Andhra Crime : విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని ఎరుకొండ గ్రామంలో చోటుచేసుకున్న విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. అదే గ్రామానికి చెందిన వివాహిత శొఠ్యాం పుష్ప (20) మంగళవారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లై కేవలం మూడు నెలలే కావడంతో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
వివరాల ప్రకారం.. పూసపాటిరేగ ఎస్సీ కాలనీకి చెందిన పుష్ప, ఎరుకొండ గ్రామానికి చెందిన శొఠ్యాం శివ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియకుండా పుష్ప ఇంటి నుంచి వెళ్లిపోవడంతో వ్యవహారం బయటపడింది. అనంతరం ఇరు కుటుంబాల సమక్షంలో ముందుగా రిజిస్టర్ వివాహం జరిపించగా, మూడు నెలల క్రితం సంప్రదాయ పద్ధతిలో వివాహం నిర్వహించారు.
వివాహం తర్వాత పుష్ప, శివ దంపతులు ఎరుకొండలో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పుష్ప ఉరివేసుకుంది. చివరి క్షణాల్లో గమనించిన భర్త శివ ఆమెను వెంటనే భోగాపురం సీహెచ్‌సీకి తరలించినప్పటికీ, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానిక ఎస్సై దుర్గాప్రసాద్‌తో పాటు తహసీల్దార్ ఎన్వీ రమణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉండగా, ఈ ఘటనకు సంబంధించి పుష్ప తల్లిదండ్రులు కీలక ఆరోపణలు చేశారు. కొద్ది రోజులుగా వరకట్నం తీసుకురావాలని భర్త శివతో పాటు అతని కుటుంబ సభ్యులు తమ కుమార్తెను వేధింపులకు గురిచేశారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నామని, అడిగిన మొత్తాన్ని ఇవ్వలేకపోవడంతోనే వేధింపులు పెరిగాయని వారు పేర్కొన్నారు.
ఈ వేధింపులను తట్టుకోలేకే పుష్ప ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లైన మూడు నెలలకే కుమార్తెను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇవీ చదవండి: Telangana : మైనర్ బాలికతో వివాహితుడి సంబంధం.. చివరకు!
Perfume : అరచేతిపై పెర్ఫ్యూమ్ వాడితే అదృష్టం వస్తుందా? శుక్ర పర్వతంతో సంబంధం ఏమిటి? నిపుణుల వివరణ
