HomeNationalPM Modi in TamilNadu : మార్పు దిశగా తమిళనాడు అడుగులు వేస్తోంది.. డీఎంకే పాలనకు...

PM Modi in TamilNadu : మార్పు దిశగా తమిళనాడు అడుగులు వేస్తోంది.. డీఎంకే పాలనకు కౌంట్‌డౌన్ మొదలైందన్న ప్రధాని మోదీ

PM Modi in TamilNadu : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలు ప్రచారంలో వేగం పెంచగా, కేంద్ర రాజకీయాలు కూడా తమిళనాడు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మధురాంతకంలో నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ, డీఎంకే ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తమిళనాడు ఇప్పుడు స్వేచ్ఛ, మార్పు కోరుకుంటోందని పేర్కొన్న ప్రధాని, డీఎంకే పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాలనే ప్రజల ఆకాంక్ష స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన, సురక్షితమైన, అవినీతి రహితంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.

“డీఎంకే ప్రభుత్వ నిష్క్రమణకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది”

మధురాంతకంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ—
“తమిళనాడు మార్పు కోరుకుంటోంది. డీఎంకే దుష్పరిపాలన నుంచి బయటపడాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించాలంటే అవినీతిని పూర్తిగా తొలగించాలి. డీఎంకే ప్రభుత్వం నిష్క్రమించే సమయం దగ్గరపడింది. వారి పాలనకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది” అని వ్యాఖ్యానించారు.

“ప్రజల నమ్మకాన్ని డీఎంకే వమ్ము చేసింది”

డీఎంకే పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని,
“రెండుసార్లు ప్రజలు మెజారిటీ ఇచ్చినా, ఆ నమ్మకాన్ని డీఎంకే ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయింది. ఎన్నో హామీలు ఇచ్చారు.. కానీ వాటిలో చాలా అమలు కాలేదు. అందుకే ఇప్పుడు ప్రజలు డీఎంకే ప్రభుత్వాన్ని ‘సీఎంసీ ప్రభుత్వం’గా పిలుస్తున్నారు. అంటే అవినీతి, మాఫియా, నేరాలకు అండగా నిలిచే ప్రభుత్వం అన్నమాట” అని అన్నారు.

డీఎంకే–సీఎంసీ వ్యవస్థను రాష్ట్ర ప్రజలు పూర్తిగా తిరస్కరించాలని నిర్ణయించుకున్నారని, తమిళనాడులో డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని మోదీ స్పష్టం చేశారు.

“ఒకే కుటుంబం చుట్టూనే ప్రభుత్వం తిరుగుతోంది”

డీఎంకే పాలన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా సాగుతోందని ప్రధాని ఆరోపించారు.
“ఈ ప్రభుత్వం మొత్తం ఒకే కుటుంబం ఆధీనంలో నడుస్తోంది. డీఎంకేలో ఎదగాలంటే మూడు లేదా నాలుగు మార్గాలే ఉన్నాయి — బంధుప్రీతి, అవినీతి, నేర కార్యకలాపాలు. వీటితో సంబంధం ఉన్నవారికే పార్టీలో స్థానం లభిస్తోంది. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు తీవ్రంగా హానికరం” అని అన్నారు.

రాష్ట్ర ప్రజలకు ఎవరి జేబుల్లోకి డబ్బులు వెళ్తున్నాయో, ఎక్కడ ఎంత అవినీతి జరుగుతోందో బాగా తెలుసని మోదీ వ్యాఖ్యానించారు.

“ఈ భూమి దేశానికి గర్వకారణం”

తమిళనాడు గొప్ప చరిత్ర కలిగిన రాష్ట్రం అని పేర్కొన్న ప్రధాని,
“ఈ భూమి భారత నాగరికతకు పునాది వేసింది. అన్ని రంగాల్లో దేశానికి గౌరవాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు భారత్ అభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతున్న వేళ, తమిళనాడును డీఎంకే సంకెళ్ల నుంచి విడుదల చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం ఎంత త్వరగా విముక్తి పొందితే, దేశం అంత వేగంగా పురోగమిస్తుంది” అని తెలిపారు.

“ఎన్డీఏ ప్రభుత్వం తమిళనాడుకు భారీగా నిధులు ఇచ్చింది”

గత 11 ఏళ్లలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తమిళనాడు అభివృద్ధికి అపూర్వ సహకారం అందించిందని ప్రధాని మోదీ వెల్లడించారు.
“మునుపటి ప్రభుత్వాల హయాంలో రాష్ట్రానికి పరిమిత నిధులే వచ్చాయి. కానీ గత 11 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లకు పైగా నిధులను తమిళనాడుకు కేటాయించింది. ఇది గతంతో పోలిస్తే మూడింతలు ఎక్కువ. ఈ నిధులన్నీ ప్రజల సంక్షేమం, మౌలిక వసతులు, అభివృద్ధి కోసం వినియోగించాం” అని తెలిపారు.

ఇవీ చదవండి: Thalapathy Vijay : విజయ్ ‘జన నాయకుడు’కు మరో ఎదురుదెబ్బ.. నిర్మాతలకు ఓటీటీ సంస్థ వార్నింగ్!
TTD Anna Prasadam: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక టీటీడీ ఆలయాలన్నింటిలోనూ రెండు పూటల అన్నప్రసాదం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు