Hyderabad: హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు త్వరలో మరికొన్ని ప్రత్యేక ఆకర్షణలు చేరనున్నాయి. జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా అనంత్ అంబానీకి చెందిన వంతారా (గుజరాత్) నుంచి ఒక మగ, ఒక ఆడ కంగారూ జంట హైదరాబాద్ జూపార్క్‌కు రానుంది. దీనికి ప్రతిగా హైదరాబాద్ జూ నుంచి ఒక ఏనుగును వంతారాకు పంపనున్నారు.
ఇదే తరహా జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది అక్టోబర్‌లో, దాదాపు మూడు దశాబ్దాల తర్వాత హైదరాబాద్ జూకు రెండు మగ, ఒక ఆడ జీబ్రాలు వచ్చాయి. అదే సమయంలో హైదరాబాద్ జూ నుంచి 20 మౌస్ డీర్‌లను వంతారాకు తరలించారు.
వచ్చే వారం కంగారూ జంట రాక
కంగారూ జంట వచ్చే వారం హైదరాబాద్ జూలాజికల్ పార్క్‌కు చేరుకునే అవకాశం ఉందని జూ పీఆర్‌ఓ హనీఫుల్లా తెలిపారు. వీటి కోసం అవసరమైన ప్రత్యేక ఎంక్లోజర్‌ను ఇప్పటికే 2020లోనే సిద్ధం చేశామని ఆయన వెల్లడించారు. కంగారూలతో పాటు ఒక వాలబీ జంట కూడా జూపార్క్‌కు రానుందని తెలిపారు.
మైసూరు జూ నుంచి ఆడ జిరాఫీ
అదేవిధంగా మైసూరు జూ నుంచి ఒక ఆడ జిరాఫీని కూడా హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. ప్రస్తుతం జూపార్క్‌లో ఉన్న ‘సన్నీ’ అనే మగ జిరాఫీకి తోడుగా ఈ ఆడ జిరాఫీని తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు.
జంతు మార్పిడి కార్యక్రమాలు కొనసాగుతూనే
హైదరాబాద్ జూ అధికారులు దేశవ్యాప్తంగా ఉన్న పలు జూలతో కలిసి మరిన్ని జంతు మార్పిడి కార్యక్రమాలను ప్రతిపాదించారు. వాటిలో కొన్ని ఇప్పటికే పూర్తికాగా, మరికొన్ని సెంట్రల్ జూ అథారిటీ (CZA) అనుమతుల కోసం వేచి ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్ జూ ప్రత్యేకత
సుమారు 380 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో 100కు పైగా రకాల జంతువులు, పక్షులు, సర్పాలు ఉన్నాయి. భారతీయ ఖడ్గమృగం, ఆసియాటిక్ సింహం, బెంగాల్ పులి, ప్యాంథర్, గౌర్, భారతీయ ఏనుగు, స్లెండర్ లోరిస్, పైథాన్‌తో పాటు వివిధ రకాల జింకలు, యాంటిలోపులు ఇక్కడ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.
అలాగే జూ సమీపంలో ఉన్న మీర్ ఆలమ్ చెరువు ప్రతి ఏడాది వందలాది వలస పక్షులను ఆకర్షిస్తూ, నెహ్రూ జూపార్క్‌కు మరింత అందాన్ని, ఆకర్షణను జోడిస్తోంది.
ఇవీ చదవండి: Mukesh Ambani : ముఖేష్ అంబానీలా మొక్కితే కోటీశ్వరులవుతారా?
Ambani: అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ బాష్.. బాలీవుడ్ తారలంతా అక్కడే ఉన్నారుగా…!
