 వేల చొప్పున మొత్తం రూ.1.08 లక్షలు బాకీ. అది ఎప్పుడిస్తున్నారు? 18 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 చొప్పున, జూన్‌ 2024 నుంచి ఇస్తామన్నారు. అంటే ఏడాది రూ.18 వేలు. అలా మూడేళ్లలో ప్రతి మహిళకు ఏకంగా రూ.54 వేలు బాకీ. ఓటర్ల జాబితా చూస్తే.. రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉండగా, వారిలో 60 ఏళ్లు నిండిన వారిని తీసేస్తే మిగిలేది 1,78,99,440 మంది ఉన్నారు. మరి వీరందరికీ ఇప్పటి వరకు ఒక్కొక్కరికి రూ.54 వేలు బాకీ. మరి ఎప్పుడిస్తున్నారు?. ఇంకా సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్‌లో మరో హామీ. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నెలకు రూ.4 వేల చొప్పున పెన్షన్‌ ఇస్తామన్నారు. ఏడాదికి రూ.48 వేల చొప్పున మూడేళ్లకు ఒక్కొక్కరికి రూ.1.44 లక్షలు.

నెలకు 25 వేల పెన్షన్లు కట్‌
2024లో ఎన్నికల నాటికి, అంటే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ఇచ్చిన పెన్షన్లు 66,34,372 కాగా, వీరు ఈ మార్చిలో మీరు ఇచ్చిన పెన్షన్లు 60,69,663. అదే గత నెల, అంటే ఫిబ్రవరిలో మీరు ఇచ్చిన పెన్షన్లు 60,96,108 కాగా, ఈ మార్చిలో ఇచ్చిన పెన్షన్లు 60,69,663. అంటే 25 వేల పెన్షన్లు కట్‌ చేశారు. కొత్తగా ఒక్క పెన్షన్‌ ఇవ్వలేదు. 2.5 లక్షల అప్లికేషన్లు పెండింగ్‌. మా ప్రభుత్వ హయాంలో ప్రతి 6 నెలలకు కొత్త పెన్షన్లు ఇచ్చేవాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 5,64,709 పెన్షన్లు కట్‌ చేశారు.

ఇప్పుడు బడ్జెట్‌ కేటాయింపు చూస్తే, ఇంకా కోతకు సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈనెల ఇచ్చిన 60,69,663 పెన్షన్ల కోసం ఈ ఏడాది కావాల్సిన మొత్తం రూ.31,554 కోట్లు కాగా, బడ్జెట్‌లో రూ.27,719 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే, రాబోయే రోజుల్లో మరో 7,45,993 పెన్షన్లు కట్‌ చేస్తామని చెప్పకనే చెబుతున్నారు.

తల్లికి వందనం. మరో మోసం
అమ్మ ఒడి. అదే తల్లికి వందనం మొదటి ఏడాది ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడిస్తారని అడిగితే చెప్పలేదు. రెండో ఏడాది ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు పథకాన్ని దక్కకుండా చేశారు. మా ప్రభుత్వ హయాంలోని చివరి ఏడాది 2023–24లో యూడీఐఎస్‌ఈ (యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం ఫర్‌ ఎడ్యుకేషన్‌) ప్రకారం 87,41,885 పిల్లలకు ఇవ్వాల్సిన దాంట్లో  ఏకంగా 20 లక్షలు తగ్గించారు. అదీ కాకుండా ఏ ఒక్కరికీ రూ.15 వేలు ఇవ్వలేదు. మరీ దారుణంగా కొందరికి రూ.10 వేలు, కొందరికి రూ.9 వేలు, ఇంకొందరికి రూ.8 వేలు, అక్కడక్కడా రూ.13వేలు జమ చేసి చేతులు దులిపేసుకున్నారు. మొదటి ఏడాది ఇవ్వని అమౌంట్‌తోపాటు రెండో ఏడాది ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడిస్తారని అడిగితే సమాధానం లేదు.

ఉచిత బస్సు ప్రయాణం 5 సర్వీసులకేనా?
రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణం అని ఎన్నికల్లో చెప్పారు. తీరా చూస్తే 16 రకాల సర్వీసులుంటే 5 రకాల సర్వీసులకు మాత్రమే వర్తింపజేస్తున్నారు. ఎన్నికలప్పుడు ఎలాంటి షరతలు ఉండవని చెప్పారు కదా.. ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారని అడిగితే సమాధానం లేదు.

దీపం పథకంలో ఒక్క సిలిండరే!:
దీపం పథకం కింద ప్రతి మహిళకు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితం అన్నారు. ఒక్క సిలిండర్‌ ఇచ్చి చాలించారు. మిగిలిన రెండు సిలిండర్లకు డబ్బులు ఎగ్గొట్టేశారు. లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 1.59 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉంటే ఒక్కొక్క గ్యాస్‌ సిలిండర్‌కి రూ.855 చొప్పున మూడింటికి ఏడాదికి రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టాలి. మూడేళ్లకు రూ.12 వేల కోట్లు ఇవ్వాలి. కానీ మొదటి ఏడాది ఇచ్చింది రూ.786 కోట్లు మాత్రమే. రెండో ఏడాది రూ.2,199 కోట్లు రివైజ్డ్‌ ఎస్టిమేట్‌లో చెప్పారు. ఈ బడ్జెట్‌లో రూ.2600 కోట్లు పెట్టారు. అంటే మొత్తం రూ.12 వేల కోట్లకు గానూ, మీరు ఇచ్చింది పోగా, 6,143 కోట్లు బాకీ. సగం కూడా ఇవ్వలేదు.

రైతులకు మోసం. వంచన. దగా:
అన్నదాతా సుఖీభవ. ఇక్కడా మోసం. కేంద్రం ఇచ్చేది కాకుండా ప్రభుత్వం ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామని చెప్పారు. తొలి ఏడాది ఎగ్గొట్టేశారు. రెండో ఏడాది ఇచ్చింది కేవలం రూ.10 వేల చొప్పున మాత్రమే. అంటే రూ.40 వేలకు గానూ ఇంకా రూ.30 వేలు బాకీ. అది ఎప్పుడిస్తారో చెప్పడం లేదు. అదే మా ప్రభుత్వ హయాంలో రైతుభరోసా కింద 53.58 లక్షల మందికి ఇస్తే, ఈ ప్రభుత్వం 46.85 లక్షల మందికే ఇచ్చి, 7 లక్షల మందికి ఎగ్గొట్టారు.

ఇంకా 2023–24 ఖరీఫ్‌కు సంబంధించి, 2024 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం బీమా ప్రీమియమ్‌ తన వాటా కడితే, కేంద్రం తన వాటా ఇస్తుంది. కానీ, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత, 2024 జూన్‌లో ప్రీమియమ్‌ రూ.834 కోట్ల ప్రీమియమ్‌ కట్టలేదు. రెండేళ్లలో ఈ ప్రభుత్వం ఉచిత పంటల బీమా తీసేయడం వల్ల రైతులు రూ.3500 కోట్లు నష్టపోయారు.

గత ఏడాది అక్టోబరులో మొంథా తుపాన్‌ వస్తే, ఇప్పటి వరకు ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదు. అడిగినా సమాధానం లేదు. ఇంకా మా ప్రభుత్వ హయాంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి, రూ.7500 కోట్లతో రైతులను ఆదుకున్నాం. ఈ చంద్రబాబు ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి కింద పెట్టింది కేవలం రూ.300 కోట్లు మాత్రమే. దాన్ని అడిగినా, సమాధానం లేదు.

ఏ పంటలకూ గిట్టుబాటు ధర లేదు:
వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, కందులు, మినుములు, పెసలు,  శనగలు, సజ్జలు, మిర్చి, టమోట, చీనీ, పత్తి ధరలు గత ఏడాది పూర్తిగా పడిపోయాయి. ఇప్పుడు మళ్లీ మిర్చి, శనగ, మొక్కజొన్న, అరటికి ధర లేదు. మిర్చి క్వింటా ధర గత నెల రూ.26 వేలు ఉండగా, ఇప్పుడు రూ.18 వేలు. శనగ కనీస మద్దతు ధర రూ.5,875 కాగా, రూ.5 వేల లోపుకే అమ్ముకుంటున్నారు. మొక్కజొన్న ఎమ్మెస్పీ రూ.2,400 అయితే, రూ.1400 నుంచి రూ.1500 మాత్రమే దక్కుతోంది. ఒక్క మొక్కజొన్న విషయంలోనే రైతులు రూ.3500 కోట్లు నష్టపోయారు.

ఇంకా ఈ ఏడాది కూడా అరటి టన్ను రూ.5 వేలకు అమ్ముకునే పరిస్థితి ఉంది. మా హయాంలో రూ.30 వేలకు అరటి టన్ను అమ్ముకున్నారు. ఇవాళ రూ.5 వేలకు తెగ నమ్ముకుంటున్నారు. మరోవైపు టమాటో ధర ఈరోజు కిలో‡రూ.2 కి అమ్ముకుంటున్నారు. ఇవే కాకుండా బత్తాయి, వాటర్‌ మిలాన్‌ పంటలు పరిస్థితి ఇదే. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా ఉంటామని చెప్పారు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. రూ.300 కోట్లు కాదు రూ.3 వేల కోట్లు ధరల స్థీరికరణ నిధి పెడతామని, తోడుగా ఉంటామని చెప్పాల్సిన ముఖ్యమంత్రి కనీసం నోరు మెదపలేదు.

అక్కడ రైతుల వ్యధ. ఇక్కడ ఎమ్మెల్యేల వినోదం:
అసెంబ్లీ సమావేశాల్లో వీళ్లు చేస్తున్న బిహేవియర్‌ గమనిస్తే.. ఎమ్మెల్యేలకు ఆటలు, పాటలంట!. ఎమ్మెల్యేలతో స్కిట్లు వేయించారు. రైతులు దారుణంగా నష్టపోతుంటే వీళ్లు ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం చేస్తున్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. వీళ్లు మాత్రం ఆటలాడుతున్నారు.

రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2025లో ఆత్మహత్య చేసుకున్న 393 మంది రైతుల కుటుంబాలకు, 2472 మంది రైతు కూలీల కుటుంబాలకు పరిహారం ఎప్పుడు ఇస్తామన్నది కనీసం ఒక్క మాట కూడా అసెంబ్లీలో చెప్పలేదు. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం గురించి, రైతుల కష్టాల గురించి చర్చించడం, మాట్లాడటం, వారికి భరోసా ఇవ్వడం కనీసం మచ్చుకు కూడా చేయలేదు.

ఏయే పథకంలో ఎంతెంత బాకీ?
పిల్లలు పరీక్షలు రాస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు ఎప్పుడు ఇస్తారని ముఖ్యమంత్రిని గట్టిగా నిలదీశాం. ఒక్క మాట లేదు. 2024, జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికంలో, మార్చి 16న ఎన్నికల కోడ్‌ వచ్చింది. ఏప్రిల్‌లో వెరిఫై చేసి మా ప్రభుత్వంలో అయితే ఆ త్రైమాసికానికి సంబంధించి వెంటనే ఇచ్చేవాళ్లం. ఎన్నికల కోడ్‌ కారణంగా మార్చి, ఏప్రిల్‌ క్వార్టర్‌ అప్పటి నుంచి పెండింగ్‌ పెట్టారు. అప్పటి నుంచి  ఈ మార్చి వస్తే 9 క్వార్టర్స్‌ అవుతాయి. ఒక్కో త్రైమాసికానికి విద్యా దీవెనకు సంబంధించి రూ.700 కోట్లు అవుతుంది. ఇప్పటి వరకు రూ.6,300 కోట్లు ఇవ్వాలి.

వసతి దీవెన క్రింద మా ప్రభుత్వంలో ప్రతి ఏప్రిల్‌లో క్రమం తప్పకుండా పిల్లల బోర్డింగ్, లాడ్జింగ్‌ ఖర్చుల కోసం రూ.1100 కోట్లు ఇచ్చే వాళ్లం. ఏప్రిల్‌ 2024 ఎన్నికల కోడ్‌ రావడంతో ఈ పథకం ఆగిపోయింది. ఏప్రిల్‌ 2024, 2025. ఇప్పటికీ రూ.2,200 కోట్లు బకాయిలు. ఈ రెండు కలిపితే రూ.8,500 కోట్లు ఇవ్వాలి. వీటికి గాను 2024–2025లో వీరి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రకారం విడుదల చేసింది రూ.1,771 కోట్లు అని చూపించారు. అసెంబ్లీ జరుగుతుందని చెప్పి వెంటనే బీఆర్వో రూ.1200 కోట్లు ఇచ్చారు. బీఆర్‌వో ఇస్తే డబ్బులు ఇచ్చినట్లు కాదు. ఇప్పటికీ రూ.300 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు చెబుతున్నారు. టోటల్‌గా వీళ్లు ఇచ్చింది రూ.2,070 కోట్లు మాత్రమే. రూ.6,428 కోట్లు బాకీ ఉన్నారు. ఈ ఏడాదికి రూ.3,900 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ రెండు కలిపితే రూ.10,328 కోట్లు కావాల్సి వస్తే..  ఈ బడ్జెట్‌లో కేటాయించింది రూ.2,766 కోట్లు మాత్రమే.

మరి పిల్లల చదువులు ఎలా సాగుతాయి?. కాలేజీల  యాజమాన్యాలు పిల్లలను నిలదీస్తూ  ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజులు కట్టలేని పిల్లలు చదువులు మానేస్తున్నారు. తల్లిదండ్రులు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి, చదువులు మానేయాల్సిన పరిస్థితి. అయినా ఈ చంద్రబాబుకు మనసు రాదు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాల తరువాత కూడా ఇవి ఎప్పుడిస్తావు స్వామీ అంటే చంద్రబాబు నోట్లో నుంచి కనీసం మాట కూడా రావడం లేదు.

పొదుపు సంఘాలు. పరపతి. వాస్తవాలు:
పొదుపు సంఘాలకు మా ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా సున్నా వడ్డీ డబ్బులు ఇచ్చేవాళ్లం. ప్రతి ఏప్రిల్‌లో క్రమం తప్పకుండా బటన్‌ నొక్కాం. సున్నా వడ్డీ పథకానికి మా ప్రభుత్వం ఏకంగా రూ.4,900 కోట్లు ఇచ్చాం. ఈరోజు చంద్రబాబు మేనిఫెస్టోలో రూ.3 లక్షల వడ్డీ లేని రుణాలకు రూ.10 లక్షలకు పెంచుతామన్నారు. పెంచడం కథ దేవుడెరుగు స్వామీ..మా హయాంలో ఇచ్చేది కూడా ఎగరగొట్టేశావు. అన్నీ కలిపి మూడేళ్లకు గానూ రూ.10 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. మరి ఆ రూ.10 వేల కోట్లు ఎప్పుడిస్తున్నావ్‌ స్వామి? అక్కచెల్లెమ్మలు ఎదురు చూస్తున్నారు.

పొదుపు సంఘాల పరపతి తగ్గిపోయింది. పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలు తగ్గిపోయాయి. బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు ఏకంగా రూ.10 కోట్లు తగ్గాయి. లాస్ట్‌ బడ్జెట్‌ ప్రజెంటేషన్‌లో చూపించా.. రూ.49 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.30 వేల కోట్లకు తగ్గిన పరిస్థితులు. నాబార్డ్‌ నివేదిక గత ప్రెస్‌మీట్‌లో చూపించాను.

మళ్లీ మోసపూరిత మాటలు!
పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు అన్ని విధాలుగా నష్టం చేసిన చంద్రబాబు, మహిళా దినోత్సవం రోజున ఏమన్నాడు? అక్కచెల్లెమ్మలను పారిశ్రామికవేత్తలను చేస్తామంటూ మాట్లాడుతున్నాడు. తానిచ్చిన హామీలను అమలు చేయకుండా ఒకవైపు ఉన్న పథకాలను రద్దు చేసి, చివరకు సున్నా వడ్డీ కూడా గతి లేకుండా చేసి వెన్నుపోటు పొడిచి, మరోవైపున వారిని మభ్యపెడుతూ పారిశ్రామిక వేత్తలను చేస్తానంటూ కోతలు కోస్తున్నాడు.

నాడు మా ప్రభుత్వంలో ఏమేం చేశామంటే..
మహిళా సాధికారత కోసం అప్పట్లో మేము అమూల్‌ను తీసుకొచ్చాం. హిందుస్థాన్‌ లివర్‌ను తీసుకొచ్చాం, ప్రొక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ తీసుకొచ్చాం, ఐటీసీ, రిలయన్స్‌ను తీసుకొచ్చాం. ఇలాంటి మల్టీనేషనల్‌ కంపెనీలను తీసుకురావడమే కాకుండా, బ్యాంక్‌ లింకేజీలను టైయ్యప్‌ చేసి ప్రతి అక్కను, చెల్లెమ్మను లక్షాధికారిని చేయాలని మహిళా సాధికారత కోసం మా ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, జగనన్న తోడు, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, వాహన మిత్ర, సున్నావడ్డీలు ఇవన్నీ మేము అమలు చేసి, అక్కచెల్లెమ్మలను నిలబెట్టే కార్యక్రమం చేస్తే.. అన్నీ రద్దు చేసిన చంద్రబాబునాయుడు హయాంలో మళ్లీ వారికి నష్టం జరుగుతోంది.

ఇప్పుడు ఎంత నష్టం జరుగుతోందంటే..
నాబార్డు నివేదిక ప్రకారం చూస్తే.. 2024–25లో ఏకంగా రూ.41,623 కోట్లు అచీవ్‌మెంట్‌ కింద బ్యాంక్‌ లింకేజీస్‌ ఫర్‌ సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూప్స్‌ ఇస్తే.. 2025–26 వచ్చేసరికి ఏకంగా ఈ 10 నెలల కాలానికి అది రూ.30,698 కోట్లకు పడిపోయింది.  అదే గత మా ప్రభుత్వ హయాంలో ప్రతి సంవత్సరం అది పెరుగుతూ పోయింది. ఆ వివరాలు చూస్తే.. 2020–21లో రూ.20,808 కోట్లు, 2021–22లో రూ.33,568 కోట్లు, 2022–23లో రూ.38,014 కోట్లు, ఆ తర్వాత చివరి ఏడాది 2023–24లో ఏకంగా రూ.49,626 కోట్లకు మేము పెంచుకుంటూ వెళ్తే.. చంద్రబాబునాయుడు హయాంలోకి వచ్చేసరికి ఏకంగా రూ.49,626 కోట్ల నుంచి 2024–25 సంవత్సరానికి అక్కచెల్లెమ్మలకు బ్యాంక్‌ క్రెడిట్‌ లింకేజీ ఏకంగా రూ.41,623 కోట్లకు తగ్గిపోయింది. ఇంకా 2025–26లో ఈ 10 నెలల కాలానికి చూస్తే ఏకంగా రూ.30,698 కోట్లకు పడిపోయింది. మహిళా సాధికారత కాదు.. మహిళలను చంద్రబాబు నాయుడు నాశనం చేస్తున్నాడని చూపించే చిత్రపటం ఇది. మళ్లీ ఇప్పుడు వారిని మోసం చేసేందుకు పారిశ్రామిక వేత్తలను చేస్తానని తప్పుడు వాగ్దానాలు. మహిళలను ఇంతమోసం, ఇంత అన్యాయం చేస్తున్నాడు.

ట్రిపుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లంట!
ఇంకా చంద్రబాబుగారు ఇప్పుడేమంటున్నారు? ట్రిపుల్‌ బెడ్‌రూం ఇళ్లు అంటున్నాడు. స్వామీ ట్రిపుల్‌ బెడ్రూం ఇళ్ల కథ దేవుడెరుగు.. మా హయాంలో మేము శాంక్షన్‌ చేయించి ఇళ్లు పూర్తి చేసేందుకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండని అడిగితే.. వాటి గురించి మాట్లాడడు కానీ, ఏకంగా ట్రిపుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తామంటూ చంద్రబాబు నాయుడు మరొక దొంగ మాట మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా.. ఈ రెండేళ్లలో చంద్రబాబునాయుడు ఒక్క అక్కచెల్లెమ్మకు అయినా, ఒక్క గజం స్థలం అయినా ఇచ్చాడా? ఒక్క ఇంటి పట్టా ఇవ్వలేదు. కొత్తగా ఒక్క ఇంటిని కూడా శాంక్షన్‌ చేయించలేదు.

మా హయాంలో మేము 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి, అందులో 21 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయించి, 10 లక్షల పైచిలుకు ఇళ్లు పూర్తి చేయించాం.. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఆ ఇళ్ల నిర్మాణ పూర్తికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా చంద్రబాబు ఇవ్వడం లేదు. ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఒకసారి డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బును డైవర్ట్‌ చేయకుండా ఇస్తే మళ్లీ రెండోసారి ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది.. చంద్రబాబు డైవర్ట్‌ చేశాడు. పథకం ఆగిపోయింది. పైగా ఆ పథకం ముందుకు సాగాలంటే.. చంద్రబాబు తరఫు నుంచి చేయాల్సినవి కొన్ని చేయాలి కాబట్టి.. అవన్నీ చేయడం ఎందుకని ఆపేశాడు. ఈ రెండే కారణాలు.

మ్యానిఫెస్టోలో చెప్పి.. మంగళం పాడాడు
ఈ ఉన్న ఇళ్లను కంప్లీట్‌ చేయండి స్వామీ అని ఒక పక్క అడుగుతుంటే.. ట్రిపుల్‌ బెడ్రూం అంటున్నాడు. మేనిఫెస్టోలో ఏమన్నాడో తెలుసా.. ప్రతి ఇంటి నిర్మాణానికి అదనంగా ఆదివాసీలకు రూ.1లక్ష, కొండ ప్రాంతం కాకుండా కింది ప్రాంతాల్లో ఉండే ఎస్టీలకు రూ.75 వేలు, ఎస్సీలకు, చేనేతలకు రూ.50 వేల చొప్పున ఇస్తానన్నాడు. రెండేళ్లలో ఒక్కరికైనా, ఒక్క పైసా అయినా ఇచ్చాడా? దీనిపై గట్టిగా అడిగితే 16 రోజుల అసెంబ్లీ సమావేశాల తరువాత కూడా చంద్రబాబు నోటి నుంచి ఒక్క మాట రాలేదు.

ఏ అభివృద్ది లేదు. అంతా నిర్వీర్యం. అస్తవ్యస్తం
స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులు ఆగిపోయాయి. అయ్యా.. ఆ పనులు ఆగిపోయాయని గట్టిగా ప్రశ్నిస్తూ అడిగాం.. వీటికి సంబంధించి ఒక్క మాట లేదు. అయ్యా 17 మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు అని ప్రజలు పెద్ద ఎత్తున సంతకాలతో తమ నిరసన తెలియజేసిన మధ్య మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, ఆ 17 మెడికల్‌ కాలేజీలు (17 దేవాలయాలను) పూర్తి చేయండి చంద్రబాబూ అని గట్టిగా అడిగితే.. వాటి గురించి కూడా ఒక్క మాటా లేదు.

ఆరోగ్యశ్రీ దారుణ పరిస్థితి
ఆరోగ్యశ్రీకి ఈ రెండేళ్లకే చంద్రబాబు పెట్టిన బకాయిలు రూ.3150 కోట్లు. ఈ సంవత్సరం 2026–27లో ఆరోగ్యశ్రీ స్కీమ్‌ నడవడానికి నెలకు రూ.330 కోట్లు చొప్పున 12 నెలలకు రూ.4 వేల కోట్లు కావాలి. ప్రస్తుత రూ.4 వేల కోట్లు, బకాయిలు రూ.3150 మొత్తం రూ.7150 కోట్లకు గానూ, చంద్రబాబు బడ్జెట్‌లో కేటాయించింది రూ.4 వేల కోట్లు మాత్రమే. కానీ, ఏరోజూ కూడా బడ్జెట్‌లో పెట్టిందానికి, ఖర్చు చేసింది చూస్తే ఏరోజూ కనీసం రూ.2 వేల కోట్లు దాటలేదు.

అయ్యా చంద్రబాబు ఆరోగ్యశ్రీకి రూ.7150 కోట్లు కావాలి. వీటికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావ్‌.. రూ.3150 కోట్ల బకాయిలే ఉన్నాయి. ఈ ఏడాది స్కీమ్‌ నడవడానికి మరో రూ.4 వేల కోట్లు కావాలి. నెట్‌వర్క్‌ ఆస్పత్రులు స్ట్రైక్‌ చేస్తున్నారు. అగ్రిమెంట్లు చేయబోమని నోటీసులు ఇస్తున్నారు అని చంద్రబాబును గట్టిగా నిలదీస్తూ అడిగినా కూడా ఆయన నోట్లో నుంచి ఒక్క మాటా రాదు.

ఉద్యోగులకూ దగా
ఉద్యోగులకు అధికారంలోకి వస్తూనే ఇస్తానన్న ఐఆర్‌ ప్రస్తావన బడ్జెట్‌లో లేదు. అధికారంలోకి రాగానే ఐఆర్‌ అని చంద్రబాబు మేనిఫెస్టోలో హామీ ఇచ్చాడు. దాని గురించి ప్రస్తావనే లేదు. పీఆర్సీ ప్రస్తావనే లేదు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏల గురించి, డీఆర్‌ల గురించి ఎప్పుడిస్తారో కనీసం చెప్పనుకూడా చెప్పలేదు. జీపీఎఫ్‌ గురించి మాట లేదు, ఏపీ జీఎల్‌ఐ గురించి మాట లేదు. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్, సరెండర్‌ లీవ్స్‌ వీటి కింద దాదాపుగా రూ.35 వేల కోట్లు ఉద్యోగస్తులకు చంద్రబాబు బాకీ పడ్డాడు. వీటి గురించి కనీసం మాట కూడా లేదు.

ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు విజయవాడకు వచ్చి ధర్నాలు చేస్తుంటే.. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది వారు అడుగుతున్నారు. ధర్నా చేస్తున్న వారిని తెల్లవారుజామున పోలీసులను పంపించి, వారిని కొట్టించి ఎత్తించాడు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కనీసం వాళ్ల ప్రస్తావన లేదు.  చివరకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా.. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ఎక్కడకు వెళ్లినా ఆయన చేసేది రెండే రెండు.. పెన్షన్ల సమయంలో ఏదో ఒక గ్రామానికి వెళ్తాడు. రెండోది ఒక్కడైనా నిలబడు.. రెవెన్యూ రికార్డులు ప్రక్షాళన చేస్తా అని పాస్‌ బుక్కుల పంపిణీలో కనిపిస్తుంటాడు. ఇది తప్ప ఆయన ఏదీ చేయడు.

నిస్సిగ్గుగా క్రెడిట్‌ చోరీ:
నేను అడుగుతున్నా అయ్యా చంద్రబాబు నాయుడూ.. ఎక్కడికి వెళ్లినా రెవెన్యూ రికార్డులు ప్రక్షాళన చేస్తా, ఎక్కడికక్కడ సర్వే చేయిస్తా, ఎక్కడ లేని టెక్నాలజీ వాడుతున్నా, క్యూఆర్‌ కోడ్‌ పట్టాదారు పాస్‌ పుస్తకాలిస్తున్నా,ప్రతి ల్యాండ్‌ పార్సిల్‌ కూ జియో కోఆర్డినేట్స్‌ తో హద్దులు చూపిస్తున్నా అని చంద్రబాబు క్రెడిట్‌ చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

అసలు ఇవన్నీ ఎవరి హయాంలో వచ్చాయి? ఒకసారి సుదీర్ఘంగా నేను దీని గురించి చెప్పా, మళ్లీ చెబుతున్నా. ఇవన్నీ ఎవరి హయాంలో వచ్చాయి. ఈ సర్వేయర్ల వ్యవస్థ అయినా, ప్రతి గ్రామంలో సచివాలయాల వ్యవస్థ అయినా ఎవరి వల్ల వచ్చింది? అసలు ఈ సర్వే ఇక్విప్మెంట్‌ ఎవరి హయాంలో వచ్చింది. అసలు ఈ కోర్‌ స్టేషన్స్‌ ఎవరి హయాంలో వచ్చాయి? అసలు ఈ రోవర్స్‌ ఎవరి హయాంలో వచ్చాయి? అసలు ఈ విమానాలు, హెలికాప్టర్లు సర్వేలు చేస్తూ ఎవరి హయాంలో తిరిగాయి? అసలు ఈ ఓఆర్‌ఐ రికార్డులు ఎవరి హయాంలో వచ్చాయి? చివరికి ఈ సర్వే చేయడానికి అవసరమయ్యే కోట్ల రాళ్లు కూడా ఎవరి హయాంలో వచ్చాయి?

ఇంకా పాస్‌ బుక్‌ లో క్యూఆర్‌ కోడ్‌ కూడా ఎవరి హయాంలో వచ్చింది? భూములకు జియో ట్యాగింగ్‌ హద్దులు ఎవరి హయాంలో వచ్చాయి? ఇవన్నీ వచ్చిన వాళ్లకు క్రెడిట్‌ ఇవ్వాల్సింది పోయి.. సరే ఆ వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం, జగన్‌ మోహన్‌ రెడ్డికి, నాకు క్రెడిట్‌ ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదు, క్రెడిట్‌ చోరీ ఎలాగూ చేస్తున్నాడు, చేస్తాడు.
అది ఆయన నైజం.

సచివాలయాల్లో 15 వేల మంది సర్వేయర్లు లేకపోతే, డిజిటల్‌ అసిస్టెంట్లు లేకపోతే, ఆ సచివాలయాల్లో విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్లు లేకపోతే అది ఎలా చేస్తారు? ఎలా అవుతుంది? కనీసం ఏరోజూ వాళ్లకు కూడా థ్యాంక్యూ చెప్పలేదు. వాళ్లమీద హరాస్మెంట్‌. సచివాలయ ఉద్యోగులు 50–60 మంది చనిపోయారు. ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం సానుభూతి లేదు వాళ్ల మీద. సర్వేయర్లను అయితే సస్పెన్షన్, హరాస్మెంట్‌. వాళ్లకు ఒక థ్యాంక్యూ చెప్పి, చిక్కటి చిరునవ్వుతో వాళ్లతో పనులు చేయించుకోవాల్సిన చోట చిక్కటి చిరునవ్వు లేదు, థ్యాంక్యూ లేదు, హరాస్మెంట్‌. ఆత్మహత్యలు. ఇవి ఈరోజు ఎంప్లాయీస్‌ పరిస్థితి.

ఇలా తానిచ్చిన హామీలు అమలు చేయకుండా, ఉన్న అన్ని పథకాలనూ రద్దు చేసి, ఒకవైపున తానిచ్చిన హామీలన్నీ అమలు చేయకుండా మోసం చేశాడు. మరోవైపున తానిచ్చిన పథకాలన్నీ రద్దు చేశాడు. మా ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేశాడు. మరోవైపున స్కూల్స్, హాస్పిటల్స్, వ్యవసాయం అన్నీ కూడా విధ్వంసానికి లోనయ్యాయి.

ముగ్గురు, నలుగురిని కనాలంట!:
ప్రతి జంటా కనీసం ముగ్గురు నలుగురు పిల్లల్ని కనాలంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో. ఇవాళ చంద్రబాబు గారి పాలనలో పాలు తాగినా, నీళ్లు తాగినా చనిపోతున్నారు. స్కూళ్లలో, హాస్టళ్లలో నాణ్యమైన భోజనం కూడా పెట్టలేకపోతున్నాడు. గోరుముద్ద గాలికి ఎగిరిపోయింది. పరిశుభ్రమైన తాగునీరు లేక కలుషిత ఆహారం వల్ల పిల్లలు చనిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. నాడు–నేడు గాలికి ఎగిరిపోయింది. ప్రభుత్వ హాస్పిటల్స్‌ లో కూడా ఇవే పరిస్థితులు. నాడునేడు ఆగిపోయాయి, జీరో వేకెన్సీ పాలసీ గాలికి ఎగిరిపోయింది. 17 కొత్త మెడికల్‌ కాలేజీలు పూర్తి చేయాల్సిన చోట వాటిని స్కాములు చేస్తూ అమ్మాలని ఆపేసిన పరిస్థితులు.

ఫ్యామిలీ డాక్టర్‌ లేదు. విలేజ్‌ క్లినిక్స్‌ నిర్వీర్యం. హాస్పిటల్స్‌ లో డబ్ల్యూహెచ్‌ఓ జీఎంపీ క్యాటగిరీస్‌ మందుల కథ దేవుడెరుగు. మామూలు మందులు కూడా దిక్కులేని పరిస్థితుల్లో ఆస్పత్రులు తయారైపోయాయి. గవర్నమెంటు బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం గాలికి ఎగరిపోయింది. నాడు–నేడు పనులు ఆగిపోయాయి. ట్యాబులు 8 వతరగతి పిల్లలకు ఆపేశారు. గోరుముద్ద కూడా అన్యాయం చేశారు. చదువులు ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టే గవర్నమెంట్‌ స్కూళ్లలో చేరే ఎన్రోల్మెంట్‌ జీఈఆర్‌ రేషియో మా ప్రభుత్వ హయాంతో పోలిస్తే 2023–24తో పోలిస్తే గవర్నమెంట్‌ స్కూళ్లలో చేరిన సంఖ్య దాదాపుగా 44 లక్షల గవర్నమెంట్, ఎయిడెడ్‌ స్కూల్స్‌లో ఉంటే ఏకంగా చంద్రబాబు గారి హయాంలోకి వచ్చే సరికి ఏకంగా 33 లక్షలకు తగ్గిపోయింది. 10 లక్షల మంది స్టూడెంట్స్‌ గవర్నమెంట్‌ బడుల నుంచి విత్‌ డ్రా అయ్యారు.

మంచి చదువులు లేవు, మంచి వైద్యం లేదు, వ్యవసాయం అన్నది రైతులకు ఈరోజు గుదిబండగా మార్చాడు చంద్రబాబు. ఏ పంటకూ గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఇస్తానన్న నిరుద్యోగ భతి ఇవ్వడు. అమలు చేస్తానన్న సూపర్‌ సిక్సులు, సూపర్‌ సెవెన్లు అమలు చేయడు. పైగా మా ప్రభుత్వంలోఉన్న పథకాలన్నీ రద్దు చేశాడు.

ప్రజల జీవన ప్రమాణాలు కనీసం పెంచకుండా, పట్టించుకోకుండా మహిళలకు తానిచ్చిన హామీలకు దిక్కులేని పరిస్థితుల్లో రాష్ట్రం ఈరోజు ఉంటే చంద్రబాబు ఏమంటాడు ఎడాపెడా ఒక్కొర్కరుముగ్గురు, నలుగురు పిల్లల్ని కనండి అంటాడు. స్వామీ.. కనడం కథ దేవుడెరుగు.

చంద్రన్న పెళ్లి కానుక అని మేనిఫెస్టోలో పెట్టావు, ప్రతి జంటకూ పెళ్లి అవుతానే రూ.లక్ష ఇస్తానన్నావు. ఇంత వరకు ఒక్కరికి ఇవ్వలేదు. అదెప్పుడిస్తావు స్వామీ అని అడిగాం. ఇంత వరకు దాని గురించి మాట్లాడలేదు. కానీ మూడో బిడ్డను కంటే డబ్బులిస్తాడట. ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన చంద్రన్న పెళ్లికానుకకు దిక్కులేదు. ఇప్పుడు మూడో బిడ్డను కంటే డబ్బులిస్తాడట కొత్తగా!.

కళ్లార్పకుండా పచ్చి అబద్ధాలు:
అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా అబద్ధాలు ఆడటంలోనూ, మోసం చేయడంలోనూ అసలు కళ్లు ఆర్పడు. ఇలాంటి వ్యక్తి చాలా అరుదుగా పుడతాడు కొంత మంది. ఈయనకు కరెక్టుగా పుట్టినోడు లోకేష్‌ కూడా అలాగే ఉన్నాడనుకోండి అది వేరే విషయం. వీళ్లు చాలా అన్యాయస్తులు. మహిళల జోలికొస్తే తాట తీస్తానంటాడు. ఈమధ్య కాలంలో ఆయన స్టేట్మెంట్లు. మహిళల జోలికొస్తే అదే ఆఖరిరోజు అవుతుందని చంద్రబాబు గారి డైలాగుల మీద డైలాగులు. ఇవి సినిమా డైలాగులు కాదు. చంద్రబాబు డైలాగులు.

వీరందరిపై ఏం చర్య తీసుకున్నారు బాబుగారు?:
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌.. తనపై అత్యాచారం చేశాడని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా ముఖ్యమంత్రికి, పోలీసులకు స్వయంగా ఫిర్యాదు చేసింది. చంద్రబాబూ ఏం చర్యలు తీసుకున్నావు అని అడుగుతున్నా. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్‌ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ మీద చంద్రబాబూ ఏం చర్యలు తీసుకున్నావు? మహిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్‌ చేసిన గుంటూరు ఈస్ట్‌ ఎమ్మెల్యే నసీర్‌ మీద ఏం చర్యలు తీసుకున్నావు?

టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే ఈ చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు? మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పీఏ.. ఎమ్మెల్యేలు, ఈ లీడర్ల కథ దేవుడెరుగు.. కనీసం పీఏల మీద చర్యలు తీసుకోలేకుండా ఉన్నాడు. పైగా బాధితురాలు మీద కూడా తప్పుడు కేసు, ఉల్టా కేసు పెట్టారు.  అంతెందుకు ప్రస్తుత టీటీడీ చైర్మన్‌ ఒక మహిళను మోసం చేసి వీడియోతోనూ, ఫొటోలతోనూ అడ్డంగా దొరికిపోయినా చంద్రబాబు ఏం చేశాడు?

సరే వాళ్లంతా పొలిటీషియన్స్‌ లే, వాళ్ల జోలికిపోతే ఏమైనా ఇబ్బందిలే,  అని ఏమైనా హెసిటేట్‌ చేస్తున్నాడేమో అనుకుంటే టీటీడీ చైర్మన్‌.. ఒక మహిళను మోసం చేసి ఆమె వీడియో చూపుతూ, ఫొటోలు చూపుతూ అడ్డంగా దొరికిపోయినా చంద్రబాబు ఏం చేశాడని అడుగుతున్నా. తనను మోసం చేశాడని ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఈ బాధితురాలు చంద్రబాబుకు గతంలోనే లేఖ రాసిందట. ఆ లేఖ కాపీ కూడా ఈ మధ్య కాలంలో బయటకు వచ్చింది. దాని అక్నాలడ్జ్‌ మెంట్‌ తో సహా బయటకు వచ్చింది.

అలాంటి చోట చంద్రబాబు ఎంక్వైరీ చేసింది లేదు, ఇలాంటి వ్యక్తులకు ఉన్నత పదవులు ఇవ్వకూడదు అంటే ఏకంగా టీటీడీ చైర్మన్‌ పదవి ఇచ్చాడు. నిజంగా దేవుడి మీద వీళ్లకు భయం లేదు, భక్తి లేదు, నిష్ట లేదు. నిజంగా ఇలాంటివి ఏవైనా ఉంటే ఇలాంటి తప్పులు చేయరు. ప్రత్యేకంగా దేవుని ఆలయంలో. ఇలాంటి వాళ్లా దేవుడి గురించి మాట్లాడేది? ఇలాంటి వాళ్లా పవిత్రత గురించి మాట్లాడేది? ఇలాంటి వాళ్లా ఆలయాల గురించి మాట్లాడేది?

ఆలయాల నిర్వహణలోనూ నిర్లక్ష్యం
చంద్రబాబుకు నిజంగా భయం లేదు, భక్తి లేదు. ఆలయ నిర్వహణలో శ్రద్ధ అంతకన్నా లేదు. నిన్న (మంగళవారం) కదిరిలో జరిగిన రథోత్సవంలో రథం కింద పడి ఆరుగురు భక్తులు గాయపడ్డారు. పవిత్రమైన రథోత్సవం నిర్వహణలోనూ భక్తులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. ఫస్ట్‌ టైమ్‌ తిరుమల తిరుపతి దేవస్థానం హిస్టరీలో అది జరిగింది. సింహాచలంలో చందనోత్సవం సమయంలో గోడకూలి ఏడుగురు చనిపోయారు. పలాసలో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయారు. చంద్రబాబు హయాంలోనే. వరుసగా ఇన్ని ఘటనలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? దేవుణ్ని అడ్డుపెట్టుకుని వీళ్లు రాజకీయాలు చేయడం తప్ప వీరికి నిజంగా చిత్తశుద్ధి ఎక్కడుంది?

నెయ్యి టెండర్లలో రూ.200 కోట్ల స్కామ్‌:
చివరికి తిరుమలకు సప్లయ్‌ అయిన నెయ్యి వ్యవహారంలో కూడా మా పార్టీ నుంచి మా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు చెప్పలేదు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో. ఇందాపూర్‌ డెయిరీ, చంద్రబాబు కంపెనీ హెరిటేజ్‌ మధ్య సంబంధాల గురించి నిలదీశాం. చంద్రబాబు సమాధానం చెప్పలేదు. సంగం డెయిరీ–వైష్ణవి డెయిరీల మధ్య సంబంధం గురించి ప్రశ్నించాం. సమాధానం లేదు.

తిరుమలకు సప్లయ్‌ అవుతున్న నెయ్యి టెండర్ల డాక్యుమెంట్లు చూస్తే ఇప్పటి వరకు రూ.200 కోట్ల స్కామ్‌ బయటపడుతుంది. ఉద్దేశపూర్వకంగానే ఒక ఏడాది కాలంలోనే కేజీ నెయ్యి రూ.351 నుంచి రూ.716కు తీసుకుపోయారు. 2024 ఆగస్టులో రూ.351కి తిరుమలకు సప్లయ్‌ అయితే, అక్టోబర్‌ 2025 నాటికి అంటే ఒక సంవత్సరంలోనే రూ.716 తీసుకుపోయారు. అంటే కేజీ నెయ్యి దాదాపు రూ.365 పెంచారు. దీని కోసం అంతా ఒక కార్టెల్‌ మాదిరిగా ఏర్పడి దేవుడి సొమ్మును కొల్లగొడుతున్నారు.

ఒక్కసారి ఈ స్కామ్‌ చూస్తే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 ఆగస్టు వరకు తిరుమలకు సప్లయ్‌ అయిన రేటు రూ.351. ఆ తర్వాత 2025 జనవరి 31కి ఈ రేటు అమాంతంగా రూ.513కు పెరిగింది. 2025 అక్టోబర్‌ నాటికి రూ.599కు స్కై రాకెట్‌ లా పెరిగింది. ఆ తర్వాత అదే అక్టోబర్‌ లోనే రూ.716కు పోయింది. మొత్తం ఈ వ్యవహారాన్ని గమనించమని కోరుతున్నాను. ప్రపంచ చరిత్రలో స్కాంలలో ఇలాంటిది జరిగి ఉండదు. వీరికి దేవుడంటే భయం లేదు. భక్తీ లేదు. ఒకవైపు దుమారం రేపి, మరోవైపు స్కాంలు చేస్తున్నారు.

పరకామణిలో చోరీ. అంతా గప్‌చుప్‌
చంద్రబాబుగారి హయాంలో తిరుమల హుండీలో డబ్బు లెక్కించే పరకామణి నుంచి ఏకంగా జనవరి 2025లో బుక్‌ అయిన కేసు చూస్తే.. కోటి రూపాయల బంగారాన్ని దొంగతనం చేస్తే.. చంద్రబాబు హయాంలో ఘోరమైన ఈ తప్పు జరిగితే.. ఆ దొంగకు దగ్గరుండి బెయిల్‌ ఇప్పించారు. మొత్తం కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. అదే మా ప్రభుత్వ హయాంలో రూ.75 వేల విలువ చేసే డాలర్‌ నోట్లు దొంగతనం చేస్తే.. ఏకంగా రూ.15 కోట్ల విలువైన ఆస్తులు టీటీడీకి రాయించాం. దేవుని సొమ్ముతో ఎవరైనా చెలగాటమాడితే.. అది తప్పు. డిసిప్లిన్‌ ఉండాలి అని చెప్పి మా హయాంలో టీటీడీలో రూ.75 వేల విలువైన డాలర్ల కరెన్సీల  చోరీ జరిగితే.. ఏకంగా రూ.15 కోట్లు రాయించిన పరిస్థితులు అప్పట్లో.. మరి ఇప్పుడు కోటి విలువైన బంగారం చోరీ చేస్తే.. పట్టుబడిన ఆ వ్యక్తికి బెయిల్‌ ఇచ్చి పంపిస్తున్నారు.

ఇంకా ఆశ్చరకరమైన విషయం ఏమంటే ఈ కోటి రూపాయల దోపిడీ టీటీడీ పరకామణిలో చంద్రబాబు హయాంలో 2025 జనవరిలో జరిగితే.. దాన్ని ఓవైపు దాచిపెట్టి బయటికి రాకుండా చేసి.. 2023లో జరిగిన పరకామణి కేసు.. రూ.75 వేల విలువైన డాలర్‌ నోట్లు పట్టుబడి.. అక్కడ కూడా గుడికి మేలు చేస్తూ ఏకంగా రూ.15 కోట్లు టీటీడీకి రాయించిందాన్ని తప్పు పడతాడు. 2025 జనవరిలో తన హయాంలో జరిగింది దాచి పెట్టి.. సెప్టెంబర్‌ 2023లో జరిగిన డాలర్‌ నోట్ల దొంగతనం వ్యవహారంలో ఆ గుడికి మేలు చేయిస్తే.. పెద్ద ఎత్తున విష ప్రచారం దుమారం చేసి.. ఈ 2025లో జరిగిన దొంగతనాన్ని కప్పిపెడుతున్నాడు.

నెయ్యి వ్యవహారంలో కూడా అంతే..
ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నెయ్యి వ్యవహారంలో కూడా అంతే. ఈయన (చంద్రబాబు) హయాంలోనే టెండర్లు ఖరారయ్యాయి. చంద్రబాబు హయాంలోనే టెండర్లు ఖరారు. 2024, జూన్‌లో చంద్రబాబు సీఎం అయ్యాకే, నెయ్యి టెండర్లు ఖరారు. ట్యాంకర్ల ద్వారా నెయ్యి సరఫరా. చంద్రబాబు హయాంలో రిజెక్ట్‌ అయిన 4 ట్యాంకర్లు, మరో కంపెనీ పేరుతో ఆగస్టు, సెప్టెంబరులో రాగా, అనుమతించి లడ్డూల తయారీలో వాడారు. అది కాగానే, ఆ విషయాన్ని దాచిపెట్టి, 2024, సెప్టెంబరు 24న చంద్రబాబు, లడ్డూ కల్తీ గురించి మాట్లాడారు.

అంటే జరిగిన అక్రమం చంద్రబాబు హయాంలోనే. రిజెక్ట్‌ అయిన ట్యాంకర్లు వెనక్కు వచ్చాయి. వాటిని వాడారు. మళ్లీ మాపై ఎదురుదాడి చేశారు. ఆయన తప్పు చేసి, మాపై ఎదురుదాడి చేశారు. ఇంకా హెరిటేజ్‌ ఇందాపూర్‌ డెయిరీ సంబంధం దాచిపెట్టే ప్రయత్నం చేశారు. మరోవైపు సంగం వైష్ణవి డెయిరీ మధ్య సంబంధం ఒప్పుకోవడం లేదు. ఇవన్నీ చూస్తే, గమనిస్తే.. ఒక విషయం స్పష్టమవుతుంది. చంద్రబాబు ఒక రియల్‌ విలన్‌. అన్నీ చేస్తాడు. ఒప్పుకోడు. పైగా ఎదురు ఆరోపణలు. విమర్శలు చేయడం ఆయన నైజం.

మేం బాగా పోరాడుతున్నట్లే కదా?:
11 మంది వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు 1100 మందిలా కూటమికి భయం పుట్టించుగలుగుతున్నారంటే మేం ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై బాగా పోరాటం చేస్తున్నట్టే కదా.  చంద్రబాబు ఉప ప్రధానిగా దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నాడని ఎల్లో మీడియాలో ప్రచారం జరుగుతోందని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఈయన్ను రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నారు.. ఉప ప్రధాని అయితే దేశ ప్రజలంతా ఏం కావాలి? అని వైయస్‌ జగన్‌ చురకలంటించారు.

వైఎస్ జ‌గ‌న్ ప్రెస్ మీట్ లో ప్ర‌ద‌ర్శించిన డాక్యుమెంట్లు ఇవీ.. SRI YS JAGAN PC_11-03-2026_FINAL (1)

ఇవీ చ‌ద‌వండి: YS Jagan Press Meet: రేపు తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ కీలక ప్రెస్‌మీట్
YS Jagan Press Meet : ప్రశ్నిస్తే ఇంత అసహనమా? చంద్రబాబుపై జగన్ ఆగ్రహం
YS Jagan Longest PC : సినిమా చూపించిన జ‌గ‌న్.. ఏక‌బిగిన 2.45 గంట‌ల ప్రెస్ మీట్.. అప్పులు, విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయం, ల‌డ్డూ, ఇందాపూర్, హెరిటేజ్ వ‌ర‌కు.. ఆధారాల‌తో నాన్ స్టాప్ బ్యాటింగ్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు