Tirumala News : సూర్య జయంతిగా ప్రసిద్ధి చెందిన రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వేడుకలు అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర సందర్భంగా మూడు లక్షల మందికి పైగా భక్తులు శ్రీవారి సప్త వాహన సేవలను దర్శించుకుని తరించారు. భారీ భక్తజన సందోహం మధ్య కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏర్పాట్లపై భక్తుల నుంచి ప్రశంసల వెల్లువెత్తింది.
ఏర్పాట్లను పరిశీలించిన చైర్మన్, ఈవో
రథసప్తమి సందర్భంగా టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో కలిసి మాడ వీధుల్లోని గ్యాలరీలను పరిశీలించారు. భక్తులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చైర్మన్.. టీటీడీ అధికారులు, విజిలెన్స్ విభాగం, జిల్లా పోలీసులు, యంత్రాంగం మధ్య సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయడం వల్ల వేడుకలను విజయవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవలందించిన అధికారులు, సిబ్బంది, పోలీసు విభాగం, శ్రీవారి సేవకులు, భక్తులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
భక్తులకు 14 రకాల అన్నప్రసాదాలు
భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిరంతరంగా 14 రకాల అన్నప్రసాదాలను పంపిణీ చేసింది. ఇందులో సాంబార్ రైస్, టమాటా రైస్, పెరుగు అన్నం, సుండలు, బాదం మిల్క్ వంటి ప్రసాదాలు ఉన్నాయి.
ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా
2,000 మంది సేవకులు అన్నప్రసాద వితరణకు
750 మంది తాగునీటి సరఫరాకు
250 మంది భక్తుల రద్దీ నియంత్రణకు నియమించబడ్డారు.
గ్యాలరీల్లో మొబైల్ వాటర్ డ్రమ్స్ ద్వారా నిరంతర తాగునీటి సరఫరా చేపట్టారు.
వర్షాన్ని లెక్కచేయకుండా వాహన సేవల దర్శనం
మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తులకు ఎండ, వర్షం నుంచి ఇబ్బంది కలగకుండా పందిళ్లు ఏర్పాటు చేశారు. వర్షం కురిసినా భక్తులు ఆధ్యాత్మిక ఉత్సాహంతో వాహన సేవలను దర్శించుకున్నారు.
కళారూపాలు, వైద్య సేవలు ప్రత్యేక ఆకర్షణ
రథసప్తమి సందర్భంగా 56 రకాల సంప్రదాయ కళారూపాల్లో 1,000 మందికిపైగా కళాకారులు తమ ప్రదర్శనలతో భక్తులను ఆకట్టుకున్నారు. అలాగే భక్తుల కోసం నిరంతర మొబైల్ వైద్య సేవలు అందుబాటులో ఉంచారు. సెక్టోరల్ అధికారులు, డిప్యూటేషన్ సిబ్బంది 24 గంటల పాటు సౌకర్యాలను పర్యవేక్షించారు.
భద్రత, పర్యవేక్షణ పకడ్బందీగా
సుమారు 2,500 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు
3,500 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు.
రథసప్తమి వేడుకలు భక్తి, క్రమశిక్షణ, సేవాభావానికి ప్రతీకగా తిరుమలలో ఘనంగా ముగిశాయి.
ఇవీ చదవండి: Tirumala : తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు బంద్.. రథసప్తమి వేడుకల నేపథ్యం
Tirumala : జనవరి 25న తిరుమలలో వైభవంగా రథసప్తమి.. 24 నుంచి 26 వరకు ఆ టోకెన్లు రద్దు
