Crime News: సినిమా కథను తలపించే షాకింగ్ క్రైమ్ ఇది. హౌస్ లోన్ మాఫీ కోసమే భర్తను హతమార్చి, ఆ మరణాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భార్య బాగోతం చివరకు బయటపడింది. శవం దగ్గర బోరున విలపిస్తూ అమాయకురాలిలా నటించిన ఆ భార్యే అసలు హంతుకురాలని పోలీసులు తేల్చడంతో గ్రామం మొత్తం షాక్‌కు గురైంది.
మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం బోడమంచతండా సమీపంలో ఈ నెల 22న ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదే తండాకు చెందిన కౌలు రైతు భూక్యా వీరన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రోడ్డు పక్కన అతడి మృతదేహం, శవంపై బైక్ పడేసి ఉండటంతో మొదట ఇది రోడ్డు ప్రమాదంగా కనిపించేలా సీన్ క్రియేట్ చేశారు.
అయితే సంఘటన స్థలంలో కనిపించిన రక్తపు మరకలు పోలీసులకు అనుమానాలు కలిగించాయి. ఎక్కడో హత్య చేసి, మృతదేహాన్ని అక్కడికి ఈడ్చుకువచ్చినట్టు స్పష్టమైన ఆనవాళ్లు లభించడంతో ఇది పక్కా హత్యేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
మృతుడి భార్య విజయ శవం వద్ద బోరున విలపిస్తూ, తన భర్తను ఎవరో పథకం ప్రకారం చంపి యాక్సిడెంట్‌లా చూపించారని పోలీసుల వద్ద, మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రోదనలు చూసి గ్రామస్తులంతా కన్నీరు పెట్టుకున్నారు. కానీ అదే నాటకం చివరకు ఆమెనే దోషిగా మార్చింది.
ఈ ఘటనతో తండాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వీరన్న హత్య వెనుక RMP భరత్ పాత్ర ఉందన్న అనుమానంతో గ్రామస్థులు అతడి బైక్‌ను, హాస్పిటల్ ఫర్నిచర్‌ను దగ్ధం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు భారీగా మోహరించారు.
టెక్నాలజీ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు కేవలం 24 గంటల్లోనే అసలు నిందితులను పట్టుకున్నారు. మృతుడి భార్య విజయ, ఆమె ప్రియుడు బాలాజీ, అలాగే ఇదే గ్రామానికి చెందిన RMP భరత్ – ఈ ముగ్గురే హత్యకు పాల్పడినట్లు తేల్చారు.
పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. వీరన్న అప్పుల ఊబిలో కూరుకుపోయి భూమి అమ్మినా అప్పులు తీరలేదు. ఈ క్రమంలో విజయకు బాలాజీతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటికే అతనితో ఆర్థిక లావాదేవీలు కూడా జరిగాయి. ఇదే సమయంలో RMP భరత్ వీరికి ఒక ప్రమాదకరమైన సలహా ఇచ్చాడు.
ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ద్వారా హౌస్ లోన్ తీసుకుంటే, అప్పు తీసుకున్న వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే లోన్ మాఫీ అవుతుందని చెప్పాడు. ఇదే అవకాశంగా భావించిన విజయ, బాలాజీ కలిసి వీరన్నను హతమార్చితే లోన్ మాఫీ అవుతుందని, తమ సంబంధానికి అడ్డంకి ఉండదని భావించారు. ఆ పక్కా ప్లాన్ ప్రకారమే వీరన్నను హత్య చేసి, ప్రమాదంగా చూపించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ కేసు వివరాలను తిరుపతిరావు మీడియాకు తెలిపారు. ముగ్గురు నిందితుల అరెస్టుతో గ్రామంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ఇక ఎలాంటి ఉద్రిక్తతలు లేవని పోలీసులు స్పష్టం చేశారు.
భర్తను చంపించి అమాయకురాలిలా నటించిన భార్య నాటకం బయటపడటంతో గ్రామస్తులు నివ్వెరపోయారు. చివరకు నేరం చేసినవారు కటకటాల పాలవ్వడంతో రెండు రోజులుగా కొనసాగిన టెన్షన్‌కు తెరపడింది.
ఇవీ చదవండి: Telangana Crime : పెళ్లయిన నెలకే ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య
OTT Cinema: భర్తలను చంపేందుకు భార్యల డీల్… ట్విస్టుల మీద ట్విస్టులతో సాగే రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్
Vizag crime : విశాఖ పెందుర్తి: దొంగ-పోలీస్ ఆట పేరుతో అత్తను కాల్చి చంపిన కోడలు లలిత.. షాకింగ్!
