Phone Tapping Case : తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు (కేసీఆర్) సిట్ నోటీసులు జారీ చేసింది. నందినగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. శుక్రవారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే సిట్ నోటీసులపై కేసీఆర్ వెంటనే స్పందించారు. శుక్రవారం జరిగే విచారణకు తాను హాజరుకాలేనని, విచారణను వాయిదా వేయాలని సిట్‌ను కోరారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల కారణంగా విచారణకు హాజరు కావడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
అలాగే తనను హైదరాబాద్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే విచారించాలని కేసీఆర్ సిట్‌ను కోరారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం విచారణ జరపాలని సూచించారు. మాజీ ముఖ్యమంత్రిగా, బాధ్యతగల పౌరుడిగా విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని సిట్‌కు రాసిన లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. ఇకపై ఎలాంటి నోటీసులైనా ఫామ్‌హౌస్‌కే పంపాలని కూడా ఆయన లేఖలో స్పష్టం చేశారు. దీనిపై సిట్ స్పందన వెలువడాల్సి ఉంది.
ఇదే సమయంలో కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ఇది విచారణ కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ ప్రతీకారమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నోటీసులు, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సింగరేణి బొగ్గు కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సిట్ నోటీసుల డ్రామా నడుస్తోందన్నారు. పరిపాలనా వైఫల్యాలు, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ చర్యలకు దిగుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
మరోవైపు కాంగ్రెస్ కూడా స్పందించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసుల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ఇది పూర్తిగా చట్టబద్ధమైన విచారణ మాత్రమేనని తెలిపారు.
బీజేపీ నేతలు కూడా ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని కేసీఆర్ కాపాడితే, కాళేశ్వరం మరియు ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఇప్పుడు కేసీఆర్‌ను రేవంత్ కాపాడుతున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు వ్యాఖ్యానించారు.
బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డైలీ సీరియల్‌లా మారిందన్నారు. కాంగ్రెస్ తమ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సిట్ దర్యాప్తుల పేరుతో డ్రామాలు చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని విమర్శించారు.
మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. విచారణలో సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? వాటికి కేసీఆర్ ఏ విధంగా సమాధానం ఇస్తారు? అన్నది ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.
ఇవీ చదవండి: KCR : కవిత వెనుక కేసీఆర్..? కాళేశ్వరం అవినీతి నుంచి బయటపడడమే లక్ష్యమా?
Kavitha Comments : కేసీఆర్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు
